Rajinikanth Times | రజనీకాంత్ టైమ్స్‌ – తలైవా సినీ స్వర్ణోత్సవ వేళ ‘ హిందుస్తాన్ టైమ్స్’ అరుదైన గౌరవం

రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గౌరవిస్తూ,  హిందుస్తాన్ టైమ్స్ తన మొదటి పేజీని, మాస్ట్​హెడ్​ను  ‘రజనీకాంత్ టైమ్స్’గా మార్చి చరిత్ర సృష్టించింది. తలైవా దేశవ్యాప్త అభిమానానికి ఒక పత్రిక ఇచ్చిన అరుదైన  గౌరవం.

Rajinikanth Times: Hindustan Times Honors 50 Years of Thalaivar With Historic Front Page

Rajinikanth Times: Hindustan Times Honors 50 Years of Thalaivar With Historic Front Page

సంక్షిప్తంగా

హిందుస్తాన్ టైమ్స్ తన 100 ఏళ్ల చరిత్రలో తొలిసారి మొదటి పేజీని ‘రజనీకాంత్ టైమ్స్’గా మార్చి తలైవా 50 ఏళ్ల సినీ ప్రయాణానికి ఘన నివాళి అర్పించింది. బస్సు కండక్టర్‌గా ప్రారంభమైన రజనీ యాత్ర దేశవ్యాప్తంగా దైవారాధనగా మారి, పేపర్–రేడియో–OTT మొత్తం కలిసి ఒకేరోజు రజనీ ఉత్సవంగా మార్చాయి. ఒక్క మనిషి కోసం పత్రిక పేరే మారిన రోజు… అదే రజినీ రోజు..

 

(విధాత వినోదం డెస్క్​)

Rajinikanth Times | భారత సినీ చరిత్రలో ప్రతి దశాబ్దానికీ ఎంతోమంది నటులు వచ్చారు.. కొందరు ప్రకాశించారు..  మరికొందరు క్రమంగా మరుగునపడ్డారు. కానీ ఒకే ఒక్కరు మాత్రం అలా కాలానికి కూడా లొంగకుండా, ప్రతి తరం గుండెల్లో అదే ముద్ర, తనదైన స్టైల్​తో నిలిచారు — అతనే.. సూపర్​స్టార్​ రజనీకాంత్.

నిన్న ఉదయం భారత పత్రికా ప్రపంచం ఒక అరుదైన ఘట్టాన్ని చూసింది. 100 ఏళ్ల చరిత్ర గల హిందుస్తాన్ టైమ్స్ తన పేరునే మార్చేసి, ఆ రోజు పేపర్ మొదటి పేజీలో తన మాస్ట్​హెడ్​ను ‘రజనీకాంత్ టైమ్స్’ గా మార్చి ముద్రించింది. ఒక వ్యక్తికి ఇంతటి గౌరవం ఇవ్వడం—ఇది ఆ పత్రికా చరిత్రలో నే కాదు.. భారతదేశ పత్రికా చరిత్రలోనే మొదటిసారి.

హిందుస్తాన్ టైమ్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

ఎందుకంటే రజనీ అనేది ఒక హీరో పేరు కాదు… ఒక ఉద్యమం, ఒక వ్యక్తిత్వం, ఒక సంస్కృతి, ఒక కాలం..

చెన్నైలోని ఆయన ఇంటి ముందు ప్రతి రోజు కోరికలతో వచ్చే ప్రజలు, మదురైలో ఒక అభిమాని కట్టించిన 5,500 ఫోటోల దేవాలయం… ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతాయి — రజనీ అంటే కేవలం స్టార్ కాదు… ఆరాధ్యుడు.

రజనీ కథ – బస్సు కండక్టర్ నుంచి స్క్రీన్​ థండర్​  వరకు

బెంగళూరులో బస్సు కండక్టర్‌గా జీవితం మొదలుపెట్టి, 1975లో ‘అపూర్వ రాగంగల్’తో​  తెరపైకి అడుగుపెట్టిన యువకుడు… భారత సినీ ప్రపంచమే చూసే విధానాన్ని మార్చేసాడు. సిగరెట్ తిప్పడం, కళ్లజోడు సెట్ చేయడం, చేతుల స్టైల్, మాటల తీరు,  ఇవన్నీ ఆయనకే ప్రత్యేకం. నేటికీ ఒక పంచ్ డైలాగ్ చెబితే, దానికి వచ్చే చప్పట్లు రజనీనే గుర్తు చేస్తాయి. అవి సినిమా సన్నివేశాలు కాదు… ఫ్యాన్స్‌కు నిత్యం ఎనర్జీ ఇచ్చే క్షణాలు.

హిందుస్తాన్ టైమ్స్ ప్రత్యేక అంకితం – ఎందుకు అంత పెద్ద విషయం?

ఈ స్పెషల్‌ ఎడిషన్‌లో హిందుస్తాన్ టైమ్స్ తన మాస్ట్‌హెడ్‌ను రజనీ ప్రయాణానికే అంకితం చేసింది. 1975 నుంచి 2025 వరకూ…
అపూర్వ రాగాంగల్ → బాషా → ముత్తు → తలపతి → కబాలి → కాలా → పెట్టా → జైలర్ → వెట్టయాన్ → కూలీ
అన్ని కాలాల రజనీని ఒకే పేజీలో పండగలాగా ప్రింట్ చేశారు. అక్కడితో ఆగలేదు…

HT మీడియా నెట్‌వర్క్‌లోని అన్ని మీడియా ప్లాట్​ఫాంలు.. ఫీవర్ FM, OTTplay—అన్నీ.. రజనీ థీమ్‌నే ఫాలో అయ్యాయి. OTTplayలో ప్రత్యేక రజనీ కలెక్షన్ పెట్టి ఫ్యాన్స్‌కు “ఒక్క క్లిక్ → 30 ప్లాట్‌ఫార్మ్స్ → అంతా రజనీ” అని అలరించింది.

దేశమంతా రజనీ గురించే మాట్లాడింది. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్​ను ఈ నెలలో గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి – 2025) ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించనున్నారు.

ఈ ప్రత్యేక సంచిక వెలువడిన వెంటనే సోషల్ మీడియా మొత్తం రజనీ పేరే మారుమోగింది. పేపర్ చూసిన వాళ్లు వెంటనే ఫోటోలు పెట్టారు. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రజనీ స్వయంగా Xలో స్పందిస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పారు.

అది చూసిన వెంటనే ఫ్యాన్స్ ఒక్క మాటే అన్నారు — “ఇవన్నీ తలైవాకు తక్కువే!”

50 ఏళ్లు గడిచినా… రజనీ క్రేజ్ తగ్గలేదు. ఒక సినిమా వచ్చేటప్పుడు వేడుకలా ఎదురు చూసే రజనీ ఫ్యాన్స్​, ఒక still చూసినా పండగ చేసుకుంటారు. అతని స్టైల్, అతని సరళత, అతని వ్యక్తిత్వం—ఇవన్నీ కలిసి రజనీని ఒక అపూర్వమైన స్థాయికి తీసుకెళ్లాయి.

అందుకే హిందుస్తాన్ టైమ్స్ మొదటి పేజీ మార్పు కేవలం డిజైన్ కాదు…భారతదేశం మొత్తం రజనీకి ముందే వందనం చేసిన రోజు.

Latest News