Naa Anveshana | సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారనే అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ‘నా అన్వేషణ’ (Naa Anveshana) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ ఉదంతం స్పష్టంగా చూపిస్తోంది. ప్రపంచ యాత్రికుడిగా పేరొందిన అన్వేష్, వివిధ దేశాలు తిరుగుతూ అక్కడి ఆహారం, సంస్కృతి, ఆచారాలపై వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం ద్వారా భారీ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించాడు.
ఈ ఏడాది బెట్టింగ్ యాప్‌లపై చేసిన వ్యాఖ్యలతో అన్వేష్ మరింత హైలైట్ అయ్యాడు. అయితే ఫాలోవర్స్ ఎప్పటికీ ఒకేలా ఉంటారని భావించడం అవివేకమని, మాట తేడా వస్తే అదే ఫాలోయింగ్ ఎలా దూరమవుతుందో తాజాగా అన్వేష్‌కు అనుభవంగా మారింది. నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అన్వేష్ స్పందిస్తూ తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడాడు. ఈ క్రమంలో గరికపాటి నరసింహారావును కూడా వివాదంలోకి లాగి బూతులతో దూషించాడు. అక్కడితో ఆగకుండా హిందూ దేవతలు, రామాయణం, మహాభారతం ప్రస్తావన తీసుకొచ్చి సీతాదేవి, ద్రౌపది పాత్రలను ఉదాహరణగా చెప్పిన తీరు తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. కీచకుడు, సైంధవుడు, రావణాసురుడు వంటి పాత్రలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాలను తీవ్రంగా మండిపడేలా చేశాయి.
అన్వేష్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు కేసుల భయం, మరోవైపు ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా తగ్గడం అన్వేష్‌ను వెనక్కి తగ్గేలా చేసింది. చివరికి వినాయకుడి సన్నిధానంలో వీడియో విడుదల చేసిన అన్వేష్, సీతాదేవి, ద్రౌపది దేవికి క్షమాపణలు కోరుతూ, శివాజీ, గరికపాటి నరసింహారావు, హిందూ సంఘాలందరికీ సారీ చెబుతున్నట్లు ప్రకటించాడు. తన మాటలు తప్పుగా అర్థమయ్యాయని, తప్పు దొర్లిందని అంగీకరిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడించాడు.
మొత్తంగా ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో, అదే సమయంలో బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మరోసారి రుజువు చేసింది. ఫాలోవర్స్ ఇచ్చే మద్దతు ఎంత వేగంగా వస్తుందో, అదే వేగంతో వెనక్కి తీసుకుంటారన్న విషయం అన్వేష్ ఉదంతంతో స్పష్టమైంది.
