- లోక్‌సభ ముందుకు రైల్వే స్టాండింగ్ కమిటీ నివేదిక
- రెట్టింపు అయిన ప్రాజెక్టు వ్యయం
- తొలి రైలు సూరత్ నుంచి వాపి వరకు…
దేశంలో తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు నుంచి పరుగులు పెట్టనున్నది. గుజరాత్ రాష్ట్రం సూరత్ స్టేషన్ నుంచి వాపి వరకు దీనిని నడిపించనున్నారు. ఈ మేరకు రైల్వే స్టాండింగ్ కమిటీ లోక్‌సభ ముందు నివేదికను ప్రవేశపెట్టింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చు తగ్గుల కారణంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు వ్యయం రెట్టింపు అయ్యింది. మొదటి దశలో ఈ రూట్ లో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో రైళ్ళు పరుగులు పెడతాయి.
మహారాష్ట్రలోని ముంబై నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వరకు 508 కిలోమీటర్ల పొడవున బుల్లెట్ రైలు పనులు వేగిరంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులను దశల వారీగా పూర్తి చేయాలనే లక్ష్యంతో రైల్వే శాఖ కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ కంపెనీ లిమిటెడ్ (బీఈఎంఎల్) డిజైన్ చేసి, తయారు చేసిన బుల్లెట్ రైలు గంటకు 280 కిలోమీటర్ల వేగం ప్రయాణించనున్నది.
ఈ ట్రాకులపై జపాన్ దేశంలో తయారు చేసిన రైలును పరుగులు పెట్టిస్తారా? భారత్‌లో డిజైన్, తయారు చేసిన రైలును పట్టాలెక్కిస్తారా? అనే సందేహాలు తొలుత విన్పించాయి. అయితే ఈ తొలి ప్రాజెక్టులో బీఈఎంఎల్ తయారు చేసిన రైలునే పట్టాలెక్కిస్తున్నట్లు నివేదికలో స్పష్టం చేశారు. జపాన్‌కు చెందిన ఈ10 సిరీస్ శింకషేన్ బుల్లెట్ ట్రైన్ తయారు చేసే పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అయితే జపాన్ ట్రైన్‌ను ఎక్కడ ఉపయోగిస్తారనేది వెల్లడించడం లేదు.
- మొదటి దశలో ఈ రూట్ లో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో రైళ్ళు పరుగులు పెడతాయని, ఆ తరువాత 320 నుంచి 350 కిలోమీటర్లకు వేగానికి పెంచనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
- ఆగస్టు 2027లో సూరత్ నుంచి వాపి వరకు కమర్షియల్ సేవలు ప్రారంభం కానున్నట్లు స్పష్టతనిచ్చారు.
- ఈ ఆర్థిక సంవత్సరంలో 4వేల కిలోమీటర్ల పొడవున బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం చేసేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించినందున పనులు కూడా వేగిరంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు అంటున్నారు.
ముంబై నుంచి పుణె, పుణె నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి సిలిగిరి వరకు హైస్పీడ్ ట్రాక్ లను నిర్మాణం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ముంబై నుంచి పుణె, పుణె నుంచి హైదరాబాద్, చెన్నై నుంచి బెంగళూరు, ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి పాట్నా వరకు హైస్పీడ్ ట్రాక్ ల నిర్మాణం కోసం ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) ను రైల్వే బోర్డుకు సమర్పించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు, పాట్నా నుంచి సిలిగురి వరకు డీపీఆర్ లు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచంలో సమర్థవంతగా హైస్పీడ్ రైళ్లు నడిపే విధంగా రైల్వే శాఖ సమగ్రంగా అధ్యయనం చేసింది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలు, నిర్వహణ, పర్యవేక్షణకు ఈ అధ్యయనం ఉపకరించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనుకున్న సమయం కన్నా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు, వ్యయం తగ్గేందుకు దోహదపడింది. 2015 డిసెంబర్ నెలలో అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రూ.97,636 కోట్లు రైల్వే శాఖ కేటాయించింది.
మార్కెట్ లో చోటు చేసుకుంటున్న మార్పులు తదితర కారణాల మూలంగా ప్రాజెక్టు వ్యయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదనపు పన్నులు, సెస్స్ రూ.29,330 కోట్లు, సిగ్నలింగ్ సిస్టమ్ కు రూ.16,500 కోట్లు, ద్రవ్యోల్బణం రూ.19,695 కోట్లు, పునరావాసం కోసం రూ.16,695 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.97,636 కోట్ల నుంచి రూ.1.98 కోట్లకు పెరిగింది. రూ.1.08 కోట్లు అదనంగా భారం పెరిగిందని రైల్వే స్టాండింగ్ కమిటీ తన నివేదికలో సుస్పష్టం చేసింది.
Read Also |
Banks Penalty | బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేదంటూ పెనాల్టీ 19వేల కోట్లు వసూలు
Kumbh Mela Fame Monalisa : ప్రేమికుడితో పెళ్లి కోసం పోలీస్ స్టేషన్ కు కుంభమేళా మోనాలిసా!
Ayodhya : వంట గ్యాస్ ఎఫెక్ట్.. అయోధ్య భక్తులకు నిత్యాన్నదానం నిలిపివేత !
