CM Kejriwal | లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ

లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. ఆయన అరెస్టుకు ముందు తీహార్‌ జైలు అధికారులు విచారణ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చారు

  • Publish Date - June 26, 2024 / 03:48 PM IST

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. ఆయన అరెస్టుకు ముందు తీహార్‌ జైలు అధికారులు విచారణ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చారు. స్పెషల్‌ జడ్జి అమితాబ్‌ రావత్‌ను కస్టడీలో తీసుకుని విచారించేందుకు సీబీఐ అనుమతి కోరింది. అంతకు ముందు మంగళవారం సాయత్రం తీహార్‌ జైల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. విచారణ కోర్టు జారీ చేసిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు జూన్‌ 21న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్‌ లీగల్‌ టీమ్‌ ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాజా పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

ఈడీ స్టే అప్లికేషన్‌పై ఢిల్లీ హైకోర్టు తుది ఆదేశాలు జారీ చేసిందని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకుని, జూన్‌ 25, జూన్‌ 21న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తామని చెప్పారు. కేజ్రీవాల్‌ తాజాగా పిటిషన్‌ దాఖలు చేసేందుకు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి వెకేషన్‌ అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసుందని భయపడిన మోదీ ప్రభుత్వం.. కేజ్రీవాల్‌ ఏడాది క్రితమే దర్యాప్తునకు హాజరైన అంశంలో నీచ ఎత్తుగడలతో సీబీఐకి చెప్పి అరెస్టు చేయించిందని ఎక్స్‌ ఖాతాలో ఆరోపించింది. బీజేపీ కక్షపూరిత ఆలోచనలను మార్చుకోలేదని దీని ద్వారా వెల్లడవుతున్నదని పేర్కొన్నది.

Latest News