Site icon vidhaatha

CM Kejriwal | కేజ్రీవాల్‌కు జూలై 25 వరకూ కస్టడీని పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

న్యూఢిల్లీ : సీబీఐ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం జూలై 25 వరకూ పొడిగించింది. లిక్కర్‌ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట హాజరుపర్చారు. కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటు కాపీని ఆయన తరఫు న్యాయవాదికి రౌస్‌ అవెన్యూ కోర్టు అందించింది. ఈ చార్జిషీటును కోర్టు అప్పటికే పరిగణనలోకి తీసుకున్నది.

ఒకవైపు తన విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశించినా.. సీబీఐ కేసు నేపథ్యంలో కేజ్రీవాల్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే కేజ్రీవాల్‌ను సీబీఐ వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నది. సీబీఐ కేసును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు జూలై 17న విచారించనున్నది.

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆప్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది సత్యానికి లభించిన విజయమని ఆ పార్టీ నేతలు అతిశి, సౌరభ్‌ భరద్వాజ్‌, సందీప్‌ పాఠక్‌ అన్నారు. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇస్తుందని బీజేపీకి ముందే తెలుసని, అందుకే, సీబీఐతో ఆయనను అరెస్టు చేయించిందని అతిశి విమర్శించారు.

Exit mobile version