హైదరాబాద్, విధాత :
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్ కు గురైన డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీసు హర్చరణ్ సింగ్ భుల్లర్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని పంజాబ్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. గతవారం సీబీఐ అధికారులు భుల్లర్ నివాసంలో జరిపిన దాడుల్లో రూ.7.5 కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలు, 50 ఆస్తులను కనుగొన్నది. ఆ తరువాత సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకోవడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తప్పించింది.
అవినీతి కేసులో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖను కోరినప్పటికీ, రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారుల తొలగింపులో నిబంధనల ప్రకారం విధానాలు పాటించాల్సి ఉంటుంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారిని ఉద్యోగంలో నుంచి తీసివేయలేదు. అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుందని, ఆ తరువాత రాష్ట్రాల వారిగా కేటాయింపులు చేస్తారని ఒక అధికారి తెలిపారు. నియామక అధికారం లేనప్పుడు విధుల నుంచి శాశ్వతంగా తీసివేసే అధికారం కూడా రాష్ట్రాలకు ఉండదన్నారు. అవినీతి కేసులో ఇరుక్కున్న ఏ ఒక్క అధికారిని కూడా క్షమించవద్దని, భుల్లర్ తొలగింపు ద్వారా గట్టి సందేశం ఇవ్వాలనే యోచనలో పంజాబ్ లోని ఆప్ సర్కార్ ఉంది. అవినీతి అధికారులను గుర్తించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని ఆ రాష్ట్ర గవర్నర్ గులాబ్ చంద్ కఠారియా అన్నారు. డీఐజీ స్థాయి పోలీసు అధికారి వద్ద ఇంత స్థాయిలో ఆస్తులు ఉన్నాయంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు.