విధాత : తమిళనాడు నూతన బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) ఎంపికయ్యారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఒకే నామినేషన్ రావడంతో నైనార్ నాగేంద్రన్ ఎన్నిక ఖరారైందని స్వయంగా హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై కూడా నాగేంద్రన్ వైపు మొగ్గుచూపారని సమాచారం. నాగేంద్రన్ తమిళనాడు రాష్ట్ర బీజేపీకి 13వ రాష్ట్ర అధ్యక్షుడు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో అన్నాడిఎంకే, బీజేపీల మధ్య శుక్రవారం పొత్తు సైతం కుదిరింది. పొత్తు సానుకూలంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.
అన్నాడీఎంకే నుంచి బీజేపీ సారధిగా నాగేంద్రన్
నాగేంద్రన్ ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అన్నాడీఎంకేలో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు. జయలలిత హయాంలో మంత్రిగా కూడా సేవలందించారు. జయలలిత మరణం తర్వాత 2017లో ఆయన అన్నాడీఎంకే పార్టీని వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు.
అప్పటి నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ శ్రేణుల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.