Site icon vidhaatha

Kishan Reddy: త్వరలో 10 నేషనల్ హైవేల ప్రారంభోత్సవం: కిషన్ రెడ్డి

Kishan Reddy:

విధాత: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.6,280కోట్లతో 285కిలోమీటర్ల మేరకు చేపట్టిన 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని.. పార్లమెంట్ సమావేశాల అనంతరం వాటిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. బీజేపీ (Bjp) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే 51కిలోమీటర్లతో కూడిన రెండు జాతీయ పార్టీల పనులను ప్రారంభిస్తామన్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని.. ఫైనాన్సు సంబంధించిన పార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశామన్నారు. ఉత్తర భాగం భూ సేకరణకు సంబంధించి 50 శాతం వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని తెలిపారు. రూ.18777 కోట్లతో ఈ ఉత్తర భాగం రోడ్డు నిర్మాణ అంచనాలు వేశారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ల కింద భూసేకరణ పూర్తి చేయాలని..ఆ పనులు చేస్తేనే వాటి కింద రోడ్డు వేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఆరు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తికాకపోవడంతో అంబర్ పేట ఫ్లైఓవర్ కింది భాగం పూర్తి కాలేదన్నారు.

హైదరాబాద్-పుణే మార్గంలో బీహెచ్ఈఎల్ వద్ద (జాతీయ రహదారి 65) ఫైఓవర్ పూర్తి అయ్యిందన్నారు. ఈ ఫ్లైఓవర్ వద్ద సిగ్నల్ ఫ్రీగా వెళ్లొచ్చన్నారు. పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి 61 (17 కి. మీ), ఎన్ హెచ్ 65 (22 కి.మీ.) పూర్తి అయ్యిందని.. జనగాం – దుద్దెడ మార్గంలో భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేసి ఇస్తే.. అంతే త్వరగా రోడ్డు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం విజయవాడ మధ్య వెంకటాయపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యింది. కోచ్ ప్యాక్టరీ నిర్మాణం వేగంగా జరుగుతోందని.. వచ్చే సంవత్సరం నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని..కాంగ్రెస్ మంత్రులు వరంగల్ వెళ్ళి చూసి రావాలి” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు.

డిలిమిటేషన్ తో తెలంగాణాలో ఓట్లు, జనాభా తగ్గినా, ఒక్క పార్లమెంట్ సీటు తగ్గబోదని.. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి ‘రేవంత్ రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హిందీ భాషను కేంద్రం ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదన్నారు. తప్పుడు ప్రచారాలతో దేశానికి, ప్రజలకు వారు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాక ముందు లిఖితపూర్వకంగా అనేక హామీలు ఇచ్చారని..వాటి అతీగతీ లేదని.. అధికారంలోకి వచ్చాక కొత్త ప్రాజెక్టులు ముందు వేసుకున్నారని.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version