Banks Penalty | బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేదంటూ పెనాల్టీ 19వేల కోట్లు వసూలు

ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ ఉంచడం లేదంటూ వివిధ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి సుమారు 19వేల కోట్ల రూపాయలు జరిమానాల కింద వసూలు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు తెలిపారు.

  • By: TAAZ |    business |    Published on : Mar 11, 2026 8:18 PM IST
Banks Penalty | బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేదంటూ పెనాల్టీ 19వేల కోట్లు వసూలు

Banks Penalty | దేశంలో పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల దోపిడి ఎలా ఉందంటే… ఖాతాలో డబ్బులు జమ చేసినా కత్తెర వేస్తున్నారు. పరిమితికి మించి డ్రా చేసినా జేబులకు చిల్లు పెడుతున్నారు. డబ్బులు వేసినా, తీసినా మనకే బొక్క అనే విధంగా నిబంధనలు రూపొందించారని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కూడా ఖాతాల నుంచి డబ్బులు గుంజే పనికి బ్యాంకులు పూనుకోవడం గమనార్హం. పబ్లిక్, ప్రైవేటు సెక్టర్ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ నిల్వలు కొనసాగించడం లేదంటూ ఇప్పటి వరకు రూ.19,083 కోట్లు ముక్కు పిండి వసూలు చేశాయి. ఇందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు రూ.8,092 కోట్లు, ప్రైవేటు సెక్టర్ బ్యాంకులు రూ10,990 కోట్లు వసూలు చేసినట్లు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

2022–23నుంచి 2024–25 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలలో కనీస బ్యాంకు నిల్వల నిబంధనలు పాటించని ఖాతాదారులపై పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు రూ8,093 కోట్లు పెనాల్టీ విధించాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో విధించిన పెనాల్టీలు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 4.58 శాతం తగ్గగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో విధించిన పెనాల్టీలను పోల్చితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13.26 శాతం పెరిగాయి. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వలు మెయింటైన్‌ చేయడం లేదంటూ సంబంధిత బ్రాంచ్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు ఖాతాదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెయిల్ ద్వారా కూడా అప్రమత్తం చేస్తున్నా ఖాతాదారులు స్పందించడం లేదని, పెనాల్టీ వేసే ముందు కూడా కొంత సొమ్ము వేయాలని సమాచారం ఇచ్చినా స్పందించకపోవడం మూలంగా చర్యలు తీసుకోక తప్పడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.

కనిష్ఠంగా రూ.25 నుంచి గరిష్ఠంగా రూ.500 వరకు ప్రతి నెలా బ్యాంకును బట్టి, ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని ఒక్కో ఖాతాదారుడిపై విధిస్తున్నారు. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా జత చేస్తున్నారు. పెనాల్టీల విధింపుపై మినహాయింపు ఇవ్వాలని, తిరిగి ఖాతాదారులకు చెల్లించాలని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఎలాంటి తీర్పులు ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇలా వసూలు చేసిన సొమ్ములను నిర్వహణ వ్యయం కోసం బ్యాంకులు వెచ్చిస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్‌లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 13 కోట్లు, మరుసటి సంవత్సరం 15 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో 15.55 కోట్లు చొప్పున స్వల్పంగా పెనాల్టీలు విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు ఇలా రూ.486 కోట్లు, 674 కోట్లు, 417 కోట్లు విధించి ఖాతాదారులకు గుండెపోటు వచ్చేలా చేసింది. ప్రైవేటు సెక్టర్‌లో ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, కర్ణాటక బ్యాంక్, నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఖాతాదారులపై పెనాల్టీలు విధించకపోవడం అభినందించదగ్గ విషయంగా చెప్పుకోవాలి. హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్ లిమిటెడ్ వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1036 కోట్లు, 1316 కోట్లు, 1518 కోట్ల చొప్పున విధించాయి. ఆ తరువాతి స్థానంలో యాక్సిస్‌ బ్యాంక్ రూ.878 కోట్లు, 826 కోట్లు, 1001 కోట్లు చొప్పున అపరాధ రుసుం విధించినట్లు ఆర్బీబీ లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు బ్యాంకులు ఖాతాదారులు జేబులు గుల్ల చేయడంలో పోటీపడ్డాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఆర్బీఐ ఈ నిబంధనలు జారీ చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అక్కౌంట్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలపై కనీస నగదు నిల్వ నిబంధనలు అమలు చేయడం లేదు. ఈ ఖాతాలలో కనీస నగదు నిల్వలు లేకున్నా అందుబాటులో ఉన్న డిపాజిట్ సొమ్మును బ్యాంకు నుంచి లేదా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఖాతాలో ఉన్న సొమ్మంతా తీసుకున్నా ఒక్క రూపాయి కూడా పెనాల్టీ విధించరు.