Online Gaming Bill 2025 Becomes Law | న్యూఢిల్లీ: భారతదేశంలో గత కొన్నేళ్లుగా విపరీతంగా ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్ రియల్-మనీ గేమ్స్‌కు ఇక తెరపడింది. పార్లమెంట్ ఆమోదం పొందిన “ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్-2025”కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఇది చట్టంగా మారింది. త్వరలో అధికారిక నోటిఫికేషన్ ద్వారా అమలు తేదీ ప్రకటించనున్నారు. ఈ చట్టం ప్రకారం, డబ్బుతో ఆడే అన్ని రకాల ఆటలు – అవి నైపుణ్యంపై ఆధారపడినా, అదృష్టంపై ఆధారపడినా – సంపూర్ణంగా నిషేధం. ఇకపై ఈ గేమ్స్ నిర్వహణ, ప్రచారం, బ్యాంకింగ్ లావాదేవీలు అన్నీ చట్టవిరుద్ధం కానున్నాయి.
ప్రభుత్వం వివరణ ప్రకారం, ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఇప్పుడు ఒక సామాజిక, ప్రజారోగ్య సమస్యగా మారాయి. ఇవి వ్యసనానికి దారితీసి యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కుదేలు చేస్తున్నాయి. వేగంగా డబ్బు సంపాదించవచ్చని భ్రమ కలిగించే ప్రకటనలు, అక్రమ లావాదేవీలకు వేదిక కావడం వంటి కారణాలతోనే కేంద్రం ఈ రంగాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ “ఈ బిల్ భారతదేశాన్ని గేమింగ్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ కేంద్రంగా మార్చడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, మన సమాజాన్ని ఆన్‌లైన్ మనీ గేమ్స్ దుష్ప్రభావాల నుండి రక్షిస్తుంది. ఈ-స్పోర్ట్స్ మరియు సామాజికక్రీడలు అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది” అని వ్యాఖ్యానించారు.
చట్టం ఆమోదం పొందగానే దేశంలోని ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ రియల్-మనీ ఆపరేషన్లను నిలిపివేశాయి. డ్రీమ్11, మై11సర్కిల్, రమ్మీ సర్కిల్, జంగ్లీ రమ్మీ, ఏస్2థ్రీ, పోకర్‌బాజీ, అడ్డా52, స్పార్టన్ పోకర్, ఎంపిఎల్, జూపీ, వింజో, పేటీఎం ఫస్ట్ గేమ్స్, ప్రోబో వంటి యాప్స్ ఇప్పటి వరకు డబ్బుతో ఆడే కాంటెస్టులు నిర్వహించేవి. అయితే, కొత్త చట్టం అమలులోకి రావడంతో వినియోగదారులకు డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వడం తప్ప, కొత్తగా ఎలాంటి క్యాష్ గేమ్స్ ప్రారంభించడం లేదని ప్రకటించాయి.
నిబంధనలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు కూడా విధించనున్నారు. మొదటి తప్పు చేసినవారికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు లేదా ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ప్రకటనలు, ప్రచారం చేసే వారికీ రెండు సంవత్సరాల జైలు లేదా యాభై లక్షల వరకు జరిమానా ఉండొచ్చు. పునరావృతం జరిగితే ఐదు సంవత్సరాల జైలు, రెండు కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ నిషేధానికి ముందు భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ విలువ సుమారు 3.7–3.8 బిలియన్ డాలర్లుగా (₹27,000 కోట్లకు పైగా) ఉండేది. అందులో 86 శాతం వరకు ఆదాయం రియల్-మనీ గేమ్స్ నుంచే వచ్చేది. 2023–24లో RMG రెవెన్యూ సుమారు 2.4 బిలియన్ డాలర్లు (₹18,000–₹27,000 కోట్లు)గా నమోదైంది. పరిశ్రమ నుండి ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ₹20,000 కోట్లకు పైగా ఆదాయం పొందింది. మొత్తం పరిశ్రమ విలువ ₹2 లక్షల కోట్లు (సుమారు 23 బిలియన్ డాలర్లు)గా అంచనా వేయబడింది. అయితే వినియోగదారులు ప్రతి సంవత్సరం సుమారు ₹20,000 కోట్లు కోల్పోతున్నారని ప్రభుత్వ అంచనా. దేశవ్యాప్తంగా 15కోట్లకు పైగా ఆటగాళ్లు ఈ రియల్-మనీ గేమ్స్‌లో ఉత్సాహంగా పాల్గొనేవారు.
ఇకపై ఈ-స్పోర్ట్స్, సామాజిక మరియు విద్యాక్రీడల వైపే యువత మొగ్గుచూపే విధంగా ప్రభుత్వం అధికారికంగావీటికి గుర్తింపు ఇచ్చి యువతను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలని భావిస్తోంది. అదే సమయంలో భారత్‌ను గ్లోబల్ గేమ్ డెవలప్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించింది.