Kadiyam Srihari | పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆరెస్‌ : పల్లాపై కడియం ఫైర్‌

నా కుటుంబ సభ్యులు దేవనూర్ గుట్టల్లో 2వేల ఎకరాలు ఆక్రమించుకున్నామని ఒక రోజు, బినామీ పేర్లతో 50 ఎకరాలు పట్టా చేయించుకున్నామని రెండో రోజు అన్నారు. ఒక్క గుంట భూమిని కబ్జా చేసినట్టుగానీ, ఒక ఎకరం బినామీ పేరుతో పట్టా చేయించుకున్నట్టుగానీ పల్లా నిరూపిస్తే.. పల్లా ఇంట్లో గులాం గిరీ చేస్తానని కడియం మరోసారి సవాలు విసిరారు. నిరూపించలేక పోతే పల్లా తన ఇంట్లో గులాం గిరీ చేయాలని డిమాండ్ చేశారు.

Kadiyam Srihari | పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆరెస్‌ : పల్లాపై కడియం ఫైర్‌
  • నీది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు సంపాదన
  • పల్లాపై కడియం తీవ్రస్థాయి విమర్శలు

విధాత ప్రత్యేక ప్రతినిధి:

Kadiyam Srihari |  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆరెస్ అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి అన్నారు. పార్టీని ఫిరాయించినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కడియాన్ని బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీకు ఒక చట్టం, వేరేవాళ్లకు ఒక చట్టమా? పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆరెస్‌కు లేదు’ అని ఆయన అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపుల విషయం కోర్టులో ఉందని, సుప్రీం కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. 10 ఏళ్ల బీఆరెస్ పాలనలో 36మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిన విషయం పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తెలియదా? అని ప్ర‌శ్నించారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా? అని నిలదీశారు.

ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్ధమా?
‘కడియం కావ్యకు బీ ఫామ్ ఇచ్చి, ఎన్నికల ఖర్చుకు బీఆరెస్ నిధులు ఇచ్చామని అంటున్నారు. ఇది నిజమని నిరూపిస్తే మా పదవులకు రాజీనామా చేయడానికి మేము సిద్ధం. నిరూపించలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా?’ అంటూ కడియం ప్రశ్నించారు. మీరెన్ని విమర్శలు చేసినా మీ ఇద్దరి మూతులు పగిలే విధంగా భారీ మెజారిటీతో గెలిచి చూపించామని చెప్పారు. రూ.800కోట్ల అభివృద్ధి పనుల వివరాలను మీడియా ముందు ఉంచానని వివరించారు.

భూ కబ్జాపై స్పందించలేదు
‘నా కుటుంబ సభ్యులు దేవనూర్ గుట్టల్లో 2వేల ఎకరాలు ఆక్రమించుకున్నామని ఒక రోజు, బినామీ పేర్లతో 50 ఎకరాలు పట్టా చేయించుకున్నామని రెండో రోజు అన్నారు. ఒక్క గుంట భూమిని కబ్జా చేసినట్టుగానీ, ఒక ఎకరం బినామీ పేరుతో పట్టా చేయించుకున్నట్టుగానీ పల్లా నిరూపిస్తే.. పల్లా ఇంట్లో గులాం గిరీ చేస్తానని కడియం మరోసారి సవాలు విసిరారు. నిరూపించలేక పోతే పల్లా తన ఇంట్లో గులాం గిరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సవాలు చేసినా స్పందించలేదంటూ పల్లాపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలంగాణ చీము నెత్తురు ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు సంపాదన
‘నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్నావ్. నేను ఒక్క రూపాయి కాంట్రాక్టు కేసీఆర్ దగ్గర తీసుకున్నానా?’ అని కడియం ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలన్నారు. పల్లా మాదిరిగా తాను హైదరాబాద్‌లో ఉంటూ గెస్ట్‌లా వచ్చిపోయేవాడిని కాదని సెటైర్‌లు వేశారు. ‘బొచ్చు కుక్క కాదు కాపలా కుక్కను అంటున్నాడు. ఏదైనా కుక్క కుక్కే కదా! ఇప్పుడు ఈ బొచ్చు కుక్క కొన్ని పిచ్చి కుక్కలను తయారు చేశాడు.. పిచ్చి కుక్కలన్నింటికీ ఈ బొచ్చు కుక్క లీడర్’ అంటూ ఘాటుగా విమర్శించారు. తన తల్లిపై పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కడియం.. అనుచిత పోస్టులు పెట్టేవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. తనపై పెట్టన పోస్టుల్లో కడియం పేరు దగ్గర నీ పేరు పెట్టుకుని చదువుకో.. అప్పుడు ఆ బాధ తెలుస్తుంది’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు.