(పి ప్రసాద్, IFTU)
Vandemataram | ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం 1600 లలో భారత ఉపఖండంలో అడుగుపెట్టింది. అది ‘విభజించి- పాలించు’ నీతితో అంచెలంచెలుగా బలపడుతూ వచ్చింది. చివరకు 1757 ప్లాసీ యుద్ధం తర్వాత ప్రత్యక్ష పరిపాలన చేపట్టింది. 1764 బక్సార్ యుద్ధం తర్వాత భూమిశిస్తు వసూళ్ళు చేసుకునే అధికారాన్ని పొందింది. ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం మధ్య ఏడేండ్ల వ్యవధి ఉంది. ఈ ఏడేండ్ల కాలంలో ప్రజల మీద, ముఖ్యంగా రైతాంగం పై ఈస్ట్ ఇండియా కంపెనీ అమానుష దాడులు, అత్యాచారాలు, దమనకాండలు పెరిగాయి. అవి అంతకుముందు ముస్లిం నవాబుల పాలనలో కంటే అనేక రెట్లు పెరిగాయి. ఫలితంగా బెంగాల్ పాలనా ప్రాంతంలో ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. అందులో నేటి పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు, నేటి బంగ్లాదేశ్ లున్నాయి. దీనికి క్షామం తోడైనది. వరుసగా వర్షాలు లేక తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. ఆకలి చావులు చాలా సర్వసాధారణం ఐనవి. ఆ క్షామం వల్ల జనాభాలో 20 నుంచి 30 శాతం మంది మరణించారు. సరిగ్గా ఆ నిర్దిష్ట నేపథ్య పరిస్థితులలో తలెత్తిన ఒక తిరుగుబాటు భారత ఉపఖండంలో బ్రిటిష్ వలస పాలన పట్ల మొదటి వ్యతిరేక విస్తార సాయుధ తిరుగుబాటుగా చరిత్రకు ఎక్కింది. అదే సుప్రసిద్ధ సన్యాసుల ఫకీర్ల ఉమ్మడి సాయుధ తిరుగుబాటు!
హిందూమత ప్రచారకులుగా, హైందవ ధర్మ పరిరక్షకులుగా సన్యాసులు పేరొందారు. వీరిని సంతానులని కూడా అంటారు. ముస్లిం మత ప్రచారకులుగానే కాకుండా, ఇస్లాం మత ధర్మ పరిరక్షకులుగా కూడా ఫకీర్లు పేరొందారు. ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని పీడిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా హిందూ, ముస్లిం మతాలకు చెందిన సన్యాసులు, ఫకీర్లు సమైక్యంగా తిరుగుబాటు సాగించారు. వందలాది మంది ఆయుధాలు ధరించి ప్రారంభించిన సాయుధ తిరుగుబాటు వేలమందికి విస్తరించింది. చివరకు లక్ష మందికి దాటింది. కోట్లాది ప్రజల ఆదరణ పొందింది. ఇది 1765 లో ప్రారంభమై 1800 వరకూ సాగింది. అరకొర సాయుధ చర్యలు 1805 వరకు సాగాయి. ఏదేమైనా మూడున్నర దశాబ్దాల పాటు నిరంతరాయంగా గెరిల్లా పద్ధతుల్లో తిరుగుబాటు సాగింది. బ్రిటిష్ వలసవాద ప్రత్యక్ష పాలన ఇక్కడ ఏర్పడ్డ తర్వాత విస్తృత జన బాహుళ్య భాగస్వామ్యంతో సుదీర్ఘకాలం సాగిన సాయుధ తిరుగుబాటుగా చరిత్ర ప్రసిద్ధికెక్కింది. అంతకంటే ప్రాధాన్యతగల మరో అంశం ఉంది. రెండు మతాల పరిరక్షకులు భుజం భుజం కలిపి సాగించిన తిరుగుబాటు కావడం మరో విశేషం!
ఆధునిక భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో హిందూ ముస్లిం ఐక్యత వెల్లివిరిసిన సందర్భాలు అరుదుగా ఉన్నాయి. వాటిలో 1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని సాధారణ ఉదాహరణగా చెబుతుంటాం. కొందరు మరో 50 ఏళ్ళు వెనక్కి వెళ్లి ఉదహరిస్తారు. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటాన్ని అందుకొక ఉదాహరణగా చెబుతారు. నిజానికి అది కూడా మొదటిది కాదు. మరో తొంబై ఏండ్లు వెనక్కి వెళ్తే హిందూ ముస్లిం ఐక్యత మరో అపురూప ఉదాహరణ దొరుకుతుంది. అదే హిందూ సన్యాసులు – ఇస్లాం ఫకీర్లు భుజం కలిపి సాగించిన సుదీర్ఘ సాయుధ తిరుగుబాటు!
1905 బెంగాల్ విభజన వ్యతిరేక పోరాటంలో హిందూ ముస్లిం మతాలను అనుసరించే ప్రజలు భుజం కలిపి పోరాడారు. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటం హిందూ–ముస్లిం మతాలను అనుసరించే సైనికుల (సిపాయిలు)తో ప్రారంభమై, రెండు మతాలకు చెందిన రైతుల ఆదరణ పొందింది. కానీ 1765 లో ప్రారంభమైన సాయుధ తిరుగుబాటు పై రెండు సందర్భాల కంటే పూర్తి భిన్నమైన మతఐక్యతతో సాగింది. ఐతే అది రెండు మతాలను అనుసరించే అనుయాయులతో సాగింది కాదు. అందుకు భిన్నంగా రెండు మతాల ప్రచారకులైన మత పరిరక్షకులతో సాగింది. హిందూ సన్యాసులు గానీ, ముస్లిం ఫకీర్లు గానీ మతానుయాయ వర్గాలు కాదు. వాళ్ళు ఆ రెండు మతాల ప్రచారకులు కావడం విశేషం! అంటే విదేశీ వలస పాలనకు వ్యతిరేకంగా రెండు మతాల ఉపరితలాలకు చెందిన ప్రజల మధ్య ఏర్పడ్డ ఐక్యత మాత్రమే కాదు. రెండు మతాల ఇరుసుల (న్యూక్లియన్) మధ్య ఏర్పడ్డ ఐక్యత కావడం విశేషం. అందుకే మతసామరస్యం, మత సమైక్యత, మత సహ జీవనం వంటి సాధారణ లౌకిక సంప్రదాయాలకు అది పూర్తి భిన్నమైనది. మత ప్రబోధక, ప్రచారక సమూహాలలో ఐక్యత ఏర్పడటం అసాధారణ స్థాయికి చెందినది. అది సాధారణ శాంతియుత ఉద్యమం కాదు. అది ఆయుధ ధారణ ద్వారా ఏర్పడ్డ ఐక్యత కావడం గమనార్హం!
ఐరోపా వర్తక కంపెనీలు ఇక్కడకు రాకముందు భారతదేశం రూపొందలేదు. విడివిడి పాలనా ప్రాంతాలుగా, రాజ్యాలుగా ఉండేది. కత్తి ఉన్న వాడిదే రాజ్యం. సరిహద్దులను కత్తి నిర్ణయించేది. ఆనాటి ఫ్యూడల్ యుగంలో ఫ్యూడల్ రాజ్యాలు ఉనికిలో ఉండేవి. ఆ నేపథ్య పరిస్థితుల్లో బెంగాల్ ఫ్యూడల్ నవాబు సిరాజుదౌలా రాజ్యాన్ని 1757లో ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సైన్యాలు ఓడించాయి. దాంతో విడివిడిగా వున్న స్వతంత్ర ఫ్యూడల్ రాజ్యాల స్థానంలో ఏకైక పరిపాలనా ఖండంగా ‘కంపెనీ ఇండియా’ ఏర్పడింది. ఫలితంగా ఆధునిక భారతదేశం రూపొందడానికి పునాది పడింది. అది ప్రత్యక్ష వలస పాలన ద్వారా సాధ్యమైనది. సహజంగా వలసపాలనకి వ్యతిరేక స్వాతంత్ర్య పోరాట దశ ప్రారంభమైనది. ఆ కొత్త దశలో ప్రప్రథమ వ్యవస్థీకృత సాయుధ తిరుగుబాటుగా సన్యాసుల, ఫకీర్ల తిరుగుబాటు చరిత్ర కెక్కుతుంది.
కొత్త చారిత్రక దశ ఏర్పడి, వలస వ్యతిరేక పోరాటాలకు ప్రాసంగికత ఏర్పడుతున్న పరివర్తనా కాలంలో సన్యాసులు, ఫకీర్ల ఉమ్మడి సాయుధ తిరుగుబాటు ఒక కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది. ఆనాటి కొత్త చరిత్రను మలినపరిచే రాజకీయ కుట్రలు తలెత్తడం కూడా సహజమే. అది పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ ఫలితమే. ఆ తిరుగుబాటులో వర్ధిల్లిన మత సమైక్యతకు కౌంటర్ కుట్రలో భాగమే బంకిం చంద్ర చటోపాధ్యాయ ‘ఆనందమఠం’ నవల! అందులో అంతర్భాగంగా చొప్పించినదే ‘వందే మాతరం’ గేయం.
1765 లో సన్యాసులు, ఫకీర్ల సాయుధ తిరుగుబాటు మొదలైనది. 1882 లో ఆనందమఠం నవల రచించింది. (అందులోని వందేమాతర గేయ రచన 1876లో రచించింది) అంతకంటే 117 ఏండ్ల క్రితమే మొదలై సాగిన తిరుగుబాటును తన నవలకు ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. బంకిం అంత ఆలస్యంగా పాత చరిత్రను కొత్త చూపుతూ రాయడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది.
13 శతాబ్దంలోనే లాంగ్ పార్లమెంట్ ఏర్పడ్డా; 1648 లో ఆలివర్ క్రాంవెల్ తిరుగుబాటు జరిగినా; 1688లో రక్తరహిత విప్లవం సంభవించినా, ఇంగ్లాండులో పారిశ్రామిక విప్లవం ఇంకా జరగలేదు. ఇక్కడ సన్యాసుల, ఫకీర్ల సాయుధ తిరుగుబాటు ప్రారంభమై సాగే కాలంలో యూరప్ లో మరమగ్గం, ఆవిరి యంత్రం, అచ్చు యంత్రం వంటి వైజ్ఞానిక అన్వేషణలు జరిగాయి. ఫలితంగా పారిశ్రామిక విప్లవం సంభవించింది. ఫ్యూడల్ యూరప్ ఖండం పెట్టుబడిదారీ యూరప్ ఖండంగా రూపాంతరం చెందింది. ఫ్యూడల్ చారిత్రక దశలో ఇక్కడకు వచ్చినదే ఈస్టిండియా కంపెనీ! దాని పాలనా దక్షతలు మొదట ఫ్యూడల్ దశకు పరిమితమైనవే. బ్రిటన్ కాపిటలిస్టు వ్యవస్థగా మారాకనే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకి చెందిన పాత ఫ్యూడల్ మొరటు విధానాలను లండన్ క్యాపిటలిస్టు ప్రభుత్వం దిద్దుబాటు చేయడానికి పూనుకుంది. అందుకే 1818లో కలకత్తా కాలేజీ స్థాపన జరిగింది. అది ఆధునిక విద్యతో పాటు సాంఘిక సంస్కరణలను ప్రోత్సహించింది. బాంబే, కలకత్తా, మద్రాసు వంటి విశ్వవిద్యాలయాల స్థాపనకు పూనుకుంది. అయినా 1857 లో ప్రథమ భారత స్వతంత్ర్య సమరం జరిగింది. 1765 సాయుధ తిరుగుబాటు మరో రూపంలో 1857 ప్రధమ భారత స్వాతంత్ర పోరాటంలో ఆవిష్కృతం ఐనది. 1765 సాయుధ తిరుగుబాటులో వెల్లడైన హిందూ ముస్లిం ఐక్యతే 90 ఏండ్ల తర్వాత 1857 తిరుగుబాటులో తిరిగి ఆవిష్కృతమైనది. ఆ పరిస్థితుల నుంచి గుణపాఠం తీసుకున్న లండన్ క్యాపిటలిస్టు సర్కార్ ఈస్టు ఇండియా కంపెనీ పాలనను రద్దు చేయడం గమనార్హం. ఆ తర్వాత పాత కంపెనీ ఫ్యూడల్ దౌత్యవిధానం స్థానంలో కొత్తగా బ్రిటీష్ క్యాపిటలిస్టు దౌత్య పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా కాళ్లు కలకత్తాలో ఉంచి బుర్రలను లండన్‌లో పెట్టే విద్యాధికులను ఉన్నత ఉద్యోగాల్లో నియామకం చేసుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ విధంగా తయారైన బ్రిటిష్ బానిస మేధోబుర్రల్లో బంకిం చంద్ర చటర్జీ బుర్ర ఒకటి!
ఆయా చారిత్రక దశలలో కర్త, కర్మ, క్రియల పాత్రల పట్ల మార్క్సిస్టు దృక్కోణంతో విశ్లేషణ చేయాల్సి ఉంది. బంకిం ని కర్తగా భావిస్తే చరిత్రకు వక్రీకరణ జరుగుతుంది. బంకిం స్వతంత్రుడైతే, కర్తవుతాడు. ఒకవేళ ఆయన బ్రిటిష్ పాలకుల చేతిలో కీలుబొమ్మ అయినట్లయితే కర్మ పాత్ర పోషించలేడు. మొదట బంకిం స్థానం ఏమిటో విశ్లేషించాల్సి ఉంది.
బంకిం సనాతన బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి విద్యాధికునిగా ఎదిగాడు. తన తండ్రి డిప్యూటీ మేజిస్ట్రేట్. ఆ రోజుల్లోనే బ్రిటిష్ పాలనా యంత్రాంగంలో బంకిం భాగస్వామి కావడం గమనార్హం. తండ్రికి మించిన తనయుడుగా బ్రిటిష్ రాజ్యాంగ యంత్రంలో భాగస్వామి అయ్యాడు. ప్రథమ భారత స్వాతంత్ర్య సమరంలో లక్షల మంది భారతీయులను నరమేధానికి గురిచేసిన బ్రిటీష్ ప్రభుత్వంలో ఆ మరుసటి ఏడాడే (1858) సివిల్ సేవకునిగా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ గా చేరి కలెక్టర్ గా కూడా దీర్ఘకాలం పని చేశాడు. 1858 నుంచి 32 ఏండ్లు పని చేసి 1890లో రిటైర్ అయ్యాడు. సర్వీసులో ఉండగానే ఆనందమఠం రచించాడు. ఒక వలస సామ్రాజ్య నిరంకుశ పాలనా యంత్రాంగంలో కలెక్టరుగా ఉద్యోగంలో ఉంటూనే ఆనందమఠం రచించడం గమనార్హం. దేశభక్తి ఇతివృత్తంగా రచించడానికి అవకాశం ఉండదు. పైగా ఆయన ఆ నవల రచించాక మరో ఎనిమిదేండ్లు కలెక్టర్‌గా చేశాడు. పైగా రిటైర్ అయ్యాక కూడా రాజ్ బహుదూర్ వంటి చాలా ప్రతిష్ఠాత్మక బిరుదులు పొందాడు. అంతేకాక ఆనందమఠం నవలను అచ్చు వేయించడంలో, అనువాదం చేయించడం, దేశవ్యాప్త విద్యాధికులకు త్వరగా అందించడంలో బ్రిటీష్ వలస పాలకులు తెరవెనుక ప్రయత్నాలు చేశారు. దీన్నిబట్టి బంకిం ద్వారా ఆనందమఠం నవల రాయించడం వెనక బ్రిటిష్ వలస పాలకులు కర్త పాత్ర పోషించారని అర్థమవుతుంది.
1765 నుంచి ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు భుజం కలిపి సాయుధ తిరుగుబాటు చేశారనేది భౌతిక సత్యం. కానీ ఆనందమఠం నవలలో ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసులు తిరుగుబాటు కొనసాగించినట్లు బంకిం చరిత్రను వక్రీకరించాడు. వలస పాలకులకు తమ బుర్రలను తాకట్టు పెట్టిన బుద్ధి జీవులు ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారో బంకిం ఒక ఉదాహరణగా నిలుస్తాడు. కాకిని గ్రద్దగా, తిమ్మిని బమ్మిగా మార్చే కట్టు కథలతో, చారిత్రిక వక్రీకరణలకు బంకిం పాల్పడ్డాడు. సన్యాసుల తిరుగుబాటు జరిగే నాటికి ముస్లిం పాలన లేదు. స్థూలస్థాయిలో 1757 ప్లాసీ యుద్ధంతో అది అంతమైనది. కానీ సూక్ష్మస్థాయిలో మాత్రం 1764 బక్సార్ యుద్ధంతో అంతమైనది. ఆ తర్వాత ప్రారంభమైన సన్యాసుల తిరుగుబాటు ఎవరి మీద సాగుతుంది? ఇది బుర్ర, బుద్ధి ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. 1757 నుంచి 1764 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన యొక్క దుష్ఫలితాలు సన్యాసులు, ఫకీర్లను ఐక్య తిరుగుబాటుకు ప్రోత్సహించాయి. ఇది చారిత్రక వాస్తవం.
హిందూ జాతీయ వాదానికి బంకిం ద్వారా బ్రిటిష్ పాలకులు శ్రీకారం చుట్టించారు. అందుకు ఆనందమఠం నవల ఒక సాధనంగా మారింది. హిందూ సన్యాసుల సాయుధ ప్రతిఘటనకు ప్రధానంగా భవానీ పాఠక్ తో పాటు దేవీ చౌదురాణి అనే మహిళ సారథ్యం వహించింది. చౌదురాణి నాయకత్వంలో హిందూ సన్యాసులు సాయుధులై ఈస్టిండియా కంపెనీ సైనిక పటాలాల మీద మరియు కంపెనీ అనుకూల జమీందార్ల మీద దాడులు చేశారు. సైనిక ఆయుధాగారాల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్రిటిష్ తొత్తు జిమిందార్ల నుంచి ధర ధాన్యాలు స్వాధీనం చేసుకొని దుర్భిక్ష పీడితులకు పంపిణీ చేయడం జరిగేది. ఆమె హిందూ ముస్లిం మతాల మధ్య ఐక్యతా చిహ్మంగా నిలిచింది. ఆ రోజుల్లో బెంగాల్ బీహార్ల ప్రజల తలలో నాలుకగా దేవీ చౌదురాణి మారింది. విశేష ప్రజాదరణ పొందింది. మరోవైపు ఫకీర్లకు మంజుషా నాయకత్వం వహించాడు. ఆయన బాగా గెరిల్లా నైపుణ్యం గలవాడు. 1765 నుంచి 1786 వరకూ 21 ఏండ్లు సాగిన నిరంతర గెరిల్లా యుద్ధానికి ఫకీర్లకి సారథ్యం వహించాడు. 1771లోనే 150 మంది హిందూ సన్యాసులను ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ఉరితీసింది. 1767లో ఐదువేల మంది సన్యాసులు సమావేశం జరిపిన చోటు కంపెనీకి చెందిన రెండు సైనిక పటాలాలు చుట్టుముట్టి దాడికి దిగాయి. 80 మంది మరణించారు. అదే విధంగా ముస్లిం ఫకీర్లపై కూడా నరమేధం సాగించింది. గంగ నుంచి బ్రహ్మపుత్ర నది వరకూ, ఎగువ నేపాల్ వరకూ అడవులు కొండలను గెరిల్లాలు తమ తలలను దాచుకునే కేంద్రాలుగా మలుచుకున్నాయి. హిందూ ముస్లిం మతాల ఐక్యతకు చిహ్నంగా సాయుధ ప్రతిఘటన సాగింది. అట్టి ఉజ్వల చరిత్రను తమ తొత్తుగా మార్చుకున్న భారతీయ మేధో బుర్రతో కంపెనీ వికృతపరిచింది.
1882లో రచించిన ఆనందమఠం నవలలో అంతకంటే ఆరేండ్ల క్రితం రచించిన వందేమాతరం గానాన్ని ఇరికించడంలో కూడా కుట్ర ఉంది. అది నిజానికి ఆ తిరుగుబాటు రెండు మతాల పరిరక్షక సమూహాలు తమ తమ మతవిశ్వాసాలతో కూడిన నినాదాలను ఇస్తూ ఆంగ్లేయుల పై పోరాడాయి. ఉదా:- స్వాతంత్రోద్యమంలో హిందూ దేవాలయాలు, ఇస్లాం మసీదులు, ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్’ అంటూ ప్రతిధ్వనించడం తెలిసిందే. సరిగ్గా అలాగే హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల సాయుధ తిరుగుబాటులోనూ ఒకే శత్రువుకు వ్యతిరేకంగా ఉమ్మడిగా భుజం కలిపి ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారు రౌద్ర భక్తి గానాలు చేశారు. కానీ గొప్ప చదువు చదివి గొప్ప ఉద్యోగం చేసిన మహా పండితుడైన బంకిం చంద్ర చరిత్రను ఘోరంగా వక్రీకరించాడు. ఒకటి, ఆంగ్లేయుల పై జరిగిన తిరుగుబాటును ముస్లిం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినట్లు వక్రీకరించాడు. రెండవది రెండు మతాల పరిరక్షక సమూహాలు పరస్పరం ఐక్యంగా సాగించిన ప్రతిఘటనను కేవలం హిందువులు చేసిందని వక్రీకరించాడు. మూడోది, రెండు మతాల చిహ్నాలు, ప్రతీకలు, నినాదాలతో జరిగిన తిరుగుబాటును ఒకేఒక్క హిందూదేవత కాళికాదేవిని స్మరిస్తూ వందేమాతరం పాటను పాడుతూ సాగించినట్లు వక్రీకరించాడు. ఇలాంటి అష్ట వక్రీకరణలకి పాల్పడ్డ మలిన, మకిల, కుటిల చరిత్రకు ఆనంద మఠం నవల అద్దం పడుతుంది.
జాదవ్ పూర్ యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్ ఐన అమృత సేన్ గుప్తా రచించిన SANYASI, FAKIR REBELLION (1770- 1800) పుస్తకం, బెంగాల్ పురాతత్వ శాఖ డైరెక్టర్ ఆనంద భట్టాచార్య రచించిన SANYASI AND FAKIR REBELLION పుస్తకం, AC చంద్ర రచించిన THE SANYASI REBILLION పుస్తకం వంటివి ఆనాటి సాయుధ ప్రతిఘటనను ఆవిష్కరిస్తాయి. అవన్నీ సన్యాసులు, ఫకీర్లు ఐక్యంగా సాగించినవని స్పష్టం చేశాయి. పైగా అధిక భూమిశిస్తులు, పన్నులతో చితికిపోయిన రైతాంగం, చేతివృత్తుల ప్రజాదరణ పొందిందని స్పష్టం చేస్తాయి. ఆనాటి సాయుధ తిరుగుబాటు కలకత్తా, ముర్షిదాబాద్, దినాజ్ పూర్, బర్ద్వాన్, చిట్టగాంగ్, రాజమహల్, రంగపూర్, మిడ్నపూర్, సిలహేట్, రామగర్ వంటి జిల్లాలకు విస్తరించిన తీరును వివరిస్తాయి. ఆనాటి చరిత్ర ఈనాటి ఆర్ఎస్ఎస్, బిజెపిల మతవిద్వేష రాజనీతికి బద్ద వ్యతిరేకమైనది. రెండు మతాల పరిరక్షక సమూహలు కలిసి ఒకే కాలంలో, ఒకే ఉమ్మడి శత్రువు పై భుజం కలిపి ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారి దేవుళ్ళను స్మరిస్తూ స్ఫూర్తి పొంది యుద్ధం చేశారు. కానీ కేవలం హిందూ మతాన్ని స్తుతించే వందేమాతర గీతాన్ని పాడుకుంటూ యుద్ధం చేసినట్లు బంకిం చంద్ర ఛటర్జీ చేర్చాడు. పైగా ముస్లిం మతాన్ని ద్వేషించే దృష్టికోణంతో రచించాడు. ఒక హిందూ దేవతను స్మరించే మత గేయాన్ని భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ గీతంగా నిర్ణయం చేయడం గమనార్హం.
ఆధునిక యుగంలో జాతీయ గీతాలు ప్రతి దేశానికి ఉన్నాయి. అందులో ఇండియా అధమ స్థానంలో ఉంది. ఉదాహరణకు ప్రధాన దేశాలు కొన్నింటిని పరిశీలిద్దాం. గ్రేట్ బ్రిటన్ గాడ్ సేవ్ ది కింగ్ / క్వీన్ (దేవుడు రాజు/ రాణిని కాపాడు గాక) అనే పాట జాతీయ గీతంగా ఉంది. స్వేచ్ఛ, స్వాతంత్యం, ప్రజాస్వామ్యాలను ధైర్యసాహసాలతో కాపాడుకోవాలంటూ అమెరికా జాతీయ గీతం ఉంది. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సమగ్రత, స్వేచ్ఛ పరిరక్షణల గూర్చి రష్యా జాతీయ గీతం చెబుతుంది. రవీంద్రనాద్ ఠాగూర్ రచించిన ‘అమర్ సోనార్ బంగ్లా’ బంగ్లాదేశ్ జాతీయ గీతం గా ఉంది. దేశ సమైక్యత, న్యాయం, స్వేచ్ఛ, మాతృదేశ పరిరక్షణ వంటి అంశాల కేంద్రంగా జర్మనీ జాతీయ గీతం వుంది. శ్రీలంకను మాతగా వర్ణించి స్వేచ్ఛ, దేశ ఆత్మగౌరవాలతో ఆ జాతీయ గీతం ఉంది. ముఖ్యంగా ఫ్రాన్స్, చైనా జాతీయ గీతాలు మార్చింగ్ సాంగ్స్ (యుద్ధ గీతాలు) గా ఉన్నాయి. కానీ మన భారతదేశ జాతీయ గీతాల్లో మాత్రం జాతీయత అనేది లేదు.
హిందూ సన్యాసులూ, ముస్లిం ఫకీర్లు భుజం కలిపి ఆంగ్లేయుల మీద సాగించిన యుద్ధంలో రెండు మతాల యుద్ధ గీతికలు ఉంటాయి. ఆ చారిత్రిక దశలో మత ప్రేరణ స్ఫూర్తిలతో యుద్ధ గీతికలుండడం సహజం. 1525 లో జరిగిన జర్మనీ రైతుయుద్ధం కూడా మత నినాదాలతో సాగింది. ఆ యుద్ధం గూర్చి ఏంగెల్స్ రచించిన ‘జర్మనీ రైతు యుద్ధం’ పుస్తకంలో మత దుస్తుల్లో రైతుల విప్లవ యుద్ధంగా విశ్లేషించడం గమనార్హం! పారిశ్రామిక రంగం ఆవిర్భావానికి ముందున్న చారిత్రక దశలో విప్లవ పోరాటాల్ని నిర్వహించే పీడిత వర్గాలు అనివార్యంగా మతం నుండి ప్రేరణ పొంది మత రూపం తీసుకుంటాయి. అదో చరిత్ర నియమం. ఆ ప్రకారం వలస వ్యతిరేక విప్లవ యుద్ధాలలో సైతం మత దేవతల నుంచి విప్లవస్పూర్తి పొందడం సహజం. ఫలితంగా ఒక మతస్థులు దేవత కాళికా దేవిని, మరో మతస్తులు అల్లాను స్మరిస్తూ యుద్ధ స్ఫూర్తిని పొందుతూ ఆంగ్లేయులపై భుజం కలిపి యుద్ధం చేశారు. అది రెండు మతాల వేర్వేరు మత గీతాలతో ఏకైక శత్రువుపై చేసిన యుద్ధం నేపథ్యం కాగా ఒక మతం మరో మతం పై యుద్ధ గీతికగా బంకిం చంద్ర చిత్రించాడు. అది 1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో దేశభక్తిగీతంగా బహుళ ప్రజాదరణ పొందింది. దాన్ని విద్వేష పూరితంగా రచించి ఆనందమఠం నవలలో కుట్రపూరితంగా బంకిం చొప్పించారు. కానీ అట్టి విద్వేష రాజకీయ లక్ష్యానికి విరుద్ధంగా వందేమాతరం గీతం ఆచరణలో నిజమైన సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తియుతమైన విప్లవ గీతంగా మారడం విశేషం.
నిజానికి కాళికామాత వంగదేశానికి పరిమితం. రాముడు, శివుడు, విష్ణు వంటి ఆర్య దేవుళ్ళ వలే భారత ఉపఖండంలోని సమస్త హిందువులు ఆరాధించే ప్రధానమైన దేవుళ్ళ కోవలోకి కాళికా మాత రాదు. నిజానికది వంగ విభజన వ్యతిరేక ప్రజా పోరాటంలో వంగ దేవతను ఆరాధించే గీతికగా ప్రాచుర్యం పొందింది. అది 1905లో వంగజాతితో మొదలైనా నాటి చారిత్రక పరిస్థితుల వల్ల 1906 నాటికి అదొక దేశ వ్యాప్త ఉద్యమంగా మారింది. బిపిన్ చంద్రతో పాటు తిలక్, లజపతి రాయ్ వంటి ప్రముఖ అతివాద కాంగ్రెస్ నేతలు చేతులు కలపడంతో అదొక మహెూద్యమంగా రూపొందింది. అందులో భాగంగా వందేమాతరం గేయం కూడా ప్రాచుర్యం పొందింది. జనగణమణ గీతానికి కనీసం అలాంటి నేపథ్యమూ లేకపోవడం గమనార్హం!
1757 నాటి ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియాకు కలకత్తా రాజధానిగా ఉంది. దానిని 1911లో ఢిల్లీకి మార్చాలని బ్రిటిష్ సర్కార్ నిర్ణయించింది. ఆ సందర్భంగా నూతన రాజధాని ప్రారంభోత్సవ వేడుకకు పంచమ జార్జి చక్రవర్తిని ఢిల్లీ పంపాలని అది నిర్ణయించింది. ఆ చక్రవర్తి రాకను జాతీయ కాంగ్రెస్ స్వాగతించింది. ఆ సందర్బంగా పంచమ జార్జి చక్రవర్తిని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన స్తుతిగీతమే “జనగణమన” కావడం గమనార్హం! అలాంటి స్థుతి గీతాన్ని రచించిన రవీంద్ర నాధ్ టాగూర్ కు గీతాంజలి రచన పేరిట రెండేండ్ల తర్వాత 1913 లో నోబెల్ బహుమతి రావడం గమనార్హం! రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంతకు ముందూ ఆ తర్వాతా దాదాబాయ్ నౌరోజీ నుంచి గాంధీ, నెహ్రూల వరకు ఇప్పించని నోబుల్ బహుమతిni ఠాగూర్ కి ఇప్పించడం గమనార్హం!
1937లో జాతీయ గీతంపై చర్చ జరిగింది. కాళికా దేవిని పొగిడే వందేమాతరం జాతీయ గీతంగా అర్హత లేదని ఏఐసిసి వర్కింగ్ కమిటీ దృష్టిలో కూడా ఉంది. కానీ ఉద్యమ గీతికగా ప్రాచుర్యం పొందినందున కాళిక (దుర్గామాత) పేరు గల చరణాల్ని తొలగించి ఆ నామ స్మరణలేని చరణాలకు పరిమితం చేసి ఆమోదించింది. దీన్నిబట్టి అది పూర్తి అర్హత లేని జాతీయ గీతమని అర్థమౌతోంది. ‘వందే దుర్గా’ బదులు ‘వందే మాతరం’ అన్న చరణాన్ని ఉంచడంలో వాస్తవానికి అర్థం లేదు. ‘వందే మాతరం’ అనే సంస్కృత పదానికి ‘తల్లీ వందనం’ అని అర్థం. ఆ తల్లి భరత మాత కాదు. ఆమె ఆధ్యాత్మిక దుర్గా మాత కావడం ప్రత్యేక గమనార్హం! (జాతుల ప్రాతిపదిక ప్రకారం ఆంధ్ర మాత, తమిళ మాత, హిందీ మాత వంటివి తప్ప భరత మాత ఉండవనుకోండి) అందుకే వందే మాతరం గీతంలోని రెండు చరణాల ఎంపిక కూడా జాతీయ గీతంగా అర్హత లేనిదే. రాజ్యాంగ రచన జరిగే సందర్భంగా, అది అమలులోకి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ లో తిరిగి అదే వివాదాస్పద చర్చ జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర బ్రిటిష్ వలస వ్యతిరేక విప్లవ పోరాట వెల్లువ కాలంలో బ్రిటిష్ వలస పాలకులతో కాంగ్రెస్ రాజీపడి అధికార మార్పిడి చేసుకున్నది. బ్రిటిష్ కామన్వెల్త్‌లో భాగస్వామ్య దేశంగా కొనసాగుటకు కూడా అంగీకరించింది. దాని ఫలితంగా సహజంగా బ్రిటిష్ వలస రాజనీతిని ప్రతిబింబించే స్థుతి గీతాలను మన జాతీయ గీతాలుగా, గానాలుగా జనగణమన, వందే మాతరంలను ఎంపిక చేసింది. ఒకటి బ్రిటిష్ వలస పాలకులను స్తుతించే భజన గీతం కాగా, మరొకటి బ్రిటీష్ వలస పాలకుల మత విద్వేష విధానానికి అద్దం పట్టే గీతం కావడం గమనార్హం! అధికారం చేపట్టిన కాంగ్రెస్ వాటిని జాతీయ గీతాలుగా అనుమతించడం కాకతాళీయ చర్య కాదు.
ఆనాడు బూర్జువా ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ ఆమోదించిన జాతీయ గీతాలలో జాతీయత లేదు. (కనీసం వందేమాతరం దేశభక్తి గీతంగా ప్రాచుర్యాన్ని పొందిన నేపథ్యం ఉంది. ‘జనగణమన’ కు మాత్రం అది కూడా లేదు). అదే వందే మాతరం నేడు ఆ బూర్జువా ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థని సైతం నిర్మూలించే లక్ష్యం గల ఫాసిస్టు రాజకీయ వ్యవస్థ చేతుల్లో ఒక సాధనంగా మారింది. ఇది చరిత్ర వైచిత్రియే!
ఆనాడు ప్రగతిశీల ముసుగులో నిజమైన దేశభక్తియుత, విప్లవ శక్తుల గొంతు నులిమే కాంగ్రెస్ సంస్థ జాతీయత లేని గీతాలను జాతీయ గీతాలుగా రుద్దింది. అదే గీతాన్ని నేడు సాధనంగా చేసుకొని పార్లమెంటులో అదే కాంగ్రెస్ ని బీజేపీ ఫాసిస్టు రాజకీయ వ్యవస్థ ఆత్మరక్షణలోకి నెట్టింది. ఇదొక రాజకీయ వైచిత్రియే!
2026లో బెంగాల్ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. ఈ వివాధం తిరిగి ఎజెండా మీదికి రావడానికి ఇదే ప్రధాన కారణం కావడం గమనార్హం!
