Supreme Court On Freebies : ఉచిత పథకాలు..అభివృద్ధికి ఆటంకాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాల అమలు రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకమవుతోందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అర్హులకే ఉచితాలు ఇవ్వాలని, ఉపాధి సృష్టిపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది.

Supreme court

న్యూఢిల్లీ : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల ప్రకటనలు..వాటి అమలు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్‌ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల ఆదాయ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచితాల పంపిణీ కొనసాగుతోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలతో పలు రాష్ట్రాలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని, ఉచితాల స్థానంలో రాష్ట్రాలు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది

వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్‌ అందించేలా తమిళనాడు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది. ఇందుకోసం తెచ్చిన 2024 ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్‌ రూల్స్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై గురువారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఉచిత పథకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహారం, విద్యుత్‌.. ఇలా అన్నీ ఉచితంగా ఇస్తూ పోతుంటే మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్‌ ఛార్జీలు చెల్లించే స్థోమత లేనివారికి ఉచిత విద్యుత్‌ అందిస్తారంటే అర్థం చేసుకోవచ్చు అని.. కానీ మీరు ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్‌ పంపిణీ చేస్తామని చెబుతున్నారు అని.. ఇది బుజ్జగింపు రాజకీయ విధానం కాదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అర్హులకు మాత్రం ఉచిత పథకాలు అందాలి అని, భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారు అని తప్పుబట్టింది.

విద్యుత్‌ టారిఫ్‌లను నోటిఫై చేసిన తర్వాత ఉన్నట్టుండి ఉచిత విద్యుత్‌పై ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీజేఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్రాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ఆగ్రహించింది. ఇలా ఎన్నికల సమయంలో అన్నీ ఉచితంగా పంచుకుంటూపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రాల ఆదాయ్.. జీతాలు, ఉచితాలకే సరిపోతుందని ఆక్షేపించింది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

Leopard Attack | షాకింగ్‌.. బైక‌ర్‌పైకి దూకిన చిరుత‌.. అత‌డు ఏం చేశాడో చూడండి..?
Peddi | పెద్ది నాన్-థియేట్రికల్ బిజినెస్ జోరు… చ‌ర‌ణ్ రేంజ్‌కి ఈ మాత్ర‌మేనా అంటున్న ఫ్యాన్స్

Latest News