విధాత: కొంత కాలంగా త్రిపుర రాజధాని అగర్తలాలో భారీగా ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని, అందులో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని ఇకపై అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్‌ఐవీ (HIV) పరీక్షలు నిర్వహించాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో అగర్తలాలోని కాలేజీల్లో ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా డ్రగ్స్ మూలాలను కనుక్కోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ప్రముఖ కాలేజీల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని సీఎం వెల్లడించారు.
డ్రగ్స్ వినియోగం వల్ల విద్యార్థులు అడ్డ దారులు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగర్తలా లోని జీబీపీ ఆసుపత్రిలో ప్రతి రోజూ మూడు పాజిటివ్ కేసులు నిర్ధారించబడుతున్నాయని, వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని విప్లవ్ చెప్పారు.
పరిస్థితిని అదుపుచేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్రం నుంచి హెచ్‌ఐవీని పూర్తిగా నిర్మూలించడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని అధికారు లకు సూచించారు.
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ కమిటీ లెక్కల ప్రకారం.. త్రిపురలో 2459 హెచ్‌ఐవీ కేసులు నమోదవగా ఇందులో 750 మంది మహిళలు, 1709 మంది పురుషులు ఉన్నారు. గత 20 ఏండ్లలో 640 మంది హెచ్ఐవీ మూలంగా మరణించారు.