HIV | ఉత్తరాఖండ్( Uttarakhand )లోని హల్ద్‌వాని జైల్లో హెచ్ఐవీ( HIV ) కలకలం సృష్టిస్తోంది. ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారిలో 44 మంది ఖైదీలు( Prisoners ) హెచ్ఐవీ బారిన పడ్డారు. వీరిలో ఒక మహిళా ఖైదీ కూడా ఉండటం గమనార్హం. అయితే హెచ్ఐవీ బారిన పడ్డ ఖైదీలందరికీ జైల్లోనే చికిత్స అందిస్తున్నట్లు సుశీలా తివారీ హాస్పిటల్, ఏఆర్‌టీ సెంటర్ ఇంచార్జి డాక్టర్ పరంజిత్ సింగ్ వెల్లడించారు.
హెచ్ఐవీ రోగుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోగులందరికీ యాంటీరిట్రోవైరల్ థెరపీ కొనసాగిస్తున్నామని చెప్పారు. జైల్లో ఉన్న ఖైదీలందరికీ రెగ్యులర్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేషనల్ ఎయిడ్స్( AIDS ) కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం హెచ్ఐవీ బారిన పడిన ఖైదీలకు ఉచితంగానే వైద్యం, మెడిసిన్స్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. హల్ధ్‌వాని జైల్లో ప్రస్తుతం 1629 మంది మగ ఖైదీలు, 70 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. మిగతా వారికి హెచ్ఐవీ సోకకుండా ఉండేందుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.