మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు.. డైరెక్షన్‌ అక్కడి నుంచేనా..?

ఎమ్మెల్యేల భేటీ వెనుక మ‌త‌ల‌బు? స్కెచ్ ప్ర‌కార‌మే.. ఎమ్మెల్యేలు అస‌మ్మ‌తి గ‌ళం విప్పారా..? విధాత: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు సోమవారం మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో భేటీయైన వ్యవహారం రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న‌ది. ఎమ్మెల్యేలు మైనంపల్లి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద, భేతి సుభాష్ రెడ్డి మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా చేతులు క‌లిపిన‌ట్లు అవుతున్న ప్ర‌చారం చర్చనీయాంశమ‌వుతున్న‌ది. ఈ భేటీ తర్వాత ఆ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి వ్యవహార శైలిపై మీడియా సమక్షంలోనే అసమ్మతి వ్యక్తం చేయ‌టం […]

  • Publish Date - December 19, 2022 / 01:15 PM IST
  • ఎమ్మెల్యేల భేటీ వెనుక మ‌త‌ల‌బు?
  • స్కెచ్ ప్ర‌కార‌మే.. ఎమ్మెల్యేలు అస‌మ్మ‌తి గ‌ళం విప్పారా..?

విధాత: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు సోమవారం మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో భేటీయైన వ్యవహారం రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న‌ది. ఎమ్మెల్యేలు మైనంపల్లి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద, భేతి సుభాష్ రెడ్డి మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా చేతులు క‌లిపిన‌ట్లు అవుతున్న ప్ర‌చారం చర్చనీయాంశమ‌వుతున్న‌ది. ఈ భేటీ తర్వాత ఆ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి వ్యవహార శైలిపై మీడియా సమక్షంలోనే అసమ్మతి వ్యక్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

వీరంతా త‌మ తమ నియోజకవర్గాల్లో మంత్రి మితి మీరి తల దూర్చడం భ‌రించ‌లేనిదిగా త‌యారైంద‌ని వాపోతున్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మల్లారెడ్డి ఏకపక్ష వైఖరిపై సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇంతవరకు కథ బాగానే ఉన్నది. అసలు సీఎం కేసీఆర్‌కు సమాచారం లేకుండా ఎమ్మెల్యేల భేటీ సాధ్యమా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల సమయంలో సదరు ఎమ్మెల్యేలంతా మల్లారెడ్డికి మద్దతుగా నిలిచారు. త‌మ సంఘీభావం ప్ర‌క‌టించారు.

ఇంతలోనే మల్లారెడ్డిపై వారు అధినేత కేసీఆర్‌కు సైతం తెలియకుండా తమ అసమ్మతిని బాహాటంగా వెళ్లగక్కడంలో అంతర్యమేమిటన్న దానిపై గులాబీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే.. మల్లారెడ్డికి ప్రగతిభవన్‌కు మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆ అయిదుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించారన్న ప్ర‌చారం గుప్పుమంటున్న‌ది.

ఐటీ దాడుల పరిణామాల త‌ర్వాత మంత్రి మ‌ల్లారెడ్డి కేంద్రంలోని బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో సరెండర్ అయినట్లుగా గుస‌గుస‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మల్లారెడ్డిని దూరం పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారన్న గుసగుసలు గులాబీ గూటిలో వినిపిస్తున్నాయి.

మల్లారెడ్డి వ్యాపారాల్లో సింహభాగం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయని, కేంద్రంతో పేచి పెట్టుకుని నష్టపోవడం కంటే రాజీ పడటం మేలని భావించిన మల్లారెడ్డి బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు సాగించారనే ప్ర‌చార‌మున్న‌ది. విషయం తెలిసిన కేసీఆర్ మల్లారెడ్డిని దూరం పెట్టేందుకు సిద్ధపడ్డారని తెలుస్తున్న‌ది. అందుకే మల్లారెడ్డికి వ్యతిరేక వ్యూహంలో భాగంగా అయిదుగురు ఎమ్మెల్యేల అసమ్మతి గ‌ళం వినిపించార‌ని అనుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రారంభానికి ఢిల్లీ వెళ్లి వచ్చాక మంత్రి మల్లారెడ్డి ఆయనను కలవకపోవడం గమనార్హం. మరోవైపు గద్వాల్ పర్యటనలో ఉన్న మంత్రి మల్లారెడ్డి తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురు భేటి అయినట్లుగా తనకు తెలియదని అంటున్నారు.

జిల్లా అభివృద్ధి కోస‌మే అయితే తాను కూడా ఆ మీటింగ్‌కు వెళ్లేవాడినని అన‌టం కొస‌మెరుపు. ఇదిలా ఉంటే.. ఆ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సాయంత్రం ప్రగతి భవన్‌కి రావాలని సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.