Chiranjeevi | టాలీవుడ్‌లో మహిళల వస్త్రధారణ అంశం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమవగా, ఈ అంశంపై సినీ, సామాజిక వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు, ప్రతివిమర్శలతో వేడెక్కింది. ఈ వివాదంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా కేంద్రబిందువుగా మారారు. శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన సినీ ప్రముఖుల్లో నాగబాబు ఒకరు. మహిళలు ఏ రకమైన దుస్తులు ధరించాలన్నది చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆయన ప్రశ్నించారు.
ప్రతి మహిళకు ఆత్మగౌరవం ఉంటుందని, మోడ్రన్ దుస్తులు వేసుకోవడం తప్పుకాదని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వారి వస్త్రధారణ కారణం కాదని, అది పూర్తిగా మగవారి క్రూరత్వం వల్లే జరుగుతుందని వ్యాఖ్యానించారు. సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలంటూ సూచనలు చేసే వారికి గట్టి సమాధానం చెప్పాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ అంశంపై నాగబాబు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడంతో చర్చ మరింత ముదిరింది.అయితే నాగబాబు వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా శివాజీ మద్దతుదారులు ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
శివాజీ మాటల్లో తప్పేమీ లేదని, రెండు పదాలు మాత్రమే తప్పుగా వచ్చాయని, అందుకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారని వారు వాదిస్తున్నారు. మహిళలను పద్ధతిగా దుస్తులు ధరించమని చెప్పడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో నాగబాబు సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవి’ సినిమాలోని ‘హే జానా’ పాటను నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు. ఆ పాటలో మహిళల వస్త్రధారణపై వచ్చిన లిరిక్స్‌ను షేర్ చేస్తూ, అప్పట్లో చిరంజీవి చెప్పిన మాటలు సరైనవైతే, ఇప్పుడు శివాజీ మాటలు ఎందుకు తప్పవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. నాగబాబు మహిళల డ్రెస్సింగ్ విషయంలో గట్టి వైఖరి తీసుకున్న నేపథ్యంలో, అదే అంశంపై చిరంజీవి పాటను ఖండిస్తూ కూడా వీడియో విడుదల చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
చిరంజీవి పాటలోని వీడియో క్లిప్‌ను నాగబాబు వ్యాఖ్యలతో పక్కపక్కనే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. “అప్పుడు చిరంజీవి చెప్పింది సరైతే, ఇప్పుడు శివాజీ చెప్పింది కూడా తప్పు కాదు” అంటూ కొందరు వాదనలు వినిపిస్తున్నారు. దీంతో మహిళల వస్త్రధారణపై మొదలైన వివాదం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతూ మెగా కుటుంబం వైపు వెళుతుంది.
