Vendors Apply Rat Poison To Fruits | ఫ్రూట్స్ (Fruits) ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల పండ్లు దొరుకుతున్నాయి. వాటిని మనం రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. అయితే, కొందరు ఫ్రూట్స్‌ను మార్కెట్ నుంచి తీసుకొచ్చి కడకుండా అలానే తినేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొందరు వ్యాపారులు పండ్లను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు మందులు రాస్తున్నారు (Vendors Apply Rat Poison To Fruits).
ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ పెరిగిపోయింది. తినే తిండి నుంచి తాగే పాల వరకూ అన్నింటిలోనూ రసాయనాలను కలుపుతున్నారు. ముఖ్యంగా పండ్ల విక్రేతలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పండ్లు పాడవకుండా ఎక్కువరోజులు నిల్వ ఉండేందుకు, ఎలుకల నుంచి వాటిని కాపాడుకునేందుకు రకరకాల మందులను కలుపుతున్నారు. తాజాగా ఓ దుకాణదారుడు పండ్లను ఎలుకల బారి నుంచి కాపాడుకునేందుకు వాటికి ఎలుకల మందు రాస్తున్న ఘటన వెలుగు చూసింది.
మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లోని మాలాడ్ వెస్ట్ ఏరియా (Malad West area)లో చాలా మంది తోపుడు బండ్లపై పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. పగలంతా పండ్లను విక్రయించి.. రాత్రికి వాటిని నీట్‌గా కప్పేస్తారు. అయితే, అలా కప్పిఉంచినప్పుడు ఎలుకలు ఆ పండ్లను కొరికేస్తున్నాయి. ఇది గమనించిన మనోజ్, రాహుల్ అనే ఇద్దరు వ్యాపారులు.. ఎలుకల బారి నుంచి పండ్లను కాపాడుకునేందుకు వాటికి రాటోల్ అనే ఎలుకల మందును పూశారు (Rat Poison). అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించి వీడియో తీశాడు. వీడియో ఆధారంగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రాటోల్ అనే ఎలుకల మందును స్వాధీనం చేసుకున్నారు. పండ్లను కూడా సీజ్ చేశారు. ఆ మందు చాలా విషపూరితమైనదిగా అధికారులు గుర్తించారు. ఇలాంటి ప్రమాదకరపనులు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని ఇతర వ్యాపారులకు అధికారులు స్పష్టం చేశారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు. పండ్లు కొన్నాక అలాగే తినొద్దని, వాటిని శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
USA Nebraska Sinkhole : అమెరికా రోడ్లపై సింక్ హోల్స్ టెర్రర్
ViRosh Wedding : వివాహ బంధంతో ఒక్కటైన విజయ్, రష్మిక..!
