Anasuya | శివాజీ వ్యాఖ్యల వివాదం నడుమ అనసూయ స్పందన… సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్

Anasuya |‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణపై ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు.

Anasuya |‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణపై ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. గాయని చిన్మయి, యాంకర్ అనసూయ, నాగబాబు వంటి వారు శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఈ వివాదం అనూహ్యంగా మరింత హైలైట్ అయ్యింది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా కనిపించిన వ్యక్తి అనసూయనే అని చెప్పాలి. శివాజీ క్షమాపణలు చెప్పినా, ఈ అంశంపై అనసూయ వరుసగా పోస్టులు చేస్తూ తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తోంది. దీంతో ఆమె పేరు మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.

అభిమానులతో ఇంటరాక్షన్‌లోనూ అదే టాపిక్

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ప్రత్యేకంగా చిట్‌చాట్ చేసిన అనసూయ, అక్కడ కూడా ఈ వివాదాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, శివాజీ అంశంపై తన స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేసింది. అలాగే తన తరపున టీవీ డిబేట్లలో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరో తనకు తెలియదని, ‘ఫ్యాన్స్ అసోసియేషన్’ అనే పేరుతో ఎవరు మాట్లాడినా అది తన అభిప్రాయంగా భావించవద్దని పేర్కొంది.

“నేను ఫెమినిస్ట్‌ని… కానీ పురుషుల వ్యతిరేకిని కాదు”

పురుషులను సినిమాలు, చర్చల్లో విలన్లుగా చూపిస్తున్నారనే విమర్శలపై స్పందించిన అనసూయ, తాను ఫెమినిస్ట్‌ని అయినా పురుషుల పట్ల ద్వేషం కలిగిన వ్యక్తిని కాదని స్పష్టంగా చెప్పింది. మహిళల భద్రతపై మాట్లాడేటప్పుడు కూడా పాజిటివ్‌గా చెప్పాలని, అబ్బాయిలు అమ్మాయిలకు తోడుగా ఉంటామని భరోసా ఇవ్వడం మరింత మంచిదని అభిప్రాయపడింది.

ట్రోలింగ్‌పై స్పష్టమైన సమాధానం

తనపై వస్తున్న ట్రోలింగ్‌ల గురించి మాట్లాడుతూ, తాను చెప్పేది ఒకటైతే చర్చ దారి మళ్లిపోతుందని అనసూయ పేర్కొంది. అయినా తనకు తన విలువలపై నమ్మకం ఉందని, అవసరమైతే స్పందిస్తానని, లేదంటే అలాంటి విషయాలను వదిలేస్తానని తెలిపింది. ఈ సందర్భంగా “ఇది నా డెస్టినీ, నేను కారణజన్మురాలిని అనుకుంటాను” అని చెప్పడం మరోసారి నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలపై కొందరు సరదాగా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

‘ఫ్యాన్స్’ అనే పదంపై అభ్యంతరం

ఫ్యాన్స్ అసోసియేషన్‌ల గురించి మాట్లాడిన అనసూయ, తనను ఫాలో అయ్యేవాళ్లను అభిమానులుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తానని చెప్పింది. తన పేరుతో పేజీలు లేదా సంఘాలు ఉన్నా, వ్యక్తిగతంగా కలవని వాళ్లు తన పేరు వాడుకుని మాట్లాడితే తాను అంగీకరించనని స్పష్టం చేసింది. మొత్తంగా శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం, అనసూయ స్పందనలతో మరో స్థాయికి చేరింది. ఆమె ప్రతి మాట, ప్రతి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణమవుతుండటంతో ఈ అంశం ఇంకా కొంతకాలం హాట్ టాపిక్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest News