Site icon vidhaatha

టార్గెట్ మోడీ? ..మోదీని త‌ప్పించాల‌నే…ఆర్ఎస్ఎస్ పట్టుసాధిస్తోందా?

75 ఏళ్లు నిండితే రిటైర్మెంట్ తప్పదా?
మోహన్ భాగవత్ కూడా తప్పుకుంటారా?
ఆర్ఎస్ఎస్ పట్టుసాధిస్తోందా?
మోదీకి మినహాయింపులుంటాయా?

హైద‌రాబాద్‌, జూలై12(విధాత‌):  ఆర్ ఎస్ ఎస్ మోదీని టార్గెట్ చేసిందా? ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి స్వ‌చ్చందంగా త‌ప్పుకునే విధంగా పావులు క‌దుపుతుందా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి. కేంద్రంలో వ‌రుస‌గా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి రావ‌డంతో కేవ‌లం మోదీ ప్ర‌భావంతోటే సాధ్య‌మైంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. పార్టీ నాయ‌కులు కూడా పార్టీ కంటే మోదీ జ‌పం చేయ‌డంమొద‌లు పెట్టారు.. బీజేపీకి ఆర్ ఎస్ ఎస్ అవ‌స‌రం లేద‌న్న తీరుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో 2024 ఎన్నిక‌ల నాటికి ఆర్ ఎస్ ఎస్ కు బీజేపీకి మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌న్నఅభిప్రాయం స‌ర్వ‌త్రా ఏర్ప‌డింది. దీని ప్ర‌భావం ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప‌డింది.చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయింద‌న్న తీరుగా బొటాబొటిగా మిత్ర‌ప‌క్షాల‌ను క‌లుపుకొని మూడ‌వ ద‌ఫా అధికార ప‌గ్గాలుచేప‌ట్టింది. అయితే ముఖ్యంగా మోదీపై ఆగ్ర‌హంతో ఉన్న ఆర్ ఎస్ ఎస్ అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తన అసంతృప్తిని బ‌య‌ట పెట్టింది. ఇందులో భాగంగానే ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భాగ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌ను అర్థంచేసుకోవాల్సి ఉంటుంద‌ని దేశ రాజ‌కీయాల‌ను అతి ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తున్న‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు అన్నారు.

చెక్ పెట్ట‌నున్న‌నిబంధ‌న‌
న‌రేంద్ర మోదీ బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాతనేక మంది సీనియ‌ర్ల‌ను వ‌య‌సు నిబంధ‌న పేరుతో ప‌క్క‌న పెట్టారు. తిరిగి అదే నిబంధ‌న‌తో మోదీకి చెక్ పెట్టాల‌ని ఆర్ ఎస్ ఎస్ పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. నిబంధ‌న ఏదైనా పార్టీలో అంద‌రికీ ఒకే తీరుగా ఉంటుంద‌ని, మ‌నుషుల‌ను బ‌ట్టి హోదాల‌ను బ‌ట్టి మార‌ద‌ని అంటున్నారు. సైద్దాంతిక ప్రాతిప‌దిక ఉన్న ఆర్ ఎస్ ఎస్‌, బీజేపీల‌లో ఎవ‌రికైనా ఒకే ర‌క‌మైన నిబంధ‌న ఉంటుంద‌ని చెపుతున్నారు. అందులో భాగంగానే రాజకీయ నాయకులకు 75 ఏళ్ల వయస్సు రాగానే తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను చూడాల‌ని చెపుతున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

మోహన్ భాగవత్ ఏమన్నారంటే?
75 ఏళ్ల వయస్సు వచ్చిందంటే శాలువా కప్పించుకుని బాధ్యతల నుంచి తప్పుకుని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అర్ధం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త మోర్పంత్ పింగ్లీకి అంకితం చేసిన పుస్తకావిష్కరణ సభ నాగ్ పూర్ లో జరిగింది.ఈ సభలో పింగ్లీ వాఖ్య‌లు భాగవత్ నోటి నుంచి వెలువ‌డ‌డం రాజకీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారితీసింది.

