విధాత: ఎలాంటి కసరత్తు జరగకుండానే కమిటీ ప్రకటించారని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కనీసం కమిటీ కూర్పు కోసం నన్ను కూడా సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ పదవులపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పలువురు నేతలు భట్టి నివాసానికి చేరుకొని ఆయనతో సమావేశమయ్యారు.
అనంతరం ఆయన అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కమిటీ ఏర్పాటుకు నన్ను ఎందుకు పిలవలేదో మాణిక్యం టాగూర్ ని అడిగితే తెలుస్తుందన్నారు. కమిటీకి సంబంధించి నన్ను అడిగితే చెప్పాల్సిన విషయాలు చెప్పేవాడినన్నారు. నేను ఈ ప్రక్రియలో లేనన్నారు. నన్ను ఎందుకు పిలవలేదో నాకు తెలియదన్నారు.
పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకుడు ఇద్దరూ ముఖ్యం, కానీ ఈ విషయంలో నన్ను ఎందుకు భాగస్వామ్యం చేయలేదో తెలియదన్నారు. పార్టీ పదవుల పట్ల కొందరికి అసంతృప్తి ఉందని నా దగ్గరికి వస్తున్నారని సీల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వారి వారి అసంతృప్తిని పార్టీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పానన్నారు.
పార్టీలో చాల రోజులుగా పని చేస్తున్న వారికి అవకాశం రాలేదని బాధ పడుతున్నారన్నారు. పార్టీ పదవులపై ఎస్సీ, ఎస్టీ సీనియర్ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉందన్నారు. కొంత మంది ఓయూ నాయకులు కలిసి తమకి ప్రాధాన్యత ఇవ్వలేదని, అధిష్ఠానానికి తమ అసంతృప్తి తెలియచేయాలని కోరారు.