Mehul Choksi | తీవ్ర ప్రయత్నాల తర్వాత మెహుల్ ఛోక్సీని బెల్జియంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గీతాంజలి గ్రూప్ అధిపతి అయిన మెహుల్ ఛోక్సీని భారత్, బ్రెజిలియం అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. సాధారణంగా ఎవరిని అరెస్టు చేసినా.. ఒంట్లో బాగోలేదు.. నా అరెస్టు అక్రమం అంటూ డైలాగులు చెబుతారు. అఫ్‌కోర్స్.. ఛోక్సీ కూడా అదే పాట ఎత్తుకున్నాడు. ఇదెలా ఉన్నా.. ఆయన హనీ ట్రాప్ అంశం సామాజిక మాధ్యమాల్లో మోత మోగిస్తున్నది. తనను హనీట్రాప్ చేసి, అపహరించారని ఛోక్సీ ఆరోపిస్తున్నాడు. బార్బరా జబారికా అనే హంగేరియన్ మహిళ ఈ హనీట్రాప్ వేసినట్టు ఆయన అంటున్నారు.
ఎవరీ బార్బారా?
తన మోసం బయటపడటంతో అరెస్టును తప్పించుకునేందుకు 2028లో ఛోక్సీ భారతదేశం నుంచి పరారయ్యాడు. అంటిగ్వా అండ్ బార్బుడా దేశంలో ల్యాండ్ అయ్యాడు. కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా అక్కడి పౌరసత్వాన్ని సంపాదించాడు. ఆ తర్వాత 2021లో డొమినికాలో తేలాడు. ఆ దేశం వాళ్లు ఈయనను అక్రమంగా దేశంలోకి వచ్చాడంటూ అరెస్టు చేశారు. ఆ సమయంలోనే బార్బరా జబారికా పేరు సీన్‌లోకి వచ్చింది. తనను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టారని, ఒక బోటులో ఆంటిగ్వా నుంచి డొమినికాకు తీసుకొచ్చారనేది ఛోక్సీ ఆరోపణ. ఈ మొత్తంలో బార్బరా కీలక పాత్ర పోషించిందని చెబుతున్నాడు. బార్బారా లింక్‌డిన్ ప్రొఫెల్ చూస్తే.. ఆమె బల్గేరియాలో ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ ఏజెంట్, డైరెక్ట్ సేల్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అనుభవజ్ఞురాలైన సేల్స్ నెగోషియేటర్ అని తెలుస్తున్నది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ రంగంలో ఉన్నారు. ప్రాపర్టీ, రిటైల్ సంస్థల్లో మేనేమెంట్ పొజిషన్స్‌లో పనిచేసినట్టు రాసి ఉన్నది.
తాము 2020లో బార్బరాను కలిశామని, ఆమే తన భర్తను హనీట్రాప్ చేసినట్టు ఛోక్సీ భార్య పేర్కొన్నారని ఎన్డీటీవీ కథనం తెలిపింది. ఏవో కుంటిసాకులు చెబుతూ తమకు బార్బరా దూరమైందని, తాను అపహరణకు గురవడానికి కొద్దిసేపటి ముందు ఆమె తనను డిన్నర్‌కు ఆహ్వానించిందని ఛోక్సీ చెబుతున్నాడు. అయితే.. బార్బరా మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. తాను ఛోక్సీ గర్ల్‌ఫ్రెండ్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంటున్నదని ఎన్డీటీవీ తెలిపింది. తన వ్యాపారాలు, సొంత ఆదాయాలు తనకు ఉన్నాయని, తనకు ఛోక్సీ సొమ్ము, మద్దతు, హోటల్ బుకింగ్స్, నకిలీ ఆభరణాలు.. ఏవీ అవసరం లేదని బార్బారా పేర్కొన్నది. నిజానికి ఛోక్సీ తన ఐడెంటిటీని దాచి పెట్టాడని, రాజ్ పేరుతో తనను పరిచయం చేసుకున్నాడని ఆమె తెలిపింది. ఆయనే తన నంబర్ తీసుకున్నాడని, ఆయనే తనను దూరం పెట్టాడని చెబుతున్నది. ఛోక్సీ భార్య మాత్రం పూర్తి భిన్నంగా చెబుతున్నదని బార్బరా చెప్పినట్టు ఎన్టీటీవీ పేర్కొంది.