Dhandoraa Movie Review Telugu | Shivaji | Caste Based Social Drama
విధాత ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్ | డిసెంబర్ 25, 2025
ఒక మనిషిలోకి ఇద్దరు మనుషులు. ఒకడు అత్యాధునిక సాంకేతికతో అంతరిక్షంలోకి దూసుకెళ్తే, మరొకడు మాత్రం ఇంకా కులం, మతం అనే రాతియుగపు సంకెళ్లలోనే చిక్కుకుని ఉన్నాడు. బతికున్నప్పుడు నీ కులం ఏంటని అడగడమే అనాగరికం అనుకుంటే… చనిపోయాక కూడా శ్మశానంలో చోటు ఇవ్వకుండా అడ్డుకోవడం మరింత భయంకరమైన నిజం. ఇది ఆ రెండోవాడి నైజం. అలాంటి ఒక హీనమైన వాస్తవాన్నే కథగా మలిచిన సినిమా ‘దండోరా’.
ఇది వినోదం కోసం కాదు. నిజానికి మనల్ని అసౌకర్యానికి గురిచేసే సినిమా. మన ఆలోచనల్ని కుదిపేసే సినిమా.
ఈ కథ ఓ శవంతో మొదలవుతుంది. ఊరి పొలిమేరల్లో నలుగురు మనుషులు ఒక వృద్ధురాలి శవాన్ని మోసుకుంటూ వెళ్తుంటారు. ఆ ఒక్క సన్నివేశమే దర్శకుడు చెప్పాలనుకున్న కఠిన వాస్తవాన్ని స్పష్టంగా చెబుతుంది. ఇది చావుతో మొదలై, చావుతోనే అంతమయ్యే కథ. ఈ రెండు చావుల మధ్య ఓ మనిషి సంఘర్షణే దండోరా.
కులాన్నే నమ్మినవాడికి అదే కులం చేసిన “ఆఖరి మర్యాద”
ఈ కథలో అసలు షాక్ ఏంటంటే బాధితుడు అణగారిన కులానికి చెందిన వ్యక్తి కాదు. అగ్ర కులానికి చెందిన శివాజీ (శివాజీ). తన జీవితమంతా కులాన్ని, పరువును, అహంకారాన్ని నమ్మి బతికిన మనిషి. ఆ వర్ణ వ్యవస్థను కాపాడినవాడే. కానీ అతడు మరణించాక అదే కులం అతడి శవాన్ని శ్మశానంలోకి కూడా రానివ్వదు.
ఇదే ‘దండోరా’ వేసిన గుండెల్ని పిండేసే వ్యంగ్యం. కులానికి సేవ చేసినవాడిని అదే కులం అసహ్యించుకుంటుంది. “చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద… అది మర్యాదగానే జరగాలి” అనే భావన చుట్టూనే సినిమా తిరుగుతుంది. శివాజీ చావు ఒక వ్యక్తి మరణం కాదు. అది ఒక తండ్రి ఓటమి. ఒక అహంకారానికి శిక్ష. ఒక ఊరి ముఖచిత్రం.
తొలిసగంలో కథ కొంత నెమ్మదిగా సాగుతుంది. ప్రేమకథ, ఊరి గొడవలు రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా అసలు రూపం బయటికొస్తుంది. శివాజీ పాత్రలో వచ్చే మార్పే సినిమాకి ప్రాణం. అగ్రహం నుంచి ఆత్మవిమర్శకు, అహంకారం నుంచి పశ్చాత్తాపానికి అతడు చేసే ప్రయాణం ప్రేక్షకుడినీ కదిలిస్తుంది.
నటన, మాటలు, ముగింపు – మిగిలిపోయే ప్రశ్న
ఈ సినిమాను భుజాన వేసుకుని నడిచింది శివాజీ నటన. ‘కోర్ట్’ సినిమాలోని మంగపతి ఛాయలు కనిపించినా, ఇక్కడ అతడు మరింత గాఢమైన భావోద్వేగాన్ని పలికించాడు. కొడుకుగా నందు మనసుల్ని కదిలిస్తాడు. నవదీప్ సర్పంచ్ పాత్రలో గంభీర నటన ప్రదర్శించాడు. బిందు మాధవి పోషించిన వేశ్య పాత్రను గౌరవంగా మలిచిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సంభాషణలు సినిమాకి ప్రధాన బలం.
“మన చావు పుట్టుకలన్నీ ఊరి బయటే రాసిండ్రా దేవుడు”
“చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద” లాంటివి గుండెల్లో నిలిచిపోతాయి.
క్లైమాక్స్‌లో ఎవరూ గెలవరు. కులం ఓడిపోదు. వ్యవస్థా కూలిపోదు. కానీ ఒక చిన్న మార్పు మొదలవుతుంది. శివాజీ చావు ఊరికి ఒక సమాధానం ఇస్తుంది. కానీ ప్రేక్షకుడికి మాత్రం ఒక ప్రశ్న మిగిలేఉంది.
మనం నిజంగా మారామా? లేదా మరో దండోరా వేసేంతవరకు చూస్తూనే ఉందామా?
‘దండోరా’ ఆడంబరాల సినిమా కాదు. కానీ, అవసరమైన సినిమా. కులం అనే కాలకూటాన్ని నిజాయితీగా ప్రశ్నించిన ప్రయత్నం.
విధాత రేటింగ్: ⭐⭐⭐ / 5
