Parliament Session 2024 | లోక్‌సభలో మోదీ రాజకీయ సమాధానం

తాము పదేళ్లలో చేసిన కృషికి ప్రజలు ఆశీర్వదించి మరోసారి తమను గెలిపించారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మంగళవారం లోక్‌సభలో ఆయన సమాధానమిచ్చారు.

  • Publish Date - July 2, 2024 / 08:36 PM IST

పదేళ్ల కృషిని ఆశీర్వదించి మళ్లీ మమ్మల్ని గెలిపించారు
పరాన్నజీవి పార్టీగా మారిన కాంగ్రెస్‌
రాహుల్‌ పిల్ల చేష్టలు మానాలని పరోక్ష సూచన
పదేళ్లలో అవినీతిని మేం సహించలేదు
లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం

న్యూఢిల్లీ : తాము పదేళ్లలో చేసిన కృషికి ప్రజలు ఆశీర్వదించి మరోసారి తమను గెలిపించారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మంగళవారం లోక్‌సభలో ఆయన సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో ఎక్కువ భాగం కాంగ్రెస్‌ మీద విమర్శలు గుప్పించడానికి, రాహుల్‌గాంధీని టర్గెట్ చేయడానికే కేటాయించారు. తమకు సీట్లు తగ్గిన వాస్తవాన్ని మసకబార్చేందుకు తంటాలు పడ్డారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వెలుగుచూసిన నీట్‌ కుంభకోణం గురించికానీ, యావత్‌ దేశం ఎదురు చూస్తున్న మణిపూర్‌ అంశంపై కానీ స్పష్టంగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడినట్టు కనిపించలేదు. సభలో తనకు సొంత బలం లేక ఎన్డీయే భాగస్వామ్యపక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్న విషయాన్ని పక్కనపెట్టేసి.. కాంగ్రెస్‌ ఒక పరాన్నజీవి అంటూ చులకన చేశారు. మిత్రపక్షాల మద్దతుతోనే కాంగ్రెస్‌కు సీట్లు పెరిగాయని చెప్పారు. ‘మమ్మల్ని ఓడించినట్టు ప్రజల్లో ఒక భావన సృష్టించేందుకు కాంగ్రెస్‌, దాని యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. 2014 తర్వాత అదొక పరాన్నజీవి పార్టీగా మారింది. దాని భాగస్వామ్యపక్షాల ఓట్లను తింటూ బతుకుతున్నది’ అని మోదీ చెప్పారు. ‘కేంద్రంలోనే కాకుండా.. నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే గెలిచిందని మోదీ తెలిపారు.

ఎన్డీయే మూడోసారి విజయం సాధించడం చారిత్రక ఘనతగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత.. 60 ఏళ్ల తర్వాత రెండోసారి ఇది చోటుచేసుకున్నది. ఈ ఘనత సాధించడానికి ఎంత కష్టపడ్డామో ఇది తెలియజేస్తున్నది’ అన్నారు. ఇది రాజకీయ క్రీడలతో కాలేదని, ప్రజల ఆశీర్వాదంతో అయిందని చెప్పారు. సుస్థిరత్వం, నిర్ణయాత్మక కృషికి తమకు లభించిన తీర్పిదని తెలిపారు. మహాప్రభు జగన్నాథుడి నేల అయిన ఒడిశా మమ్మల్ని ఆశీర్వదించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే క్లీన్‌ స్వీప్‌ చేసింది. అరుణాచల్‌, సిక్కింలలో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది.

ఆరు నెలల క్రితం మేం రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం’ అని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంత కాలం కుంభకోణాలు, ఉగ్రవాదం సాగిందని మోదీ విమర్శించారు. 2014కు ముందు బొగ్గు కుంభకోణంతో అనేక మంది చేతులకు మసి అంటుకున్నదని అన్నారు. తమ పదేళ్ల కాలంలో అవినీతిని సహించలేదని అందుకే ప్రజలు తమను ఆశీర్వదించారని చెప్పుకొన్నారు. ‘ఈ రోజు భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. మా ప్రతి విధానం, ప్రతి నిర్ణయం, ప్రతి చర్యలో ఏకైక లక్ష్యం ఇండియా ఫస్ట్‌ అనేదే’ అని మోదీ తెలిపారు. ఈ దేశ ప్రజల్లో విశ్వాసం పెంచామన్నారు. ప్రతి పౌరుడికి తగిన అవకాశాలు కల్పించడమే అభివృద్ధి చెందిన దేశం లక్షణమని చెప్పారు. వాస్తవాలను అణచివేయలేరని, అసత్యాలకూ మూలాలు లేవని వ్యాఖ్యానించారు.

రాహుల్‌ను టార్గెట్‌ చేస్తూ.. ఆయన పిల్ల చేష్టలను గతంలో సభ చూసిందని అన్నారు. తాను చేసిన తప్పిదాలు చెప్పుకోకుండా సానుభూతి పొందేందుకు ఆయన ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ‘స్పీకర్‌ జీ.. మీరు చిరునవ్వుతో అన్నింటినీ ఓర్చుకున్నారు. కానీ.. సోమవారం జరిగినవాటి విషయంలో ఏదోఒకటి చేయాలి. లేదంటే అది పార్లమెంటుకు మంచిది కాదు. వాటిని పిల్లచేష్టలని సరిపెట్టుకోవడానికి లేదు. అందులో లోతైన కుట్ర ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. నీట్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. యువత భవిష్యత్తుతో ఆటలాడుకునేవారిని ఎట్టిపరిస్థితిలోనూ సహించకూడదని చెప్పారు.

ఈ ఉదంతంలో ఇప్పటికే అరెస్టులు జరుగుతున్నాయని, ఇప్పటికే కఠినమైన చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. బీజేపీ నేతలు హిందువులమని చెప్పుకొంటూ హింసకు పాల్పడుతున్నారన్న రాహుల్‌ వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ.. వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ.. హిందూమతంపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను దేశం కొన్ని శతాబ్దాలు మర్చిపోజాలదని అన్నారు. హిందువులపై కుట్రపూరితంగా ఆరోపణలు చేయడం తీవ్రమైన అంశమని చెప్పారు.

అన్నీ రాజకీయ విమర్శలే!

ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు! విపక్ష ఎంపీలు లేవనెత్తిన అంశాల ప్రస్తావనే లేదు! దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఏం చేయబోతున్నారో చెప్పనేలేదు! ఎదురుదాడి చేయడమే తప్ప.. జవాబుదారీతనంతో వ్యవహరించరని ఆరోపణలున్న ప్రధాని మోదీ.. తన సహజశైలిలోనే మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానాలు లేకుండానే ‘సమాధానం’ ఇచ్చారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి

 

Latest News