చండీఘర్ : వాహనాలు రహదారులపై ఉన్న గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతుంటాయి. ఆ సందర్భంలో వాహనాల్లో వెళ్తున్న వారు చనిపోతూ ఉంటారు. కానీ ఈ ప్రమాదంలో మాత్రం చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బతికాడు. ఆ వ్యక్తికి మాత్రం గుంత ఊపిరినిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన దర్శన్ సింగ్(80) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుకు గురికావడంతో అతన్ని చికిత్స నిమిత్తం పాటియాలాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అనంతరం అతని గుండె ఆగిపోయిందని, చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో దర్శన్ అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేశారు. ఇక ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో కర్నాల్ తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో ఆ వాహనంలో గుంతలో పడి కుదుపునకు గురైంది.
ఈ సమయంలో దర్శన్‌లో కదలిక వచ్చింది. అతను చేతిని కదిలించినట్లు వెంట ఉన్న మనుమడు గుర్తించాడు. గుండె కొట్టుకోవడాన్ని గమనించాడు. క్షణం ఆలస్యం చేయకుండా, అంబులెన్స్ డ్రైవర్‌ను అప్రమత్తం చేసి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు దర్శన్‌కు చికిత్స చేసి ప్రాణాలతో బతికించారు. ప్రస్తుతం దర్శన్ వేగంగా కోలుకుంటున్నాడని, అతనికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.