ఆధార్ అంటే ఒక వ్యక్తి గుర్తింపు. ఇండియాలో ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కోసం ఆధార్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గుర్తింపుతో పాటు అడ్రస్ కు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా ఆధార్ జారీ చేస్తారు. ఈ ఆధార్ ను బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్ అని పిలుస్తారు. అసలు ఈ ఆధార్ కోసం ఎలా ధరఖాస్తు చేయాలి? ఎక్కడ ధరఖాస్తు చేయాలి? ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో తెలుసుకుందాం.
బాల ఆధార్ అంటే ఏంటి?
ఐదేళ్లలోపు చిన్నారులకు జారీ చేసే ఆధార్ ను బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్ అని కూడా పిలుస్తారు. బాల ఆధార్ సాధారణ ఆధార్ పోలిన రంగులో కాకుండా నీలం రంగులో ఉంటుంది. అందుకే దీన్ని బ్లూ ఆధార్ అని అంటారు. ఐదేళ్ల లోపు చిన్నారుల గుర్తింపు కోసం ఇది జారీ చేస్తారు. స్కూళ్లలో లేదా ఇతరత్రా అవసరాలకు గుర్తింపు కార్డు అవసరమైతే ఈ ఆధార్ ను ఐదేళ్లలోపు చిన్నారుల కోసం ఉపయోగించవచ్చు. ఈ ఆధార్ లో చిన్నారి పేరు, పేరేంట్స్ వివరాలు, పుట్టిన తేది, ఇతరత్రా వివరాలు ఉంటాయి.
కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే?
బాల ఆధార్ కోసం చిన్నారి బర్త్ సర్టిఫికెట్ అవసరం. చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ లేకపోతే ఆసుపత్రిలో చిన్నారి పుట్టిన సమయంలో జారీ చేసే డిశ్చార్జ్ స్టేట్ మెంట్ అవసరం. చిన్నారి ఫోటో ఉండాలి. చిన్నారి తల్లిదండ్రులకు ఆధార్ ఉండాలి. చిన్నారి ఆధార్ కు పేరేంట్స్ లలో ఎవరో ఒకరి ఆధార్ ను లింక్ చేస్తారు. అంతేకాదు పేరేంట్స్ మొబైల్ నెంబర్లలో ఎవరిదో ఒకరిది దీనికి లింక్ చేస్తారు. ఈ ఆధార్ కు పిల్లల వేలిముద్రలు, ఐరిష్ అవసరం లేదు.
ఎలా ధరఖాస్తు చేయాలి?
మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్లో బాల ఆధార్ కు అవసరమైన డాక్యుమెంట్లతో వెళ్లి ధరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ధరఖాస్తు చేసిన 90 రోజుల తర్వాత బాల ఆధార్ మీరు ఇచ్చిన అడ్రస్ కు చేరుతుంది. ఇక ఆన్ లైన్ లో కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ అధికారిక వెబ్ సైట్ యూఐడీఏఐ (UIDAI)ను ఓపెన్ చేయాలి. ఇందులో మై ఆధార్ లో బుక్ మై అపాయింట్ మెంట్ ను క్లిక్ చేయాలి. మీరు ఉంటున్న నగరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నమోదు చేసిన మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి మీ చిన్నారి ఆధార్ కు తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు తమ బయోమెట్రిక్ ను వెరిఫికేషన్ కు ఇవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. 90 రోజుల తర్వాత బాల ఆధార్ మీరు ఇచ్చిన అడ్రస్ కు పోస్టులో చేరుతుంది.
ఐదేళ్ల తర్వాత ఏం చేయాలి?
ఐదేళ్ల తర్వాత బాల ఆధార్ ను అప్ డేట్ చేయాలి. ఐదేళ్లలోపు చిన్నారులకు ఐరిష్, వేలిముద్రలు అవసరం లేదు. ఐదేళ్లు దాటిన తర్వాత బాల ఆధార్ ఉన్న చిన్నారుల వేలిముద్రలు, ఐరిష్ ను ఆధార్ కు లింక్ చేయాలి. అదే సమయంలో బాల ఆధార్ కు పేరేంట్స్ లలో ఎవరిదో ఒకరిది లింక్ చేసిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ను డీలింక్ చేస్తారు.
15 ఏళ్ల తర్వాత అప్ డేట్ చేయాల్సిందే..
బాల ఆధార్ ఐదేళ్ల వరకే ఉపయోగపడుతుంది. ఐదేళ్ల తర్వాత ఆ చిన్నారి వేలిముద్రలు, ఐరిష్ తో ఆధార్ అప్ డేట్ అవుతోంది. ఇక 15 ఏళ్లు వచ్చాయంటే ఆధార్ ను ప్రతి ఒక్కరూ అప్ డేట్ చేసుకోవాలి. ఆ సమయంలో ఐరిష్, వేలిముద్రలు అప్ డేట్ చేయాలి. ఇవి జీవితాంతం ఉంటాయి.