Supreme Court Rejects Appeal: Vijay’s Jana Nayagan Faces Another Major Setback
జన నాయకన్ తాజా వివాదం
సుప్రీం కోర్టు నిర్మాతల విజ్ఞప్తిని తిరస్కరించడంతో, జన నాయగన్ విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, హైకోర్టు విచారణ—అన్నీ కలిసి చిత్రం విడుదలను ప్రభావితం చేస్తున్నాయి.
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
Jana Nayagan | విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జన నాయగన్ చిత్రానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురు చూస్తోంది. దీని కోసం నిర్మాతలు వేగవంతమైన విచారణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, గురువారం అత్యున్నత న్యాయస్థానం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇంత తొందరెందుకు.. అని వ్యాఖ్యానిస్తూ, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కే వెళ్లాల్సిందిగా సూచించింది.
సుప్రీం కోర్టు సూటి వ్యాఖ్యలు – ‘ఇంత తొందర ఎందుకు?’
నిర్మాతల తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూజనవరి 9 విడుదల తేదీ నిర్ణయించి 5,000 థియేటర్లు బుక్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. పది కట్స్‌తో సర్టిఫికెట్ ఇస్తామని సెన్సారు వారు చెప్పారని విన్నవించగా, సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. తిరస్కరించబడిన ఆర్డర్‌ను ఛాలెంజ్ చేయలేరంటూ, ఇప్పటికే జనవరి 20న డివిజన్ బెంచ్ విచారణకు చేపట్టినందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, అక్కడికే వెళ్లాల్సిందిగా న్యాయస్థానం స్పష్టం చేసింది.
కేసు ఫైల్ చేసిన రెండ్రోజుల్లోనే క్లియర్ చేసే జడ్జీలను మేము స్వాగతిస్తాం. కానీ ఈ విషయంలో ఇంత వేగం ఎందుకంటూ అంటూ జస్టిస్_దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. ఈ కేసులో సింగిల్ జడ్జి ఆదేశించిన U/A సర్టిఫికేట్‌పై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్ ఆదేశాలను నిర్మాతలు సవాల్ చేసే ప్రయత్నాలను సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
సెన్సార్ బోర్డు అభ్యంతరాలు – సైనిక ప్రతీకలపై పరిశీలన తప్పనిసరి
సెన్సార్ బోర్డు ఈ సినిమా విషయంలో ఇటీవల సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ వేసి, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరింది. చిత్రంలో సైన్యానికి సంబంధించిన చిహ్నాలు, గుర్తుల వినియోగం ఉందనీ, అవి నిపుణుల పరిశీలనకు పంపాల్సి ఉందని కోర్టుకు తెలియజేసింది.
మద్రాస్ హైకోర్టు జనవరి 9న U/A సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించినా, అదే రోజున సెన్సార్ బోర్డు స్టే కోసం దరఖాస్తు చేసి, కేసు అత్యవసర వినతిగా విచారణకు రావడంతో, విడుదలపై స్టే విధిస్తూ, తదుపరి విచారణ ఈనెల 20న జరుగుతుందని వాయిదా వేసింది. దీనిపైనే నిర్మాతలు త్వరితగతి విచారణ కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కేసు ఇప్పుడు జనవరి 20కు మళ్లీ మద్రాస్ హైకోర్టులో విచారణకు వస్తోంది.
ఈ నేపథ్యంలో సినీ హీరోగా జననాయగన్ తన చివరి సినిమాగా ప్రకటించి, తర్వాత పూర్తిగా రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్న విజయ్, పొంగల్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వరకే పరిమితమయ్యారు.
