Bobbili Raja| 35 ఏళ్ల బొబ్బిలి రాజా.. ఎవర్ గ్రీన్

దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన బొబ్బిలి రాజా చిత్రం 1990 సెప్టెంబర్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆదివారంతో 35ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచి నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.

విధాత: సురేష్ ప్రోడక్షన్స్(Suresh Productions) నిర్మించిన బొబ్బిలి రాజా(Bobbili Raja) చిత్రం విడుదలై ఆదివారంతో 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దర్శకుడు బి. గోపాల్(B. Gopal) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్( Venkatesh)దివ్యభారతి(Divya Bharti) హీరో హీరోయిన్లుగా నటించిన బొబ్బిలి రాజా చిత్రం 1990 సెప్టెంబర్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తమిళంలో వాలీబన్ గా, హిందీలో రామ్ కా పూర్ రాజా పేరుతో డబ్ చేశారు. 1993లో బాయ్ ఫ్రెండ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో బొబ్బిలి రాజా సినిమాతోనే హీరోయిన్ గా దివ్యభారతి ఎంట్రీ ఇచ్చి స్వల్పకాలంలోనే కుర్రాళ్ల కలల రాణిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సురేష్ బాబు నిర్మాత వ్యవహరించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. సినిమాలోని ఐదు పాటలు మ్యూజికల్ హిట్ గా నిలవగా..మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. ముఖ్యంగా బలపం పట్టి భామ బళ్లో పాట..యానిమేషన్ జంతువుల మధ్య సాగే కన్యకుమారి పాట ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలోని హీరో వెంకటేష్ మేనరిజం ‘అయ్యో అయ్యో అయ్యయ్యో…’ డైలాగ్‌ ఫెమస్ అయ్యింది. దివ్యభారతి గ్లామర్..డ్రెస్సింగ్ ..డ్యాన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఫారెస్టు బ్యాక్ డ్రాప్..లవ్ డ్రామా

పరుచూరి బ్రదర్స్ కథ అందించిన బొబ్బిలి రాజా సినిమా లవ్ డ్రామాతో ఫారెస్టు బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. ప్రజాపక్ష నాయకుడిగా ఉండే సుందరయ్య (గుమ్మడి) కు, కోటీశ్వరురాలైన రాజేశ్వరి దేవి (వాణిశ్రీ) కి మధ్య ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీతో వివాదం ఏర్పడుతుంది. సుందరయ్య కూడా నామినేషన్‌ వేయడంతో ఆ కుటుంబంపై చెడుగా ప్రచారం చేయిస్తుంది. సుందరయ్య కూతురు రాజ్యలక్ష్మి (సుమిత్ర), రాజేశ్వరి దేవి తమ్ముడు సూర్యం (విద్యాసాగర్) ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో రాజ్యలక్ష్మి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని రాజేశ్వరి దేవి… సుందరయ్య కుటుంబంపై తన అన్నయ్య అహోబలరావు (కోట శ్రీనివాసరావు)తో కలసి చెడు ప్రచారం చేయిస్తుంది. సూర్యం, అహో బలరావుల మధ్య గొడవ తలెత్తిన గొడవలో మేడపై నుంచి పడి సూర్యం చనిపోతాడు. ఆ హత్య రాజ్యలక్ష్మి, సుందరయ్య చేశారని ఆరోపిస్తూ వారిని జైలుకు పంపుతుంది రాజేశ్వరి దేవి. అక్కడ ఇన్‌స్పెక్టర్‌ రాజ్యలక్ష్మిని బలాత్కారం చేయడానికి ప్రయత్నించడంతో అతనిని హత్య చేసి, తండ్రితో కలసి అడవిలోకి పారిపోతుంది.

కొన్నాళ్లకు రాజ్యలక్ష్మికి కొడుకు రాజా (వెంకటేశ్‌) అడవిలోనే పుట్టి పెరుగుతాడు. నగరంలో రాజేశ్వరిదేవికి రాణి (దివ్య భారతి) అనే కుమార్తె పుడుతుంది. తర్వాతి కాలంలో రాజేశ్వరీ దేవి రాష్ట్రానికి అటవీ శాఖ మంత్రి అవుతుంది. ఆమె కూతురు దివ్యభారతి స్నేహితులతో కలసి అడవికి టూర్‌కు వెళ్లిన సమయంలో గైడ్‌గా రాజా వస్తాడు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత తన తల్లిని అవమానించిన రాజేశ్వరి దేవి గురించి తెలిసిన రాజా ఏం చేశాడు? రాణి-రాజా ప్రేమ ఏమైందన్న సన్నివేశాలతో సినిమా కొనసాగుతుంది.

లోకేషన్లు..కెమెరా పనితనం అదనపు బలం

అడవిలో దివ్యభారతి, వెంకటేష్ లు తప్పిపోవడం.. ఈ క్రమంలో చిరుత పులితో, కోయగూడంలో భారీ కాయుడితో ఫైట్స్..అడవిలో హీరో హీరోయిన్ల మధ్య కయ్యాలు..ప్రేమాయణాలతో కథ సాగుతుంది. తన కుటుంబానికి మంత్రి వాణిశ్రీ(రాజేశ్వరీ)నే అన్యాయం చేసిందని తెలుసుకున్న హీరో వెంకటేష్ ఆమెకు బుద్ది చెప్పి రాణిని పెళ్లి చేసుకునే ప్రయత్నాలతో సినిమా క్లైమాక్స్ ఫైట్ కు చేరుకుంటుంది. సన్నివేశ పరంగా వాటన్నింటిని సినిమాలో అందంగా మలిచారు. ఫారెస్టు బ్యాక్ డ్రాప్ లో సాగిన సినిమాలో చాల భాగం తమిళనాడులోని పుల్లాచి సమీపంలో షూటింగ్ చేశారు. కెమెరామెన్ రవీంద్రబాబు అడవి అందాలను, వన్యప్రాణుల సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దారు. రైలులో వన్యప్రాణుల మధ్య కొనసాగే క్లైమాక్స్ ఫైట్ నల్లమల అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు. అందుకే ఈ సినిమా నేటి తరంలో కూడా కుటుంబంతో సహా అలరించే సినిమాగా నిలిచింది. అడవి నేపథ్యానికి ఆధునిక హంగులద్ది ఈ చిత్రాన్ని రీమేక్ గా..లేదా సీక్వెల్ గా రూపొందిస్తుంటుందని ప్రేక్షకులు కోరుకోంటున్నారు.