Vijay | గొప్ప వీడ్కోలు ఇవ్వాల‌ని అనుకున్నాం.. ప‌రిస్థితి మా చేయి దాటిందంటూ నిర్మాత ఆవేద‌న‌

Vijay | కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రస్తుతం ఊహించ‌ని అడ్డంకులతో నిలిచిపోయింది. సినిమాలకు వీడ్కోలు ప్రకటించిన విజయ్ కెరీర్‌లో ఇదే చివరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది.

Vijay | కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రస్తుతం ఊహించ‌ని అడ్డంకులతో నిలిచిపోయింది. సినిమాలకు వీడ్కోలు ప్రకటించిన విజయ్ కెరీర్‌లో ఇదే చివరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మమితా బైజు, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, సెన్సార్ సర్టిఫికేట్‌కు సంబంధించిన అంశాల కారణంగా విడుదల కాలేకపోయింది. దీంతో ఇప్పటికే షోలు బుక్ చేసుకున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలోకి వెళ్లడంతో, కోర్టు తదుపరి విచారణను జనవరి 21, 2026కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సినిమా విడుదల కష్టసాధ్యంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై చిత్ర పరిశ్రమ వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిస్థితులపై తాజాగా నిర్మాత వెంకట్ నారాయణన్ స్పందించారు. అభిమానులను ఉద్దేశించి ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ, సినిమా వాయిదా పడినందుకు క్షమాపణలు తెలిపారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తమకు వచ్చిన కాల్స్, మెసేజ్‌లు తెలియజేస్తున్నాయని అన్నారు. అయితే, విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, అన్ని వివరాలను బహిరంగంగా చెప్పలేమని స్పష్టం చేశారు.

నిర్మాత వివరాల ప్రకారం, ఈ సినిమాను డిసెంబర్ 18, 2025న సెన్సార్ బోర్డుకు సమర్పించగా, డిసెంబర్ 22న కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులన్నింటినీ చేసి, UA 16+ సర్టిఫికేట్ వస్తుందని భావించి మళ్లీ సినిమాను పంపామని తెలిపారు. కానీ అనుకున్నట్లుగా సర్టిఫికేట్ జారీ కాకపోవడంతో, మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందన్నారు.ఇక సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, జనవరి 5 సాయంత్రం ఒక ఫిర్యాదు ఆధారంగా చిత్రాన్ని రివ్యూ కమిటీకి పంపినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. జనవరి 6, 7 తేదీల్లో జరిగిన విచారణ అనంతరం కోర్టు UA 16+ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, సెన్సార్ బోర్డు అప్పీల్ కారణంగా ఆ ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిచిపోయాయని వెల్లడించారు.

చివరగా, సినిమా ఆలస్యం కావడంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు అందరికీ మరోసారి క్షమాపణలు చెబుతూ, వీలైనంత త్వరగా అన్ని సమస్యలు పరిష్కరించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన విజయ్‌కు గొప్ప వీడ్కోలు దక్కాలని తాము కూడా కోరుకుంటున్నామని, కానీ ప్రస్తుతం పరిస్థితులు తమ నియంత్రణకు మించి ఉన్నాయని నిర్మాత వ్యాఖ్యానించారు.

Latest News