విధాత : ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలన్న ప్రవచనకర్త గరికపాటి నరసింహ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రచ్చ రేపుతున్నాయి. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలలో గరికపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగు దనం లేదని, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ పేరు ఉందని…తెలుగు జాతి,భాషలను చాటేలా రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలని గరికపాటి వ్యాఖ్యానించారు.
గతంలో మాజీ సీఎం ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయం మేరకు రాష్ట్రం పేరును తమిళనాడు తరహాలో తెలుగునాడుగా మార్చాలన్నారు. కేరళ ప్రజలు తమ రాష్ట్రాన్ని కేరళం మార్చేందుకు చూపిన పట్టుదలను తెలుగు ప్రజలు చూపించాలని, అప్పుడే రాష్ట్రం పేరుతో పాటు మన బతుకులు కూడా బాగుపడుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదని…అందుకే తెలుగునాడుగా మార్చాలన్న గరికపాటి డిమాండ్ పై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉంది అన్నారు. అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారు.. వింత పోకడలు, వింత ఆలోచనలు మంచిది కాదు అన్నారు. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదు.. ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారు అని మండిపడ్డారు. నాలుగు జిల్లాల రాయలసీమను ఓ ప్రాంతంగా పేర్కొని తెలుగు ప్రాంతాన్ని ముక్కలు చెక్కలుగా చేశారన్నారు. ఈ తరహా విభజన వాదాలు, విద్వేషపు మాటలు ఇక మానుకోవాలన్నారు.
చరిత్రను, మూలాలను వదిలేసి మాట్లాడటం తగదని, మేం ఆంధ్రులం, ఆంధ్రప్రదేశ్ గానే ఉంటాం అన్నారు. గరికపాటి తెలంగాణలో సెటిలయ్యారు, ఆంధ్రాకు రారు.. ఎక్కడో ఉండే గరికపాటి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వవద్దు అని, మా ప్రాంతం.. మా బ్రతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు అని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్పష్టం చేశారు.
అటు సోషల్ మీడియాలో సైతం గరికపాటి వ్యాఖ్యలపై వాదోపవాదాలు సాగుతున్నాయి. “ఆంధ్ర” రాజ్యం ఉనికి కనీసం 2400 ఏండ్ల నాటిది అని శాసనాలు చెబుతున్నాయని, ఇది కర్నూలు జిల్లా ఎర్రగుడిలో అశోకుడి శాసనాల్లోని 13వ శాసనం(క్రి పూ మూడవ శతాబ్దం నాటిది) అని, తన పాలనలో ఉన్న ఆంధ్ర రాజ్యంలో ధర్మం ఆచరించుకున్నారు అని అశోకుడు రాసాడని గుర్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Raja Singh| ఇరాన్ అనుకూల ర్యాలీలు చేసే వారిని అక్కడికే పంపించాలి : రాజాసింగ్
KTR allegations on Congress| కాళేశ్వరం బ్యారేజీలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ : కేటీఆర్ ఫైర్