1911 తర్వాత దేశ రాజధానిగా ఉనికిలోకి వచ్చిన ఢిల్లీ పీఠాన్ని 103 ఏండ్ల తర్వాత 2014 లో ఆర్ఎస్ఎస్, బిజెపి ఫాసిస్టు శక్తులు కైవసం చేసుకున్నాయి. అంతకు ముందు 1757 నుంచి 1911 వరకు 154 ఏండ్లు బ్రిటీష్ వలస పాలనలో దేశ రాజధానిగా కలకత్తా వుండేది. అలాంటి పూర్వ రాజధాని పీఠాన్ని కైవసం చేసుకోవడం బీజేపీ ఆర్.ఎస్.ఎస్ ఫాసిస్టు దారిలో ఒక నిర్ణయాత్మక లక్ష్యంగా ఉంది. అందుకే తన బెంగాల్ ఆపరేషన్ వ్యూహంలో బంకిం చంద్ర సృష్టించిన మత విద్వేష గీతం ఒక శక్తివంతమైన రాజకీయ సాధనంగా మార్చుకుంటున్నది.
మోడీ హయాంలో రూపాయి విలువ 50% పతనమైంది. డాలర్ తో సరిగా 90 రూపాయలకు పతనమైన సమయంలో పార్లమెంట్ 10 గంటల పాటు వందేమాతరం పై స్తంభించడం గమనార్హం! రూపాయి విలువ పతనం, నిరుద్యోగం, వాణిజ్య లోటు, ద్రవోల్బణం, ఢిల్లీ కాలుష్యం, ఆరావళి పర్యావరణ విధ్వంసం, ట్రంప్ వాణిజ్య ఆంక్షలు, నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయ రంగ సంక్షోభం, లేబర్ కోడ్లు, ఐదారు ప్రజావ్యతిరేక బిల్లుల పై గొంతెత్తాల్సిన పార్లమెంటును కేవలం వందే మాతరం పైకి దారి మళ్ళించగలిగింది. ఇదే ఫాసిజం రూపమూ,సారమూ!
నాజీ హిట్లర్ మరియు ఫాసిస్ట్ ముసోలినీల నాయకత్వంలోని పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ, తమ మాతృదేశాల గత చరిత్రల్ని రేపటి విధ్వంస చరిత్రల నిర్మాణం కోసం ఉపయోగించుకోవడం తెలిసిందే. ప్రాచీన, మధ్య యుగాల చరిత్రలలోని, ఆధునిక చరిత్రలోని ప్రగతి వ్యతిరేక అంశాల పునరుద్ధరణకి దిగడం తెల్సిందే. అంతవరకే వారు పరిమితం కాలేదు. గతించిన చరిత్ర గర్భంలో దాగిన ప్రగశీల అంశాల్ని సైతం వెలికితీసి తమ ఫాసిస్ట్ రాజకీయ లక్ష్య సాధన కోసం సాధనంగా వినియోగించుకున్నాయి. కర్ణాటక బిజెపి లోక్ సభ సభ్యుడు విశ్వేశ్వర హెగ్దే కగేరి జనగణమణను తొలగించి వందేమాతర గీతాన్ని తొలి జాతీయ గీతంగా ప్రవేశపెట్టాలని వివాధాస్పద చర్చను లేవనెత్తడం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బిజెపి ప్రముఖ నేత సువేంద్ అధికారి పెద్ద ర్యాలీని బంకిం విగ్రహం వరకు నిర్వహించి అలజడి సృష్టించడం తెలిసిందే. ఈ చర్యలన్నీ ఫాసిస్ట్ కుట్రలో భాగమే. జార్జి చక్రవర్తిని స్తుతించిన జాతీయ గీతం కంటే ముస్లిముల పై యుద్ధ నీతికి ఉపకరించే విద్వేష గీతానికి నేడు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం కాకతాళీయం కాదు. విజాతీయ జనగణమన స్థుతి గీతంలో బానిస ధర్మం దాగి వుంది. కానీ కుహనా శాంతి గీతమది. వందేమాతరాన్ని విద్వేష గీతంగా వక్రీకరిస్తే ముస్లిం వ్యతిరేక యుద్ధనీతిని వ్యాప్తి చేసే అవకాశం ఉంది. కత్తులు పట్టించే లక్ష్యం దాగి ఉంది. అదే ఫాసిస్టు పాలకులకు తక్షణ ఆవశ్యకమైనది. ఈ ఫాసిస్టు లక్ష్యాన్ని చారిత్రక దృష్టికోణంతో బహిర్గతపరచాల్సి ఉంది. ముఖ్యంగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ప్రజలను సమీకరించడం ద్వారానే యీ తరహా ఫాసిస్టు కుట్రలను ఓడించడం సాధ్యం అవుతుంది. ఓవైపు చారిత్రక దృష్టితో వాస్తవాలను బహిర్గత పరచడం ద్వారా ప్రజల్ని నిత్యం చైతన్యపరచడం, మరోవైపు ఆచరణాత్మక విధానాల ద్వారా ప్రజా సమస్యల పై ప్రజలను నిత్యం సమీకరించడం సమాంతర కర్తవ్యాలుగా చేపట్టాల్సిన అవసరం వుంది. ఇదే ఫాసిజాన్ని ఓడించే నిర్మాణాత్మక విధానం. మరో సులభ మార్గం లేదు. ఈ దారిలో పురోగమిద్దాం.
(ఇది సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పక్షపత్రిక ‘ప్రజాపంథా’ 2026 జనవరి 1-15 సంచికలో ప్రచురించిన వ్యాసం. ఇది 27-12-2025 తేదీన రాసింది)
