Sunita Kejriwal | నియంతను నాశనం చేయాలి: తన భర్తకు సీబీఐ కస్టడీపై కేజ్రీవాల్‌ భార్య సునీత

ఎక్సయిజ్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకోవడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ గురువారం మరోసారి నిప్పులు చెరిగారు

  • Publish Date - June 27, 2024 / 04:06 PM IST

న్యూఢిల్లీ : ఎక్సయిజ్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకోవడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ గురువారం మరోసారి నిప్పులు చెరిగారు. ‘దేవుడు అందరికీ విజ్ఞాన్నాన్ని ఇవ్వాలనేది ఇప్పటి వరకూ అందరి ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన నియంత నాశనం కావాలనేది’ అని సునీత ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కేజ్రీవాల్‌ బయటకు రాకుండా యావత్‌ వ్యవస్థ ప్రయత్నాలు చేస్తున్నదని బుధవారం కూడా ఆమె తీవ్ర పదజాలంతో పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌కు జూన్‌ 20న బెయిల్‌ వచ్చింది. ఆ వెంటనే ఈడీ దానిపై స్టే తెచ్చుకున్నది. ఆ మరుసటి రోజే సీబీఐ ఆయనను నిందితుడిగా పేర్కొన్నది.

ఈ రోజు (బుధవారం) ఆయన అరెస్టయ్యారు. ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు యావత్‌ వ్యవస్థ ప్రయత్నిస్తున్నది. ఇది న్యాయం కాదు. ఇది నియంతృత్వం. ఇది ఎమర్జెన్సీ’ అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను బుధవారం మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. రిమాండ్‌ సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన భార్యను, న్యాయవాదిని 30 నిమిషాలు కలుసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రిమాండ్‌ కాలంలో తాను వాడే ఔషధాలను తీసుకువెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఎక్సయిజ్‌ పాలసీ కేసులో భారీ కుట్రను వెలికి తీసేందుకు కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్‌ పిటిషన్‌లో సీబీఐ కోరింది.

Latest News