Site icon vidhaatha

ఆంధ్రప్రదేశ్ ‘నంది’.. తెలంగాణ ‘సింహ’ అవార్డులేమయ్యాయ్!

విధాత, సినిమా: తెలంగాణ రాష్ట్రం డివైడ్ అవకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాకారులను గౌరవించే నిమిత్తం.. ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు లేపాక్షి నంది పేరిట నంది పురస్కారంతో గౌరవిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 1964లో మొదలైన ఈ సంప్రదాయం.. 2016 వరకు నిరాటంకంగా జరుగుతూ వచ్చింది.

మొదట్లో బంగారు, రజత, కాంస్యం అని 3 బహుమతులు, కథకు 2.. మొత్తంగా 5 పురస్కారాలతో మొదలై.. ఆ తర్వాత దాదాపు 43 కేటగిరీలలోని ఉత్తమ కళాకారులను గుర్తించి.. వారికి ఈ అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రభుత్వం తరపు నుంచి.. తమ నటనకు గుర్తింపు దక్కిందని.. ఈ అవార్డు పొందిన వారు అప్పట్లో ఎంతో మురిసిపోయే వారు.

కానీ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ అవార్డుల ఊసే లేదు. కళాకారులు కూడా ఈ విషయంలో ఎంతో డిజప్పాయింట్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు సీనియర్ నటీనటులు సమయం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి పెట్టిందే లేదు.

తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ‘నంది’ పురస్కారం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినదిగా భావిస్తూ.. ఆ స్థానంలో తెలంగాణ రాష్ట్రం తరపున ‘సింహ’ అవార్డును ఇవ్వబోతున్నట్లుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కూడా అప్పట్లో ఆయన తెలియజేశారు.

ఆ కమిటీ విస్తృతంగా చర్చలు జరిపి మొత్తంగా 40 విభాగాల్లో ఈ ‘సింహ’ అవార్డులు ఇవ్వాలనేలా సూచించినట్లుగా వార్తలు వచ్చాయి.మొదటి విభాగంలో వాటికి రూ. 5లక్షల నగదు బహుమతిగా ఇవ్వాలని కూడా ఈ కమిటీ ప్రతిపాదించింది. ఈ కమిటీ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలపగానే.. అవార్డుల ప్రక్రియను ప్రారంభిస్తామని తలసాని తెలియజేశారు. ఇది జరిగి కూడా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది.

మళ్లీ ఎన్నికలు జరిగి.. మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే పాలన చేపట్టినా.. ఈ అవార్డుల విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణం. ఉద్యోగులకు కూడా కరెక్ట్ టైమ్‌కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. మళ్లీ ఈ అవార్డుల కోసం కొంత అమౌంట్ కేటాయించే పరిస్థితులైతే అస్సలు లేవు. అందుకే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కామ్‌గా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు కళాకారులను అవమానించినట్లుగానే కొందరు విమర్శకులు భావిస్తున్నారు.

ఎందుకంటే.. సైమా, ఫిల్మ్ ఫేర్, సంతోషం, సాక్షి.. ఇలా చిన్న చిన్న సంస్థలు కూడా అవార్డులను క్రమం తప్పకుండా ఇస్తూ వస్తున్నారు. వారు ఈ ఫంక్షన్స్‌ని ఫారిన్ కంట్రీస్‌లో కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటిది.. అంతలా కాకపోయినా.. కనీసం కళాకారులను గుర్తించే ప్రయత్నం కూడా తెలుగు రాష్ట్రాలు చేయలేకపోవడం నిజంగా విడ్డూరమనే వారు అభిప్రాయ పడుతున్నారు.

నిజంగా.. వారు ఇవ్వాలి అనుకుంటే.. ఇది చాలా చిన్న విషయం. సైమా, ఫిల్మ్ ఫేర్ వంటి ప్రైవేట్ సంస్థలకే స్పాన్సర్స్ వస్తుంటే.. ప్రభుత్వం తలచుకుంటే వాటికి కొదవే ఉండదు. ప్రభుత్వం తరపు నుంచి ఒక్క రూపాయి అవసరం లేకుండా.. ఈ పని చేయగల స్పాన్సర్స్ ఉన్నారు. ఆ దిశగా కూడా ఆలోచించ లేని పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండటం దారణమనే చెప్పుకోవాలి.

2017లో విడుదలైన బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాలకు ఎంటర్‌టైన్‌ మెంట్ పన్ను మినహాయింపు విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు.. బాలయ్య సినిమాకు టాక్స్ మినహాయింపు ఇచ్చారు కానీ.. ‘రుద్రమదేవి’ చిత్రానికి ఇవ్వలేదు. గుణశేఖర్ అప్పీల్ చేసినా.. ఆ అప్పీల్‌ను క్యాన్సిల్ చేశారు. కానీ తెలంగాణలో ఈ రెండు చిత్రాలకు కేసీఆర్ టాక్స్ మినహాయింపు ఇచ్చారు.

దీంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చలనచిత్ర రంగం పరంగా వర్గాలు ఏర్పడినట్లుగా టాక్ నడిచింది. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ఆపేయడానికి ముఖ్య కారణం.. చలనచిత్ర పరిశ్రమ ఏపీకి వెళ్లక పోవడమే అని కూడా అప్పట్లో టాక్ నడిచింది. ఇప్పటికీ ఈ గోల నడుస్తూనే ఉంది. ఏది ఏమైనా, ఇప్పటికైనా ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకుని.. ఈ అవార్డులపై దృష్టిపెడితే బాగుంటుంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి ఇవాళ ప్రపంచం చెప్పుకుంటుంది.. కానీ తెలుగు రాష్ట్రాలు ఆ పరిశ్రమను పట్టించుకోవడం లేదనే అపవాదు కూడా దూరమవుతుంది. చూద్దాం.. ‘నంది’, ‘సింహ’లపై ముందు ముందు తెలుగు రాష్ట్రాల మూవ్ ఎలా ఉండబోతుందో..?

Exit mobile version