Supreme Court | బీహార్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్లను జాబితా (bihar electoral rolls) నుంచి తొలగించారన్న పిటిషన్‌లపై సుప్రీంకోర్టు (supreme court ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో దాఖలైన పిటిషన్లను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘం రాజ్యాంగయుత సంస్థని, అది చట్టం పరిధిలో తన పని తాను చేసుకుపోతుందని భావిస్తున్నామని చెబుతూనే.. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ (sir) సందర్భంగా పెద్ద ఎత్తున ఓటర్లును తొలగించినట్టు (mass voter exclusion) తేలితే తాము తక్షణం రంగంలోకి (intervene) దిగుతామని తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనలను ఆగస్ట్ 12, 13 తేదీల్లో వింటామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఆగస్ట్ 8లోగా రాతపూర్వకంగా వినతులు అందజేయాలని గడువు విధించింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్, అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఆగస్ట్ 1వ తేదీన ప్రచురించనున్న తుది ఓటర్ జాబితాలో అనేక మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోనున్నారన్న ఆందోళనలను పునరుద్ఘాటించారు. స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ సందర్భంగా 65 లక్షల మంది చనిపోయి లేదా ఇక్కడి నుంచి శాశ్వతంగా తరలి వెళ్లిపోయిన కారణంగా తమ ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించలేదని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయాన్ని ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇలా ప్రకటించినవాళ్లంతా తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ చట్టానికి అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. ఏమైనా తప్పిదాలు జరిగి ఉంటే కోర్టు దృష్టికి తీసుకురండి. మీ వాదనలు వింటాం’ అని అన్నారు. జస్టిస్ బాగ్చి జోక్యం చేసుకుంటూ.. 65 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటరు లిస్టులో కనిపించబోవనేది మీ ఆందోళన. ఇప్పుడు ఎన్నికల సంఘం ఓటరు జాబితాల్లో తప్పులు దిద్దే పనిలో ఉంది. ఆ ప్రక్రియను న్యాయ సంస్థగా మేం పర్యవేక్షిస్తున్నాం. మూకుమ్మడిగా తొలగింపులు ఉన్నట్టయితే మేం వెంటనే రంగంలోకి దిగుతాం. చనిపోయారని చెబుతున్న వారిలో బతికి ఉన్న ఒక పదిహేను మందిని మా వద్దకు తీసుకురండి’ అని అన్నారు.
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తరఫున వాదించిన సిబల్.. తొలగించిన 65 లక్షల మంది వివరాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఆ పేర్లను జాబితాలో చేర్చితే సరిపోతుందని అన్నారు. ముసాయిదా జాబితా ఈ విషయంలో స్పష్టమైన మౌనాన్ని ప్రదర్శించినట్టయితే తమ దృష్టిక తేవాలని జస్టిస్ సూర్యకాంత్ సిబల్‌కు సూచించారు. ఎన్నికల సంఘం తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేదీ.. ముసాయిదా జాబితా ప్రచురించిన తర్వాత కూడా ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు.