Karnataka Student found Dead | అమెరికాలో విషాదం: కర్ణాటక విద్యార్థి సాకేత్ మృతదేహం లభ్యం

అమెరికాలో చదువుతున్న కర్ణాటక విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం కాలిఫోర్నియాలో లభించింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్​లీ మాస్టర్స్ విద్యార్థి అయిన సాకేత్ అదృశ్యమై 6 రోజులు గడిచిన తర్వాత టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. భారత రాయబార కార్యాలయం కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ, సహాయం చేస్తామని తెలిపింది.

Saketh Sreenivasaiah Karnataka student at UC Berkeley found dead in California after going missing for six days

Karnataka Student Found Dead in California After 6 Days – UC Berkeley Scholar Saketh’s Tragic End

విధాత ప్రపంచం డెస్క్ | హైదరాబాద్:

Karnataka Student found Dead | అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి విషాదాంతం కలచివేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య కాలిఫోర్నియాలో దుర్మరణం పాలయ్యాడు. ఫిబ్రవరి 9 నుంచి కనిపించకుండా పోయిన సాకేత్ కోసం ఆరు రోజులపాటు సాగిన గాలింపు చర్యలు చివరకు విషాదాంతంగా ముగిసాయి.

సాకేత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్​లీ (UC Berkeley)లో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. అంతకుముందు ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రతిభావంతుడిగా, డీప్ టెక్ పరిశోధనలపై ఆసక్తి ఉన్న యువ శాస్త్రవేత్తగా స్నేహితులు అతన్ని పేర్కొంటున్నారు.

కనిపించకుండా పోయిన రోజు ఏమైంది?

ఫిబ్రవరి 9న బర్క్​లీ హిల్స్ ప్రాంతంలోని అన్జా లేక్​ సమీపంలో సాకేత్ చివరిసారిగా కనిపించాడు. అనంతరం టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలోని ఒక ఇంటి వద్ద  అతని బ్యాక్‌ప్యాక్ — అందులో పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ లభించాయి. దీంతో పోలీసులు విస్తృత గాలింపు ప్రారంభించారు.

స్థానిక సమాజం, యూనివర్సిటీ విద్యార్థులు, స్నేహితులు, సోషల్ మీడియా వేదికల ద్వారా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అతని రూమ్‌మేట్ బనీట్ సింగ్ లింక్డిన్ ద్వారా సహాయం కోరాడు. అయినప్పటికీ ఆచూకీ తెలయకపోగా, ఆరు రోజుల తర్వాత పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

భారత రాయబార కార్యాలయ ప్రకటన

సాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించింది. “అదృశ్యమైన  భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం” అని తెలిపింది.

కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని, మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు వేగవంతంగా చేస్తామని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)ను సంప్రదించి సహాయం కోరినట్టు సమాచారం.

సాకేత్​ మానసిక ఆరోగ్యంపై చర్చ

సాకేత్ ఇటీవల కొంతమేర ఒత్తిడిలో ఉన్నట్టు అతని రూమ్‌మేట్ తన పోస్టులో పేర్కొన్నాడు. చివరి రోజుల్లో అతను మానసికంగా కుంగిపోతున్నట్లు గమనించామని తెలిపాడు. ఈ ఘటన అంతర్జాతీయ విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రత అంశాలపై మళ్లీ చర్చకు దారితీసింది.

లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ, ఇతర దేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపింది. అవసరమైతే తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Latest News