న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనధికార లోన్ యాప్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలను వేధిస్తున్న లోన్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 87 అనధికార లోన్ యాప్స్ పై నిషేధం విధించింది. ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభకు తెలియజేశారు. అక్రమ లోన్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో రుణ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలతో సహా, ఇతర కంపెనీలపై కూడా కంపెనీల చట్టం, 2013 ప్రకారం విచారణ, ఖాతా పుస్తకాల తనిఖీ దర్యాప్తు లాంటి నియంత్రణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు
సైబర్ మోసాలు, వేధింపులు, వడ్డీ దోపిడీలపై తరుచూ ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లుగా పేర్కొంది. ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి లోన్ యాప్స్‌పై సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీల చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టం దేశంలో నమోదైన కంపెనీల నియంత్రణ, పాలనకు సంబంధించినది. అక్రమ లోన్ యాప్‌ల ద్వారా మోసపోతున్న ప్రజలకు రక్షణ కల్పించడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశం. తనిఖీల ఆధారంగా కంపెనీల చట్టం, 2013 కింద ఏదైనా ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఆర్థిక మోసాలను అరికట్టడానికి, వినియోగదారుల భద్రత కోసం కేంద్రం ఈ చర్యలు తీసుకోనుంది.
