Leonia Resort Scam | లియోనియా రిసార్ట్.. పదివేల కోట్ల స్కామ్! : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

  • Publish Date - June 20, 2025 / 07:57 PM IST

Leonia Resort Scam  సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్కామ్‌ల పరంపర కొనసాగుతుందని.. లియోనియా రిసార్ట్‌లో సీఎం అనుచరుడు ఫహీమ్ ఖురేషి 10వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ సీఎం అనుచరుడు ఫహీమ్ ఖురేషి మరో నయీమ్ గా మారాడని ఆరోపించారు. శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ 180 ఎకరాల్లో ఉందని.. ఈ రిసార్ట్ బ్యాంకులకు 2200 కోట్ల బకాయిలు పడిందని.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న లియోనియాను మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి 330 కోట్ల రూపాయలకు కొట్టేశాడని జీవన్ రెడ్డి ఆరోపించారు. టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకుండా ఫహీమ్ ఖురేషి ఒత్తిడి తెచ్చి రంజిత్ రెడ్డికి లియోనియా దక్కేలా చేశారన్నారు. ఇందులో బీజేపీ ఎంపీలకు కూడా వాటా ఉందని… అందుకే దీనిపై వారు మాట్లాడటం లేదని ఆరోపించారు. లియోనియాకు డబ్బు బదిలీలో మనీ లాండరింగ్ కూడా ఉందని..ఈ వ్యవహారం పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారని..కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారం లో వెంటనే రంగం లోకి దిగాలన్నారు. ఈ స్కామ్ ట్రైలర్ మాత్రమేనని..మరిన్ని స్కామ్ లు త్వరలోనే బయట పెడుతామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు తమ అవినీతి మచ్చలు చూసుకోకుండా కేసీఆర్ మీద వాగుతున్నారన్నారు.

రేవంత్ ట్రిపుల్ ఆర్ స్కామ్స్
ట్రిపుల్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ ,రంజిత్ రెడ్డి స్కామ్స్ అని.. కేసీఆర్ ట్రిపుల్ ఆర్ స్కీమ్స్ అంటే రైతు బంధు ,రైతు రుణమాఫీ ,రైతు బీమా అన్నారు. స్కామ్ ల ద్వారా వసూలు చేసిన డబ్బు రాహుల్ గాంధీకి వెళ్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని, రేవంత్ ముఖ్య సలహాదారులు ఐదు వేల కోట్ల రూపాయలకు దేంట్లో తక్కువ కమిషన్ తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓ బిల్డర్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు కోర్టులో పిల్ వేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన నేత, కరువు తీర్చే కాళేశ్వరం కట్టిన కేసీఆర్ మీదనే కేసులు వేస్తారా? ఫార్ములా-ఈ కార్‌ రేసుతో హైదరాబాద్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కేటీఆర్‌పై కేసు పెడతారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించిన జీవన్‌రెడ్డి.. ఆయనను విచారణ పేరిట రేవంత్‌రెడ్డి వేధిస్తున్నాడని మండిపడ్డారు. తప్పుడు కేసులు ఎప్పటికీ నిలబడబోవని స్పష్టం చేశారు. సమావేశంలో మన్నె గోవర్ధన్ రెడ్డి, కె వాసుదేవ రెడ్డి, పల్లె రవికుమార్, రవి నాయక్ పాల్గొన్నారు.