Tribal Woman | ఓ యువతి పెళ్లికి నిరాకరించిందని.. ఆమెకు గుండు గీయించారు. అంతటితో ఆగకుండా మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు. అనంతరం దారుణంగా కొట్టి అడవిలో వదిలేశారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్‌లోని జోగిదిహ్ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జోగిదిహ్ గ్రామానికి చెందిన 24 ఏండ్ల గిరిజన యువతి తల్లిదండ్రులు ఎనిమిదేండ్ల క్రితం చనిపోయారు. దీంతో ఆ యువతి తన ఇద్దరు అక్కలు, అన్నతో కలిసి ఉంటోంది. అయితే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లి కుమారుడు వివాహ మండపానికి రాగా, యువతి పారిపోయింది. 20 రోజుల తర్వాత ఆమె స్వగ్రామానికి తిరిగి వచ్చింది.
ఇక విషయం తెలుసుకున్న కుల పెద్దలు గ్రామంలో పంచాయతీ పెట్టారు. పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం చేశారు. కానీ ఆమె అంగీకరించలేదు. ఎవర్ని ప్రేమిస్తున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. సదరు యువతి పేరు కూడా చెప్పలేదు. దీంతో ఆమెకు గుండు గీయించారు. మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు. అనంతరం దారుణంగా కొట్టి.. సమీప అడవిలో ఓ చెట్టు కింద ఆమెను వదిలేశారు. రాత్రంతా ఆ చెట్టు కిందనే ఉండిపోయింది బాధితురాలు.
ఉదయం అడవికి వెళ్లిన పశువుల కాపర్లు ఆమెను గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని చికిత్స నిమిత్తం మేదినిరాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ప్రయివేటు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.