మెడిటేష‌న్, యోగాతో కేజ్రీవాల్ దిన‌చ‌ర్య ప్రారంభం.. అల్పాహారంగా టీ, బ్రెడ్..!

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అరెస్టై జైలు పాలైన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.. తీహార్ జైల్లో టీ, బ్రెడ్‌తో త‌న బ్రేక్ ఫాస్ట్‌ను ప్రారంభించారు

  • Publish Date - April 2, 2024 / 12:40 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అరెస్టై జైలు పాలైన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.. తీహార్ జైల్లో టీ, బ్రెడ్‌తో త‌న బ్రేక్ ఫాస్ట్‌ను ప్రారంభించారు. సోమ‌వారం ఆయ‌న‌కు 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ కోర్టు విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు త‌ర‌లించారు. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు ఆయ‌న జైల్లోనే ఉండ‌నున్నారు.

ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఉద‌యం 6:40 గంట‌ల‌కు బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసిన‌ట్లు జైలు వ‌ర్గాల ద్వారా తెలిసింది. తీహార్ జైలు నంబ‌ర్ 2లో ఆయ‌న ఉంటున్నారు. ఇక గంట పాటు ఆయ‌న త‌న గ‌దిలో మెడిటేష‌న్ చేసిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం యోగా కూడా చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు లంచ్ అంద‌జేయ‌నున్నారు. సాయంత్రం 5:30 గంట‌ల‌కు డిన్న‌ర్ కంప్లీట్ కానుంది. ఇత‌ర ఖైదీల మాదిరిగానే అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ఉద‌యం 5 నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు జైల్లో టీవీ చూడొచ్చు. ఇక అర‌వింద్ కేజ్రీవాల్ ఉంటున్న బ్యార‌క్‌లో దోమ‌ల నివార‌ణ‌కు మ‌స్కిటో నెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మస్కిటో నెట్స్ జైల్లోని అన్ని బ్యార‌క్‌ల‌లో కూడా ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం.

త‌న‌కు 15 రోజుల క‌స్ట‌డీ విధించిన నేప‌థ్యంలో కేజ్రీవాల్ కోర్టుకు కొన్ని అభ్య‌ర్థ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. జైల్లో చ‌దివేందుకు రామాయ‌ణం, భ‌గ‌వ‌ద్గీత‌, జ‌ర్న‌లిస్టు నీరజా చౌద‌రి రాసిన హౌ ప్రైమ్ మినిస్ట‌ర్స్ డిసైడ్ వంటి పుస్త‌కాల‌ను అందుబాటులో ఉంచాల‌ని కోరారు. అలాగే ఒక బ‌ల్ల‌, కుర్చీ, మందులు, డైట్ ప్ర‌కారం ఆహారం అందించాల‌ని అడిగారు. ఇప్ప‌టికే ధ‌రిస్తున్న లాకెట్‌ను కొన‌సాగించేందుకు అనుమ‌తించాల‌ని కోర్టును కోరారు.

Latest News