Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందో లేదో తనకు తెలియదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏపీ తరహాలోనే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైనా ఆయన స్పష్టతనిచ్చారు. జూబ్లీ హిల్స్ ఓటర్ల మూడ్ మారుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎవరితోనూ పొత్తు లేదని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ పార్టీ సీరియస్‌గా తీసుకుందన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓటర్ల మూడ్ మారుతుందని.. బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని చెప్పారు.
బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గొడవ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. ప్రతి కుటుంబంలో గొడవలున్నట్టుగానే పార్టీల్లోనూ గొడవలు సహజమన్నారు. అయితే తమ పార్టీలో గొడవలు సహజంగా బయటకు రావు..కానీ బయటకు వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పరిష్కరించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏ అంశమైనా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని రామచందర్ రావు సూచించారు. ప్రధాని మోదీని కన్వర్టేటెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మోదీపై చేసిన వ్యాఖ్యల ద్వారా ఆ సామాజిక వర్గాన్నే అవమానించారన్నారు. అసలు రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడమే తన ముందున్న మొదటి టాస్క్ అని తెలిపారు. ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.
బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్ ను ఆయన ప్రస్తావిస్తూ ఈ డిమాండ్ లో తప్పు లేదన్నారు. అయితే పొన్నం ప్రభాకర్ లేదా మహేశ్ కుమార్ గౌడ్ ను సీఎం చేయాలని ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో లీగల్ అంశాలను తాను మాట్లాడానని.. వాటిని కాంగ్రెస్ తప్పుబడుతోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కాంగ్రెస్ కు సాధ్యం కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారుల వద్దే వందల కోట్లు దొరుకుతున్నాయని ఆయన అన్నారు. ఇక రాజకీయ నాయకుల వద్ద ఇంకాఎంత దొరుకుతుందో అనే అనుమానం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతలతోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని ఆయన అన్నారు. మానవత్వంతోనే ఫాతిమా కాలేజీ కూల్చలేదని అంటున్నారు… పేదల ఇళ్లు కూల్చినప్పుడు మానవత్వం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. రాజాసింగ్ అంశం తన పరిధిలోనిది కాదు.. జాతీయ నాయకత్వం చూసుకుంటుందని రామచందర్ రావు వెల్లడించారు.