Samantha | కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో ప్రతిష్టించబడిన లింగభైరవి దేవి ఇటీవల భక్తుల ఆసక్తికి కేంద్రబిందువైంది. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపంగా లింగభైరవి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సాధకులను ఆకర్షిస్తోంది. తాంత్రిక యోగ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దేవీ రూపాల్లో ఒకటైన భైరవి ప్రత్యేక లింగాకార స్వరూపమే ‘లింగభైరవి’. కొద్ది రోజుల క్రితం సమంత(Samantha)-రాజ్‌లు లింగ భైరవి దేవి సమక్షంలో వివాహం చేసుకోవడంతో ఒక్కసారిగా లింగ భైరవి దేవి గురించి అందరు ఆరాలు తీస్తున్నారు.
లింగభైరవి దేవి ఎవరు?
తాంత్రిక యోగ సంప్రదాయంలో శక్తి స్వరూపంగా పరిగణించే భైరవి దేవికి లింగాకారంలో రూపొందించిన ప్రత్యేక రూపమే లింగభైరవి. ఇది జీవంత శక్తికేంద్రం (Energy Form) గా భావించబడుతోంది. ప్రపంచంలో ఏకైక లింగభైరవి ఆలయం తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని ఈ షా యోగా సెంటర్‌లో ఉంది.
లింగభైరవిని ఎవరు పూజిస్తారు?
లింగభైరవి పూజను ఆధ్యాత్మిక సాధకులు, యోగులు, సద్గురు అనుచరులు, జీవితం లో భౌతిక–మానసిక సమతుల్యత కోరుకునే వారు, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, వివాహ సమస్యలకు పరిష్కారం కోరే భక్తులు పూజిస్తారు. అలానే తాంత్రిక సాధకులు కూడా పెద్దఎత్తున ఆరాధిస్తున్నారు. ఈషా ఆలయంలో రుతుక్రమం ఉన్న మహిళలకూ ప్రవేశం కల్పించడం ప్రత్యేక అంశంగా గుర్తింపు పొందింది.
లింగభైరవి పూజ ఎలా చేస్తారు?
లింగభైరవి పూజ సాధారణంగా శాంతమయంగాను, శక్తివంతంగాను ఉంటుంది. దేవాలయంలో రోజూ మూడు వేళలా హారతులు, అభిషేకం, దేవీ స్తోత్రాలు, లింగభైరవి అర్ఘ్యం ఉంటుంది. మనం ఇంట్లో కూడా లింగ భైరవి పూజ చేయవచ్చు. లింగభైరవి యంత్రం లేదా చిన్న ప్రతిమను ప్రతిష్ఠించడం, ప్రతి సాయంత్రం దీపం వెలిగించడం, పసుపు, కుంకుమ, పూలతో నీళ్లు కలిపిన అర్ఘ్యాన్ని సమర్పించడం, “ఓం లింగష్టకం భైరవ్యై నమః” జపం లేదా ఇషా పాదకముల మంత్రాల పఠనం చేయడం, అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు చేయడం వలన శరీర–మనస్సుకు సానుకూల శక్తి లభిస్తుందని భక్తులు (Devotees) నమ్ముతున్నారు.
భక్తుల విశ్వాసం ప్రకారం లింగభైరవి పూజ వల్ల ప్రయోజనాలు ఏంటంటే..
భౌతిక శ్రేయస్సు: ఆరోగ్యం, సంపద, కుటుంబ శాంతి
మానసిక స్పష్టత: ఆందోళన, ఒత్తిడిని తగ్గించడం
భావోద్వేగ సమతుల్యత: ఆత్మవిశ్వాసం, సహనం పెరుగుతుంది
ఆధ్యాత్మిక వృద్ధి: అంతరశక్తి పెంపు, మోక్ష మార్గానికి దోహదం
లక్షలాది భక్తుల అభిప్రాయం ప్రకారం, లింగభైరవి మన కోరికలు తీర్చే దేవత కంటే, మనలోని శక్తిని మేల్కొల్పే దేవతగా పరిగణించబడుతోంది. భక్తి, శ్రద్ధతో పూజిస్తే వ్యక్తి జీవితంలో అద్భుత మార్పులు సంభవిస్తాయని వారు చెబుతున్నారు.