మోదీని త‌ప్పించాల‌నే…

ఈ ఏడాది సెప్టెంబర్ 17తో నరేంద్ర మోదీ వయస్సు 75 ఏళ్లు. దీంతో నరేంద్ర మోదీ కూడా రిటైర్మెంట్ అవుతారా అనే చర్చ తెరమీదికి వచ్చింది. మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఇదే బాటలో పయనిస్తారా అనే చర్చ కూడా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11 తో భాగవత్ వయస్సు కూడా 75 ఏళ్లకు చేరనుంది. దీంతో భాగవత్, మోదీ తమ తమ స్థానాల నుంచి తప్పుకుంటారా అనేది ప్రస్తుతం చర్చకు కారణమైంది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ అంశాన్ని ప్రస్తావించి మంచి స్వాగతాన్ని పలుకుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. అంతేకాదు భాగవత్ కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏళ్లు నిండుతాయనే విషయాన్ని మోదీ గుర్తు చేయాలని జైరామ్ రమేశ్ ఆ పోస్టులో చెప్పారు. ఒకే బాణం… రెండు లక్ష్యాలు అంటూ ఈ పోస్టుకు కామెంట్ పెట్టారు.బీజేపీ సీనియర్లు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటివారిని వయస్సు నిబంధనతో టికెట్లు నిరాకరించిన మోదీ… ఇప్పుడు తనకు ఈ నిబంధనను వర్తింపజేసుకుంటారా అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకుడు సంజయ్ రౌత్ ప్రశ్నించారు. భాగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మోదీ టార్గెట్ గా చర్చకు కారణమయ్యాయి. మోదీని తప్పించాలనే ఉద్దేశంతో భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అందుకే మోదీ పేరును ప్రస్తావించకుండా భాగవత్ జాగ్రత్తపడ్డారనేది విపక్షాల మాట. అయితే భాగవత్ వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని బీజేపీ కొట్టిపారేస్తోంది.

సీనియర్లకు టికెట్టు నిరాకరణ

75 ఏళ్లు నిండిన పార్టీ సీనియర్లకు బీజేపీ టికెట్లు ఇవ్వలేదు. ఇదే నిబంధన కింద మాజీ కేంద్ర మంత్రులు అడ్వాణీ, మురళీ మనోహార్ జోషీ, జశ్వంత్ సింగ్ లను పార్టీ పక్కన పెట్టింది. 75 ఏళ్లు నిండినందునే పార్టీ సీనియర్లు కొందరికి టికెట్లు ఇవ్వలేదని 2019లో ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనను పక్కన పెట్టారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. పార్టీ అవసరాల రీత్యా ఈ నిబంధనను పక్కన పెట్టారనేది రాజకీయ విశ్లేషకుల మాట. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఎంపికలో అప్పట్లో అడ్వాణీది కీలకపాత్ర అని చెబుతారు. గోద్రా అల్లర్ల ఘటన తర్వాత మోదీకి అడ్వాణీ అండగా నిలిచారనేది అప్పట్లో ప్రచారంలో ఉండింది. అలాంటి అడ్వాణీకి మాత్రం ఈ విషయంలో మినహాయింపు లభించలేదు.

దూరం పెర‌గ‌డానికి కార‌ణాలివే…
బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ కొంతకాలంగా అసంతృప్తితో ఉందనే ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. మహారాష్ట్రలో ఎన్సీపీతో జతకట్టడంపై ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాసం రాశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా బీజేపీ ప్రచారం చేసింది. అయితే బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఎన్‌డీఏలోని భాగస్వామ్యపక్షమైన టీడీపీ, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీనికి రకరకాల కారణాలున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో సహకరించలేదనే వాదన‌ కూడా ఉంది. ఎన్నికలకు ముందు ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ లో అసంతృప్తికి కారణమనే వాదన కూడా ఉంది. గతంలోని బీజేపీకి ఇప్పటి బీజేపీకి తేడా ఉంది. వాజ్ పేయ్ హయంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ బలపడింది. అప్పట్లో ఆర్ఎస్ఎస్ పై ఆధారపడినా ఇప్పుడు పరిస్థితి మారిందని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో పాటు ఇతరత్రా కారణాలు కూడా క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేయలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ సహా ఇతర రాష్టాల్లో దీని ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కన్పించిందనేది వారి వాదన.

ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో మోదీ
మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య సంబంధాల పునరుద్దరణ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ దిశగా రెండువైపులా చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రధాని హోదాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ఆయన తొలిసారిగా సందర్శించారు. బీజేపీ ,ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ ను పూడ్చే ప్రక్రియలో భాగంగానే మోదీ నాగ్ పూర్ లో సంఘ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారనే ప్రచారం కూడా సాగింది. తమ మధ్య బంధంలో ఎలాంటి ఇబ్బంది లేదని సంఘ్ కార్యాలయానికి వెళ్లడం ద్వారా మోదీ సంకేతం ఇచ్చినట్టైంది.

పట్టు కోసమేనా?

ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్న వారికే బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేలా సంఘ్ పట్టుబడుతోందనే ప్రచారం తెరమీదికి వచ్చింది. మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ వంటి నాయకుల పేర్లను బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రాల్లో కూడా ఆర్ఎస్ఎస్ సూచించిన నాయకులకే అధ్యక్ష బాధ్యతలు దక్కేలా సంఘ్ పావులు కదుపుతోందనే ప్రచారం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలున్న మాధవ్, రామచందర్ రావుకు అధ్యక్ష బాధ్యతలను బీజేపీ కట్టబెట్టింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరు నాయకులతో పాటు మరికొందరు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. కానీ, ఆర్ఎస్ఎస్ సూచించినందునే ఈ ఇద్దరూ ఇతరుల కంటే రేసులో ముందువరుసలో నిలిచారనేది పార్టీ వర్గాల్లో టాక్. దీంతో 2024 పార్లమెంట్ ఎన్నికల నుంచి బీజేపీతో అంటీముట్టనట్టు ఉంటున్న ఆర్ ఎస్ ఎస్‌ కమలంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోందా? ఇందులో భాగంగానే భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారా? అనిరాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మోదీని టార్గెట్ గా మాట్లాడినట్టుగా చూడాలని విపక్షాలు అంటున్నాయి. అయితే అబ్బే అలాంటిదేమీ లేదని కమలం పార్టీ చెపుతుండ‌డం గ‌మ‌నార్హం.

మార్గదర్శకులకేనా..?
కేంద్రంలో 2014 నుంచి వరుసగా మూడుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీ ఏ అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో ఎన్ డీ ఏ గెలుపులో నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ ను కొట్టిపారేయలేం.రిటైర్మెంట్ అనేది బీజేపీ రాజ్యాంగంలో లేదని 2023 మేలో అమిత్ షా ప్రకటించారు. 2029 వరకు నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని అన్నారు. ఒకవేళ మోదీని పక్కన పెడితే నెక్ట్స్‌ ఎవరు ఈ బాధ్యతలు చేపడుతారనే ప్రశ్న ఇప్పుడు అందరిని వేధిస్తోంది.వయస్సు నిబంధన పార్టీ అవసరాల రీత్యా కొందరికి మినహాయింపు ఇవ్వవచ్చు. మరోవైపు మోదీకి వయస్సు అనే నిబంధన వర్తించదని ఆర్ఎస్ఎస్ మాజీ నేత, సంఘ్ పరిశీలకులు దిలీప్ దేవధర్ అన్నారు. బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని…. మోదీకి ఇది వర్తించదని ఐదేళ్ల క్రితమే భాగవత్ వివరణ ఇచ్చారని దిలీప్ గుర్తు చేశారు.ఇక ఆర్ఎస్ఎస్ లో కూడా వయస్సు నిబంధనతో అనేది లేదు. రజ్జూభయ్యా, కేఎస్ సుదర్శన్ అనారోగ్య కారణాలతో 78 ఏళ్లకు ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బాలసాహెబ్ దేవరస్ 79 ఏళ్ల వరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ గా కొనసాగారు. భాగవత్ కూ ఫిట్ నెస్ విషయంలో ఇబ్బంది లేదు. అయితే భాగవత్ వ్యాఖ్యలు అంతర్గతంగా జరుగుతున్న చర్చలకు కారణమా.. లేదా యాధృచ్ఛికంగా ఆయన మాట్లాడారా అనేది భవిష్యత్తు పరిణామాలతో తేలనుంది.

Exit mobile version