Tejaswi Surya | ఐదేళ్లలో 30రెట్లు పెరిగిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సంపద..!

  • Publish Date - April 7, 2024 / 11:10 AM IST

Tejaswi Surya | కర్ణాటక బెంగళూరు సౌత్‌ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సందప గత ఐదేళ్లలో దాదాపు 30 రెట్లు పెరిగింది. 2019లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తన ఆస్తులు రూ.13.46లక్షలుగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ.4.10కోట్లకు పెరిగాయి. తనకు రూ.4,10,30,489.95 విలువైన చరాస్తులున్నట్లు బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.80వేల నగదు ఉండగా.. మిగతా సొత్తు అంతా బ్యాంకుల్లో డిపాజిట్‌, మ్యూవల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2002-23లో తన మొత్తం ఆదాయం రూ.44,13,050 ఉందని.. 2018-19లో రూ.11 లక్షలుగా మాత్రమేనని బీజేపీ ఎంపీ తన ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారు.

స్పీకర్‌ ఓం బిర్లా..

స్పీకర్‌ ఓం బిర్లా కంటే ఆయన సతీమణికి ఎక్కువ ఆస్తులున్నాయి. రాజస్థాన్‌లోని కోట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన మూడోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఓం బిర్లా నికర ఆస్తి విలువ రూ.13.23కోట్లు, ఇందులో ఆయన భార్య డాక్టర్‌ అమితకు చెందిన చరస్థిరాస్తులున్నాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బిర్లా వద్ద రూ.1,97,34,585 విలువైన చరాస్తులు, రూ.40,000 నగదు ఉన్నట్లుగా వెల్లడించారు.

సర్వజీత్ ఆస్తుల విలువ రూ.8.7 కోట్లు.

బీహార్‌లోని గయా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి కుమార్ సర్వజీత్‌కు రూ.8.70 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. రాష్ట్ర మాజీ వ్యవసాయ మంత్రి తన వద్ద రూ.90.31 లక్షల చరాస్తులు ఉన్నాయని, ఆయన భార్య సీమకు రూ.1.95 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని ఎన్నికల అధికారులు సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడించారు.

సురేష్‌ గోపి ఆస్తులు రూ.12కోట్లు

కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేష్‌ గోపీ ఆస్తుల విలువ రూ.12 కోట్లకుపైగానే ఉంది. నటుడు ఎనిమిది వాహనాలు, 1025 గ్రాముల బంగారం, రెండు వ్యవసాయ ప్లాట్లు, ఏడు వ్యవసాయేతర ప్లాట్లు, ఏడు నివాస భవనాలు ఉన్నాయి. 2019లో ఆయన ఆస్తుల విలువ రూ.10 కోట్లుగా తెలిపారు. అలాగే తనపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో అక్రమంగా సభలు నిర్వహించడంతో పాటు జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఆయనపై కేసులు నమోదయ్యాయి.

Latest News