- కడియం సవాల్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ
- అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాధాన్యం
- కేసీఆర్ స్పందిస్తారా అంటూ ఒకింత ఆసక్తి
- రాష్ట్రంలో ఫిరాయింపులపై రాజకీయ రచ్చ
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Kadiyam Challenge KCR | తెలంగాణలో సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను విచారించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు బుధవారం ఇద్దరికి క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో దానం కంటే కడియం స్పందించిన తీరు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపుల అంశంపై చర్చను తనదైన పద్ధతిలో ఆయన పొడిగించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దోషులుగా తేల్చేందుకు సాంకేతిక లోపాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ‘నైతికత’ను లేవనెత్తుతూ దానికి కట్టుబడి ఉండేందుకు తాను సిద్ధమంటూ కడియం వ్యూహాత్మక సవాల్ విసిరారనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ సవాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసీఆర్ నైతికతకు కట్టబడి ఉంటారా?
‘తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ విలువల పతనానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నైతికతకు కట్టుబడి ఉంటారా? అంటూ కడియం ప్రశ్నించారు. అక్కడికే పరిమితం కాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశానంటూ తెలంగాణ ప్రజలకు ముందుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించానని కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెబితే ఆ మరుక్షణమే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతానని ప్రకటించారు. ఈ సవాల్‌కు తాను సిద్ధమని, కేసీఆర్ కూడా సిద్ధమేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ సవాల్‌కు బీఆరెస్ అధినేత స్పందించే అవకాశాలు అసలు ఉంటాయా? అన్న చర్చలు సాగుతున్నాయి.
నైతిక విలువలు కేసీఆర్‌కు వర్తించవా: కడియం
‘నైతిక విలువలు నాకేనా, కేసీఆర్ కు వర్తించవా?’ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. ప్రజలకు క్షమాపణ చెప్పే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పకపోతే తమ రాజీనామాల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నియామవళి ప్రకారం పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే ఆ సభ్యునికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, తనకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. తాను పార్టీ విప్ ఏనాడూ ధిక్కరించలేదని వెల్లడించారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఈ ఫిరాయింపులపై పార్టీ పరంగా ఎందుకు పిటిషన్ వేయలేదు? ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన చరిత్ర కేసీఆర్‌దని కడియం అన్నారు. అయినా కేటీఆర్ సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికలకు వెళ్ళాల్సి వస్తే సిద్ధం: దానం
దానం మాట్లాడుతూ తాను కేసీఆర్‌కు జవాబుదారీగా ఉంటానని, ఇన్ని రోజులు తనపై ఫిర్యాదు చేసిన వాళ్ళపై మాట్లాడలేదని అన్నారు. తనపై ఏ అధికారంతో ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. కొందరు తనపై వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారని వారికి వ్యక్తిగతంగా సమాధానం చెప్పానని పేర్కొన్నారు. స్పీకర్ పరిధిలో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తీర్పు ఎలా ఉన్నా తనకు ఒక్కటేనని చెప్పారు. పార్లమెంటుకు వెళ్ళాలనే పోటీచేశానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని తెలిపారు. ఉప ఎన్నికలకు వెళ్ళాల్సి వస్తే సిద్ధమే అంటూ… పాదయాత్ర చేసి మళ్ళీ గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఫిరాయింపుల రాజకీయ రచ్చరచ్చ
ఒక పార్టీలో గెలిచి మరోపార్టీలోకి ప్రజాప్రతినిధులు ఫిరాయించడమనే రాజకీయ అవకాశవాద విధానాన్ని దాదాపు అన్ని పాలక పక్షాలు అధికార ఆటలో పావుగా మార్చివేశాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగిన ఫిరాయింపుల పర్వం కూడా ప్రహసంగా మారిందనే చర్చసాగుతోంది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆరెస్.. ఇదే అంశంపై కోర్టు తలుపులూ తట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా కడియం, దానంతో కలిపి పది మంది ఎమ్మెల్యేలపై చేసిన ఫిర్యాదులపై తన పరిధిలో క్లీన్ చిట్ఇస్తూ స్పీకర్ తీర్పునివ్వడంతో ఫిరాయింపుల రచ్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ పరిమితులు, పరిధిలు ఎలా? ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పది మంది పార్టీ మారారనేది బహిరంగమైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ స్పీకర్ తీర్పునిచ్చారంటూ, ఇది చీకటి రోజంటూ వివిధ పద్ధతుల్లో స్పందించారు. దీనిపై రాజకీయ క్షేత్రంలో, కోర్టులో తేల్చుకుంటామంటూ ప్రకటించారు.
- తెలంగాణ ఆవిర్భావం అనంతరం పదేళ్ళలో శాసనసభా పక్షాల విలీనం పేరుతో వివిధ రాజకీయ పక్షాల నుంచి ఎమ్మెల్యేలలను బీఆర్ఎస్ గులాబీ నీడకు చేర్చుకున్న విషయం తెలిసిందే. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇవ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయాల్లో పెరుగాల్సిన విలువను కేసీఆర్ నాశనం చేశారనే ఆరోపణ ఒక వైపు ఉన్నప్పటికీ తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలకు అడ్డుకట్టవేసేందుకు ఈ ఫిరాయింపులను ప్రోత్సహించక తప్పలేదంటూ ఆ పార్టీ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఫిరాయింపుల వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి కంట్లో నలుసుగా మారగా, రాజకీయ రంగంలో విమర్శలకు తావిస్తోంది. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ పయనిస్తోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
