నీట్‌ పరీక్షల అవకతవకలపైనా మోదీ మౌనం … కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ ఆగ్రహం

నీట్‌ పరీక్ష అంశంలో ప్రధాని నరేంద్రమోదీ మౌనం దాల్చడంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్‌ లీకేజీలకు వ్యతిరేకంగా బలమైన విధానాలు తీసుకొచ్చేందుకు వీధుల నుంచి పార్లమెంటు వరకూ యువత గొంతును వినిపించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉన్నదని తెలిపారు

  • Publish Date - June 18, 2024 / 06:46 PM IST

పేపర్‌ లీకేజీల నివారణకు కఠిన చట్టాలు
కేంద్రంపై ఒత్తిడి తెస్తామని హామీ
న్యూఢిల్లీ: నీట్‌ పరీక్ష అంశంలో ప్రధాని నరేంద్రమోదీ మౌనం దాల్చడంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్‌ లీకేజీలకు వ్యతిరేకంగా బలమైన విధానాలు తీసుకొచ్చేందుకు వీధుల నుంచి పార్లమెంటు వరకూ యువత గొంతును వినిపించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉన్నదని తెలిపారు. బీహార్‌, గుజరాత్‌, హర్యానాల్లో జరిగిన అరెస్టులను గమనిస్తే ఒక పథకం ప్రకారం పరీక్షల్లో అవినీతి జరిగిందని తెలిసిపోతున్నదని చెప్పారు. పేపర్‌ లీకేజీలకు కేంద్ర బిందువుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు. ‘నీట్‌ పరీక్షలో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం విషయంలో నరేంద్రమోదీ మామూలుగానే మౌనం వహిస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. పేపర్‌ లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావడం ద్వారా యువత భవిష్యత్తుకు కాంగ్రెస్‌ పార్టీ తన మ్యానిఫెస్టోలో గ్యారెంటీ ఇచ్చింది. ‘ప్రతిపక్షం బాధ్యతను మేం నెరవేరుస్తాం. పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తేవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఈ విషయంలో యువత గొంతును వీధుల నుంచి పార్లమెంటు వరకూ వినిపిస్తాం’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు. 0.001 శాతం నిర్లక్ష్యం జరిగినా కఠినంగా వ్యవహరించాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్టీయేకు తేల్చి చెప్పిన నేపథ్యంలో రాహుల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Latest News