హైదరాబాద్‌లో సీబీఐ(CBI) అధికారులతో ఆ శాఖ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(Praveen Sood) శుక్రవారం నాడు భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) అవకతవకల ఆరోపణలపై విచారణ జరపాలని సీబీఐని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసింది. ఈ లేఖ తమకు అందిందని సీబీఐ అధికారులు కూడా ప్రకటించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సూద్ ఇక్కడ ఉన్న సీబీఐ అధికారులతో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. కాళేశ్వరంపై విచారణను కోరుతూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ లేఖ రాసిన తర్వాత సీబీఐ డైరెక్టర్ ఇక్కడి అధికారులతో భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుమారు రెండు గంటల పాటు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
హైదరాబాద్ లో ఎస్పీ స్థాయి అధికారి ఉంటారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్ చర్చించారా… లేదా ఇతర అంశాలపై చర్చించారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో గత నెల 31న చర్చ జరిగింది. ఈ చర్చకు సమాధానమిస్తూ కాళేశ్వరంలో ఏం జరిగిందో బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 1వ తేదీనే సీబీఐ(CBI) అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై లేఖ రాసింది. రాజకీయ కక్షతోనే సీబీఐ దర్యాప్తును రేవంత్ సర్కార్ కోరిందని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే రెండేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రయోజనం ఉంటుందా అనే అనుమానాన్ని కమలం పార్టీ వ్యక్తం చేస్తోంది.