విధాత: పెళ్లి అనగానే ఫ్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్టు వెడ్డింగ్ షూట్స్ సర్వసాధారణం అయిపోయాయి. ఈ షూటింగ్స్‌కు మంచి మంచి లోకేషన్స్‌ను ఎంచుకుంటారు. ఇక కొందరైతే సెల్ఫీల మోజులో పడిపోతారు. తన పక్కన ఏం జరిగినా పట్టించుకోకుండా సెల్ఫీల మాయలో పడిపోతారు. అలానే ఓ పెళ్లి కూతురు సెల్ఫీ దిగేందుకు ఓ క్వారీ గుంత వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారీ 120 ఫీట్ల లోతు గుంతలో పడిపోయింది. దీంతో కాసేపట్లో జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొల్లం జిల్లా పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రాకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవలే కృష్ణన్‌కు, శాండ్రాకు నిశ్చితార్థం కూడా నిర్వహించారు. ఇక డిసెంబర్ 9వ తేదీన వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు.
పెళ్లి వేడుకల్లో భాగంగా నూతన వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ టెంపుల్‌కు వెళ్లారు. అక్కడ దేవుడిని దర్శించుకున్న అనంతరం.. దగ్గర్లోని అయిరవల్లి క్వారీ వద్దకు నూతన జంట వెళ్లింది. అక్కడున్న నీటిని చూసి శాండ్రా ముచ్చట పడింది. లోకేషన్ కూడా నచ్చడంతో సెల్ఫీ దిగేందుకు క్వారీ అంచుల్లోకి వెళ్లింది. ప్రమాదవశాత్తు 120 అడుగుల లోతులో నీటిలోపడిపోయింది.
శాండ్రాను కాపాడేందుకు కృష్ణన్ కూడా నీటిలోకి దూకేశాడు. శాండ్రాను కాపాడి ఆ క్వారీలోని ఓ బండపై కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్పగాయాలతో ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనతో శుక్రవారం జరగాల్సిన వివాహం కాస్తా వాయిదా పడింది.