Jana Nayagan Trailer | ‘భగవంత్ కేసరి’ ఛాయల మధ్య విజయ్ చివరి సినిమా

విజయ్ చివరి సినిమా ‘జన నాయకుడు’ ట్రైలర్ విడుదలతో ఇది ‘భగవంత్ కేసరి’కి మక్కీకి మక్కీ రీమేక్ అన్న చర్చ జోరందుకుంది. కథ గమనం, పాత్రలు, సీన్ టు సీన్​ పోలికలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

భగవంత్ కేసరి ఛాయలను గుర్తు చేస్తున్న జన నాయకుడు ట్రైలర్ కీలక ఫ్రేమ్

Jana Nayagan Trailer Fuels Bhagavanth Kesari Remake Debate

విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

Jana Nayagan Trailer | తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జన నాయకన్​’ ట్రైలర్ విడుదలతో తమిళనాడు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ మొదలైంది.  తెలుగులో ఈ చిత్రం ‘జన నాయకుడు(Jana Nayakudu)’గా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలకానున్న ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్​ తెరకెక్కించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ట్రైలర్ చూస్తే ఇది నందమూరి బాలకృష్ణ నటించిన హిట్ మూవీ “భగవంత్ కేసరి(Bhagavant Kesari)”ని దాదాపుగా దింపేసినట్లు కనబడుతోంది. పోలీస్ ఆఫీసర్‌గా హీరో ఎంట్రీ, ఆ తర్వాత ఖైదీ అవతారం, యువతిని ఆర్మీలోకి పంపాలన్న లక్ష్యం, అడవుల్లో విలన్లతో యాక్షన్ సన్నివేశాలు, బడా బిలియనీర్‌తో ఢీ—ఇలా కథా ప్రవాహం, కీలకమైన భావోద్వేగ సన్నివేశాలు అన్నీ ఒరిజినల్ సినిమాకు సమీపంగా ఉన్నాయి.  ట్రైలర్‌లో జైళ్లోని ఫైట్, ఇంటర్వెల్ సీన్​, ఫ్యాక్టరీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా భగవంత్​ కేసరిని తలపిస్తుండంతో నెటిజన్లు పోలికల క్లిప్​లతో సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు.

రీమేక్ అన్నమాటను తప్పించుకుంటున్న తమిళ, తెలుగు దర్శకులు

‘జన నాయకుడు’లో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించగా, ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. పాత్రల రూపకల్పన, సెంటిమెంట్ ట్రాక్, పోరాట సన్నివేశాలు ‘భగవంత్ కేసరి’ ఛాయలలో నడవడమే ట్రైలర్ ప్రధాన ప్రత్యేకతగా మారింది.

అయితే ఇందులో మార్పులేవైనా ఉన్నాయంటే అవి రాజకీయ డైలాగ్‌ల్లోనే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. “జనానికి మంచి చేయాలని రాజకీయాల్లోకి రావద్దు… హత్యలు, దోపిడీల కోసం రాజకీయాలు..” వంటి డైలాగ్‌లు విజయ్ రాజకీయ ప్రవేశానికి నేరుగా సంధించినట్లున్నాయనే చర్చ జరుగుతోంది. దర్శకుడు హెచ్ వినోద్​ మాత్రం ఇప్పటివరకు దీనిని రీమేక్ అని అధికారికంగా అంగీకరించలేదు. “ఇది రీమేక్ కాదా అన్నది చెప్పలేను… కానీ ఇది పక్కా విజయ్ సినిమా” అంటూ సమాధానం దాటవేయడం గమనార్హం.

మరోవైపు ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా మౌనం పాటించారు. ట్రైలర్‌లో ఎక్కడా ఆయన పేరు లేకపోవడంతో, కథతో పాటు అన్ని హక్కులు కొనుగోలు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారన్న వాదన వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. చిన్నచిన్న మార్పులు చేసినంత మాత్రాన కథ కొత్తగా మారదన్న విమర్శలు తెలుగునాట, విజయ్ రాజకీయ ప్రయాణానికి ఇది సరైన వేదికగా మారుతుందన్న అంచనాలు తమిళనాట వినిపిస్తున్నాయి.

అయితే భగవంత్​ కేసరి గురించి తమిళ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కాబట్టి, అక్కడ సమస్యేమీ లేదు. కాకపోతే తెలుగులో కూడా జననాయకుడుగా ఈ చిత్రం రాబోతోంది కనుక, తెలుగు ప్రేక్షకులు మాత్రం తప్పకుండా పోల్చిచూస్తారు. దానివల్ల విజయ్​కు వచ్చిన నష్టమేమీ లేదు. చివరి సినిమా తమిళనాడులో పేరు తెచ్చుకుంటే చాలు కదా.

Latest News