Dario Amodei AI | 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు మాయం.. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు నిజమేనా?

కృత్రిమ మేధ.. ఒకప్పుడు చర్చల్లోనే ఉన్న ఈ అంశం.. వాస్తవరూపం దాల్చి.. విస్తృత స్థాయిలో విస్తరించుకుంటూ పోతున్నది. అనేక ఉద్యోగాలను అనవసరంగా మార్చిపడేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ సీఈవో చేసిన వ్యాఖ్యలు టెక్‌ రంగాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి.

ai-software-jobs-warning-analysis

Dario Amodei AI | ఒకప్పుడు కోడింగ్‌ నేర్చుకున్నవాళ్ల భవిష్యత్తుకు ఢోకా లేదనుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే రాబోయే తరాలను శాశిస్తాయని భావించారు. నిజానికి సాఫ్ట్‌వేర్‌ పునాదులు వేసుకోవడానికి.. అభివృద్ధి చెందడానికి దశాబ్దాలకుపైగా పట్టింది. అయితే.. ఈ మధ్యలో పుట్టుకొచ్చి.. నడవటమే కాదు.. రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఏఐ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిదంటే.. ఒక విచిత్రం తెరపైకి వచ్చి.. అది అర్థం చేసుకునేలోపే మరో వంద విచిత్రాలను ఏఐ చేసిపారేస్తున్నది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ రంగం ఇక కొన్నాళ్లలో మూటా ముల్లె సర్దుకుని కొత్త దారిలో నడవాల్సిందేనన్న అభిప్రాయాలు స్థిరపడుతున్న వేళ.. ఒక సీఈవో చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ను అతలాకుతలం చేసిపారేస్తున్నాయి. ఆరు నెలలు.. మహా అయితే ఏడాదిలోపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల అవసరం లేకపోవచ్చు.. అంటూ ఆంథ్రోపిక్‌ సీఈవో (Anthropic CEO) డారియో అమోడి (Dario Amodei) చెప్పిన మాటలు ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ.. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని సమూలంగా మార్చివేయనున్నదనేది ఆయన భావన. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక ఫోరం (World Economic Forum)లో ఆయన మాట్లాడిన మాటలు ఏఐకి మించిన వేగంతో వైరల్‌ అయ్యాయి.

ఇప్పటి దాకా ప్రోగ్రామర్లకు సహాయం చేసిన ఏఐ టూల్స్‌.. సహకారం అందించడం కాకుండా.. స్వయంగా కోడ్‌ రాసేస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. బగ్స్‌ ఫిక్స్‌ చేయడంతోపాటు.. పూర్తిస్థాయిలో అప్లికేషన్లను కూడా అవే తయారు చేస్తున్నాయని అమోడి అన్నారు. దానర్థం.. మనిషి కోడ్‌ రాయడం కాదు.. ఏఐ రాసిన కోడ్‌ను మనిషి చెక్‌ చేసే దశకు వచ్చేశామని ఆయన వ్యాఖ్యానించారు. అమోడి సీఈవోగా వ్యవహరిస్తున్న అంథ్రోపిక్‌ సంస్థలో ఇంజినీర్లు Claude వంటి ఏఐ మోడళ్లతోనే అధికభాగం కోడ్‌ జనరేట్‌ చేయిస్తున్నారు. వాటిని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు రివ్యూ చేసి.. ఫైన్‌ట్యూన్‌ చేస్తున్నారు. అతి త్వరలోనే మొత్తం డెవలప్‌మెంట్‌ ప్రాసెస్‌ను ఏఐ హ్యాండిల్‌ చేయగలదని డారియో అమోడి అంచనా వేస్తున్నారు. అంటే.. ప్లానింగ్‌ మొదలుకుని.. కోడింగ్‌.. టెస్టింగ్‌.. బగ్‌ ఫిక్సింగ్‌ వరకూ మొత్తం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సైకిల్‌ను ఏఐ నిర్వహించగలదని ఆయన చెబుతున్నారు. అదే జరిగితే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పాత్ర.. కోడ్‌ రాసే ఉద్యోగి స్థాయి నుంచి.. ఏఐ సూపర్‌వైజర్‌గా మారిపోతుంది.

అమోడి చేసిన వ్యాఖ్యలు టెక్‌ రంగంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కొంతమంది అమోడి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. ఆ ప్రమాదం మన వాకిట్లోకి వచ్చేయలేదని అంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వెంటనే మాయమైపోతాయని తాను భావించడం లేదన్న జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వేంబు.. అదే సమయంలో డారియో అమోడి హెచ్చరికలను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యాధునిక ఏఐ టూల్స్‌ తయారు చేసిన వ్యక్తి మాటలని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

ఏఐకి ఇంకా పరిమితులున్నాయా?

అవుననే అంటున్నారు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు. ఏఐ అత్యంత వేగంగా కోడ్‌ రాయగలదని, కానీ.. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని చెబుతున్నారు. వాస్తవిక ప్రపంచ సమస్యలను అర్థం చేసుకోవడంలో ఏఐకి ఇంకా చాలా పరిమితులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పెద్ద పెద్ద సిస్టమ్‌ల బాధ్యతను ఏఐ తీసుకోవడం ఇంకా కష్టమేనని చెబుతున్నారు. దీనర్ధం.. మనుషులను/ఉద్యోగాలను ఏఐ రీప్లేస్‌ చేయడం ఇప్పటికిప్పుడు అనుకున్నంత సులభం కాదని పేర్కొంటున్నారు. ఉద్యోగాలు మాయం కావడం సంగతి పక్కనపెడితే.. మార్పు మాత్రం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు పూర్తిగా పోవని, కానీ.. పనితీరు మారిపోతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. భవిష్యత్‌ కాలంలో.. తక్కువ కోడింగ్‌, ఎక్కువ ప్లానింగ్‌, ఏఐ ఔట్‌పుట్‌ చెకింగ్‌, సిస్టమ్‌ డిజైనింగ్‌, వ్యూహాత్మక సమస్యల పరిష్కారం.. ఇవే ముఖ్యమవుతాయని చెబుతున్నారు.

డారియో అమోడి చెబుతున్నదాని ప్రకారం.. ఏఐ ప్రభావం ఒక్క కోడింగ్‌ వరకూ పరిమితం కాబోదు. ఇది ఇతర వృత్తులపైనా ప్రభావం చూపుతుందని ఆయన అంటున్నారు. ప్రస్తుతం డాటా అనలిస్టులు, డిజైనర్లు, రిసెర్చర్లు, కంటెంట్‌ క్రియేటర్లు.. ఇలా అనేక రంగాలవారిపై ఏఐ ప్రభావం గణనీయంగా పడుతుందని ఆయన అంచనా.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల శకం ఏడాదిలోపే ముగుస్తుందా? అనేది పక్కన పెడితే.. టెక్‌ రంగాన్ని ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా కృత్రిమ మేధ మార్చవేస్తుందనే విషయంలో నిపుణులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డెవలపర్లు భయపడటం కాకుండా.. ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవడమే వారి ఉనికిని నిలబెట్టే అసలైన స్కిల్‌ అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Artificial Intelligence | ఏఐతో ఆ మూడు ప్రొఫెషన్స్‌కు ఎలాంటి భయం లేదు! బిల్ గేట్స్ గుడ్ న్యూస్‌

AI Replacing Software Jobs | ‘ఏఐ’తో లక్షల ఉద్యోగాలు ఊస్ట్.. తీవ్ర ఒత్తిడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు!

Latest News