పార్ల‌మెంటు ఎన్నిక‌లకు ముందే.. ఉద్యోగాల భ‌ర్తీకి య‌త్నాలు

ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఫిబ్ర‌వ‌రిలోగా చేప‌ట్టాల‌న్న ల‌క్ష్యంతో రేవంత్ రెడ్డి స‌ర్కారు ఉన్న‌ది. ఏడాదికి 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస

  • Publish Date - January 7, 2024 / 01:00 PM IST

– ముందుగా కొత్త క‌మిష‌న్ నియామ‌కం

– క్యాబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం.. ఆ తరువాత నోటిఫికేష‌న్లు

– ముందుగా ఫిబ్ర‌వ‌రిలోగా 22 వేల ఉద్యోగాలు

– టీఎస్పీఎస్సీ స‌భ్యుల రాజీనామాల ఆమోద‌మే త‌రువాయి

విధాత‌, హైద‌రాబాద్‌: ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఫిబ్ర‌వ‌రిలోగా చేప‌ట్టాల‌న్న ల‌క్ష్యంతో రేవంత్ రెడ్డి స‌ర్కారు ఉన్న‌ది. ఏడాదికి 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. పార్ల‌మెంటు ఎన్నిక‌లకు ముందుగానే క‌నీసం 22 వేల ఉద్యోగాల భ‌ర్తీకైనా నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌న్న కృతనిశ్చ‌యంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఒక ప్రైవేట్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఫిబ్ర‌వ‌రిలోపు 22 వేల ఉద్యోగాలు, డిసెంబ‌ర్‌లోగా 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని వెల్‌‌డించారు. అయితే ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో దీనికి ముందుగానే నియామ‌కాల ప్ర‌క్రియ‌లో భాగంగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల్సి ఉంటుంది. అయితే ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల చేయ‌డానికి సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఎన్నిక‌ల‌కు ముందుగానే నియామ‌కాలు పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌తో స‌ర్కారు ఉంది.

ఇందుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పాత టీఎస్పీఎస్సీ క‌మిటీ ర‌ద్దు ఆమోదం కోసం తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తోంది. ఉద్యోగ నియామకాలు చేప‌ట్టాలంటే టీఎస్పీఎస్సీ క‌మిటీ ఉండాలి. పాత క‌మిటీ రాజీనామా ఆమోదం పొందుతేనే కొత్త క‌మిటీని నియ‌మించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. పాత క‌మిటీ రాజీనామా కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌త్యేకంగా ఆ స‌భ్యుల‌తో మాట్లాడి రాజీనామా చేయ‌మ‌ని కోరారు. పాత ప్ర‌భుత్వంలో ఏర్ప‌డిన క‌మిటీ కాబ‌ట్టి, క‌మిటీ స‌భ్యులు కూడా గౌర‌వ సూచ‌కంగా రాజీనామా చేస్తామ‌ని చెప్పి, గ‌వ‌ర్నర్ కు రాజీనామాలు పంపించారు. స‌భ్యుల రాజీనామాల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజన్ రాష్ట్ర‌ప‌తికి పంపించారు. అయితే రాష్ట్రప‌తి కార్యాల‌యం కొన్ని విష‌యాల‌పై స్ప‌ష్ట‌త కోరుతూ ఫైల్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి పంపించింది. ఈ ఫైల్ గ‌వ‌ర్న‌ర్ ద్వారా తిరిగి రాష్ట్ర ప్ర‌భుత్వానికి చేరింది. రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్ర‌ప‌తి అడిగిన క్లారిఫికేష‌న్లు పంపించే ప‌నిలో ఉంది. ఒక‌టి, రెండు రోజుల్లో క్లారిఫికేష‌న్లు రాష్ట్ర‌ప‌తికి పంపించ‌నున్నారు.

అయితే టీఎస్పీఎస్సీకి చైర్మ‌న్‌తో పాటు 10 మంది స‌భ్యుల‌ను నియ‌మించుకునే అవ‌కాశం ఉంది. దీనిని సానుకూల పరిణామంగా భావించిన సీఎం రేవంత్‌రెడ్డి ఖాళీగా ఉన్న 5 స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు సిద్ధమ‌య్యారు. ఈ మేర‌కు సోమవారం జరిగే మంత్రి వ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే చైర్మ‌న్ లేకుండా నియామ‌కాలు చేప‌ట్ట‌లేమంటున్న సీఎం.. రాజీనామాలు ఆమోదం కాగానే చైర్మ‌న్‌ను నియ‌మించ‌డానికి సిద్ధమ‌య్యారు. ఇలా ఉద్యోగాల నియామ‌కాలు పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందే చేప‌ట్టాల‌న్న దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్న‌ట్లు తెలుస్తోంది.