విధాత: చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యమే ప్రజాస్వామ్య పరిణతికి తార్కానం. ఎక్కడైనా, ఏ దేశంలో అయినా చట్ట సభల్లో సమాజంలో సగభాగమైన మహిళల ప్రాతినిధ్యంపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. ఈ అర్థంలో మన దేశంలో మహిళల ప్రాతినిధ్యం చూస్తే.. తల దించుకొనే స్థితి కనిపిస్తున్నది. దేశంలోని చట్టసభల్లో 15శాతం మాత్రమే మహిళా ప్రతినిధులున్నారని అధికారికంగా ఇటీవలే పార్లమెంటుకు లిఖిత పూర్వకంగా తెలియజేయటం గమనార్హం.
దేశంలో మహిళలకు సమాన స్థాయి, గౌరవం దక్కుతున్నదని మన పాలకులు పదే పదే చెప్తుంటారు. అంతే కాదు స్త్రీని పూజనీయంగా గౌరవించే సంస్కృతి మనదని చెప్తూ అన్నింటా సమాన స్థాయి దక్కేలా చర్యలు తీసుకొంటున్నామని చెప్పుకొస్తారు. కానీ ఇప్పటి దాకా ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ 14శాతానికి మించి మహిళా ఎమ్మెల్యేలు లేరు. తెలంగాణతో సహా 13 రాష్ట్రాల్లో 10శాతం మాత్రమే మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దేశ అత్యున్న చట్టసభలైన లోక్ సభలో 14.94శాతం, రాజ్యసభలో 14.05శాతం మాత్రమే మహిళలున్నారు.
మహిళా సాధికారత, అభ్యున్నతి గురించి గొప్పలు పోయే మన నేతలు, పార్టీలు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది ప్రతీక. సమాజంలో సగభాగమైన మహిళలకు సరియైన ప్రాతినిధ్యం, పాలనలో భాగస్వామ్యం కల్పించకుండా వారిక హక్కుల పరిరక్షణ అనేది పేరుకు మాత్రమేననటంలో సందేహం లేదు. అందుకే.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించిన బిల్లు ఇప్పటికీ నోచుకోక పోవటం కాకతాలీయం కాదు. ఇది పురుషస్వామ్య రాజకీయాలకు ప్రతిబింబమేనని మహిళా ఉద్యమకారుల ఆరోపణలను కాదనలేని దుస్థితి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొంటున్న దేశంలో చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్య 15శాతం ఉంటే.. మన కన్నా చిన్న దేశాలు ఈ విషయంలో ఎంతో ముందున్నాయి. న్యూజీలాండ్‌తో సహా మరో ఆరు దేశాల్లో 50శాతం మహిళా ప్రతినిధులున్నారు. మన దేశం కన్నా ఎంతో చిన్నవైన క్యూబా, మెక్సికో, నికరాగ్వా, ర్వాండా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ లాంటి దేశాల్లో కూడా మహిళా ప్రాతినిధ్యం 50 శాతం ఉండటం గమనించదగినది.