విధాత: వైఎస్సార్ తన ౩౦ ఏండ్ల రాజకీయ జీవితంలో ప్రాంతీయ పక్షపాతం ఏనాడూ చూపలేదు. అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించి అభివృద్ధి చేశాడని వైఎస్సార్‌సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమెరికాలోని వైఎస్సార్ అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన షర్మిల ప్రజా నాయకుడిగా వైఎస్సార్ విశిష్ఠతను చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రిగా పనిచేసింది అతి తక్కువ కాలమే అయినా వైఎస్సార్ అందరికీ అన్నగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె గుర్తు చేశారు. ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక 700మంది గుండెలాగి చనిపోయారంటే.. ఆయన పట్ల ప్రజలకున్నఅభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. నేటి తెలంగాణ పాలకుల్లా కాకుండా ఆయన ప్రజల అభిమానం ఆస్తిగా సంపాదించారని షర్మిల అన్నారు.
వైఎస్సార్ ప్రజా పక్షపాతిగా, ముఖ్యంగా రైతు పక్షపాతిగా తన పాలన కొనసాగించారన్నారు. గత పాలకుల పుణ్యమాని అప్పులపాలైన రైతులను ఆదుకొనేందుకు రుణమాఫీ పథకాన్ని అమలు చేశాడని, వైఎస్సార్ ఏ పథకం ప్రారంభించినా నిజాయితీతో, నిబద్ధతతో అమలు చేశారని ఆమె తెలియజేశారు. అది ఆరోగ్య శ్రీ అయినా, ఫీజు రీయింబర్స్‌మెంట్ అయినా తాను ఆశించిన లక్ష్యం కోసం అమలు చేశారని తెలిపారు. ప్రజలను తమ కాళ్లపై తాము నిలబడేలా పథకాలను రూపొందించి అమలు చేశారని వైఎస్ షర్మిల అన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలన్నందుకు కాల్చి చంపిన సమయంలో తాను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రజలకు వైఎస్సార్ వాగ్ధానం చేశారు. ఉచిత విద్యుత్ అంటే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి టీడీపీ నేతలు ఎగతాలి చేశారు. కానీ.. ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్ అధికారం చేపట్టిన వెంటనే మొదటి సంతకం ఉచిత విద్యుత్ పథకంపై చేశారని ఆమె తెలిపారు.
వివక్ష,అణిచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకుని ఉద్యమకారుడని అందలం ఎక్కిస్తే.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ప్రస్తుత పాలనపై వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ ఎనిమిదేండ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమేనా అని నిలదీశారు. రుణమాఫీ అని రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైందని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్ అర్ అంటే ఎంత ప్రేమ ఉన్నదో, ఆ బాధ్యతతోనే తాను తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నానని ప్రకటించారు. ప్రజలను సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని వైఎస్‌ఆర్ అభిమానులకు సూచించారు.
తెలంగాణ ప్రజల కోసం పోరాడు అని నాన్న నా గుండెలపై విల్లు రాశాడని తెలిపారు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ సెట్టానని తెలియజేశారు. ప్రజలను కలిసేందుకు, వారి కష్టాలను, కడగండ్లను ప్రత్యక్షంగా చూసేందుకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావనీ, ప్రజలను ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆమె వైఎస్సార్ అభిమానులకు పిలుపునిచ్చారు.